31 July, 2026 | 1:09 AM

నాగోల్ చౌరస్తాలో ఆక్రమణల రచ్చ

31-07-2026 12:00 AM
  1. స్థానికులకు నిత్య నరకం
  2. రోడ్డుపైనే వ్యాపారాలు.. 
  3. విలేజ్ రోడ్డులో ఆక్రమణల ప్రహరీ
  4. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ శూన్యం.. 
  5. చర్యలకు బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్

నాగోల్, జులై 30(విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గంలో  ప్రధాన కూడళ్లలో ఒకటైన నాగోల్ చౌరస్తా ఆక్రమణల బారినపడి తీవ్ర ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుంటోంది. ఇట్లు మీ రహదారు గుండా సిటి నలుమూలలకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలతో పాటు ముఖ్యంగా మెట్రో ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రధాన రహదారిపైనే కూరగాయలు, పండ్ల బండ్లు ఏర్పాటు చేయడంతో వాహనాల వేగం మందగించి తీవ్ర అంతరాయం కలుగుతోంది.

మరోవైపు నాగోల్ విలేజ్కు వెళ్లే మార్గంలో ఒక భవనానికి చెందిన రేకుల ప్రహరీ రోడ్డును ఆక్రమించడంతో దారి తీవ్రంగా ఇరుకుగా మారింది. ఇదే ప్రాంతంలో బస్టాప్, ఆటోస్టాండ్ ఉండటంతో సాయంత్రం వేళల్లో ఉప్పల్, ఎల్బీనగర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. పదాచారులు రోడ్డు దాటేందుకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోంది.

ట్రాఫిక్ పర్యవేక్షణ కరువైంది

ఇంతటి భారీ రద్దీ ఉన్నప్పటికీ క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉండటం లేదని స్థానికులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రద్దీ సమయాల్లో కనీసం ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల్లో ఉంచాలని కోరుతున్నారు.

‘రోడ్డును ఆక్రమించిన వ్యాపార బండ్లను తరలించి, విలేజ్ రోడ్డులోని రేకుల ప్రహరీని తక్షణమే తొలగించాలి. అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు.’

 శ్రీహరి గౌడ్ (తెలంగాణ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు)