ప్రమాణం చేయకముందే భారీ కుంభకోణం
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఆరోపణలు
హైదరాబాద్, జూన్7 (విజయక్రాంతి): మోదీ మూడోసారి అధికారం చేపట్టకముందే పెద్ద కుంభకోణానికి తెరదీశారని పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. స్టాక్ ఎక్స్‌చేంజ్ మార్కెట్లో అల్లకల్లోలం సృష్టించి మదుపరులకు రూ.30 లక్షల కోట్లు నష్టపోవడానికి కారకులయ్యారని విమర్శించారు. గాంధీభవన్ లో శుక్రవారం మాట్లాడుతూ.. మే 13న మోదీ, అమిత్‌షా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 4వ తేదీలోపు షేర్లు కొనాలని, ఆ తర్వాత మీకు అందుబాటులో లేనంతగా ధరలు పెరుగుతాయని చెప్పడంలో ఆంతర్యమేమిటనీ? నిలదీశారు. జూన్ 1న ఎన్‌డీఏకు 400 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌పోల్ రాగానే ఒకే రోజు రూ.13 లక్షల కోట్లు షేర్ మార్కెట్ లాభాలు గడించాయన్నారు. కానీ, జూన్ 4న ఎన్నికల ఫలితాలతో వాస్తవాలు తెలియగానే షేర్ మార్కెట్ రూ.31 లక్షల కోట్ల నష్టపోయిందని తెలిపారు. దీనికి మోదీ, అమిత్‌షాలే పూర్తి బాధ్యులని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో కష్టపడితే అవకాశాలు
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూన్7 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రోజు అవకాశాలు వస్తాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధులతో శుక్రవారం ఆయన సమావేశం అయ్యారు. అంతకుముందు ఎంపీగా విజయం సాధించిన చామలను నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రావడానికి, ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవడానికి ప్రధానంగా పార్టీ మీడియా ఇన్‌చార్జిగా ఉండటం కూడా ఒక కారణమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలతో మమేకమై పోవడం వల్లే తన విజయం సాధ్యమైందన్నారు.






