31 July, 2026 | 12:51 AM

చెక్కని శిల్పం.. చక్కని రూపం!

31-07-2026 12:00 AM

సహజ సౌందర్యంతో చూపరులను కట్టిపడేస్తున్న వైనం                     

పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండా సమీపంలో రాళ్లగుట్టపై మానవ రూపం

తిలకించేందుకు తరలివస్తున్న జనం

పురావస్తు శాఖాధికారులు పరిశీలించి అభివృద్ధి చేయాలని స్థానికుల విన్నపం                       

సూర్యాపేట, జూలై 30 (విజయక్రాంతి): శిలలపై చెక్కిన శిల్పాలు మనకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. అయితే కొన్నిసార్లు ప్రకృతిలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని రూపాలు అందరినీ ఆశ్చర్యమును కలిగిస్తూ చూపులు అక్కడే కట్టిపడేస్తుంటాయి. దీనికి మంచి ఉదాహరణ జిల్లాలోని పెన్ పహాడ్ మండలంలో గూడెపుకుంట తండా సమీపంలో రాళ్ల గుట్టపై సహజ సిద్ధంగా ఏర్పడిన మానవ రూపాన్ని కలిగి ఉన్నటువంటి శిల్పం. దీంతో అందరూ దీన్ని చెక్కని శిల్పం చక్కని రూపం అంటూ బాగా ప్రచారం చేస్తున్నారు.

ఆకట్టుకుంటున్న మానవ రూపం: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ రాళ్ల ఆకారాలు ప్రస్తుతం స్థానికులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మండలంలోని నూర్జజాన్ పేట, గూడెపుకుంట తండా సరిహద్దుల్లో ఉన్న ఒక గుట్టపై మనుషులను పోలిన రకరకాల ఆకారాల్లో బండరాళ్లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా మానవ ముఖ రూపాన్ని కలిగి ఉన్న ఓ రాతి శిల్పం అందరి చూపును ఆకట్టుకుంటుండడం విశేషం.

కనువిందు చేస్తున్న ప్రత్యేక ఆకృతులు 

ఈ గుట్టలపై మనిషి తలను పోలిన ఒక పెద్ద బండరాయితో పాటు.. ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక ఋషి తల రూపాన్ని పోలిన మరో రాయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వినూత్నంగా ఉన్న ఈ ప్రకృతి వింతను చూసేందుకు స్థానిక గ్రామాల ప్రజలే కాకుండా.. సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

పరిశోధనలతో మరిన్ని రహస్యాలు వెలుగులోకి : 

అయితే తరతరాల నుంచి ఈ రాళ్లు ఇక్కడే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాంతంలో సమగ్ర పరిశోధనలు జరిపితే మరిన్ని చారిత్రక రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. ప్రధాన రహదారికి సమీపంలోనే ఉన్న ఈ గుట్టను గుర్తించి.. ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

 మేడారంలో మరో శిల్పం

 నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో గల ’రెక్కల స్తంభం గండి’ వద్ద అరుదైన మానవ ఆకారపు శిల్పం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ శిల్పం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బృహత్ శిలాయుగపు శిల్పాలు 

 బృహత్ శిలా యుగపు (పెద్దరాతియుగం) అంటే క్రీ.పూ 1200 - 300 సంవ త్సరాల మధ్యలో ఏర్పడినవిగా చరిత్ర కారుల అభిప్రాయ పడుతున్నారు. క్రమక్షయం వలన ఈ రూపాలు ఏర్పడి ఉండవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.అయితే పలు ప్రాంతాల్లో ఇటువంటి ప్రాచీన శిల్పాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పురవాస్తుశాఖ అధికారులు ఈ శిల్పాలపై పరిశోధనలు చేస్తే.. మరిన్న రహస్యాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతుండడంతో స్థానికులు వెంటనే పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేయాలని విన్నవించుకుంటున్నారు.