31-07-2024 12:00:00 AM
సారంగి లూట్ వాద్యం. దీని ని బంజారా ఉప తెగ భాట్లు ఈ వాద్యాన్ని వాయిస్తారు. మొన్నటి వరకు వాడుకలో ఉన్న సారంగి ఈ మధ్య వినబడటం మానేసింది. భాట్స్ మాత్రం ఇప్పటికీ రబాబ్ అనే తంత్రి వాద్యాన్ని మీటుతూ పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథని పాడతారు.
సారంగి ప్రత్యేకత ఏమంటే ఇది జానపద వాద్యంగా మారుమూల ప్రాంతాల్లో కనుపిపిస్తుంది. ఉత్తర భారతంలో శాస్త్రీ య సంగీత వేదికలపైనా ప్రత్యక్షమవుతుంది. ఈ వాద్యం హిందుస్థానీ సంగీతం పరిధిలోనే ఉండిపోయింది.
దీని పుట్టుక జానపదం. కొంత అభివృద్ధి చెందాక అది శాస్త్రీయ వాద్యమై కచేరీలకు చేరింది. ఏకకాలంలో జానపద శాస్త్రీయ సంగీత సంగీత వాద్యంగా పేరు పొందింది. రెండు విభిన్న రంగాలలో ఇలా రాణించిన వాద్యం మరొకటి లేదు.
బంజారాలు ఉత్తర భారతదేశం నుంచి దక్కన్ పీఠభూమి వైపు వలస వస్తూ వారి సంగీత వాద్యాలు డఫ్, నగారా, రబాబ్, సారంగి వంటి సంగీత వాద్యాలను తీసుకువచ్చారు. అప్పటి నుంచి తెలంగాణలో ఈ వాద్యం విశేష ప్రచారం పొందింది. దక్షిణ ప్రాంతంలో ”ఒదువర్“ గాయకులు దీనిని తమ గాన సంప్రదాయంలో భాగం చేశారు. తేవార గానం కూడా సంప్రదాయికమైనదే. అయితే వయోలిన్ సొంతం చేసుకున్నట్లుగా సారంగినీ వారు తమ సంగీత సంప్రదాయంలో మిళితం చేసుకోలేదు.
ఉత్తరాదిలో సారంగిని భోగం మేళాల్లో వాయించడం వల్ల ఆ కళాకారులకు సమాజంలో తక్కువ గౌరవం ఉండేది. వారు కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాని అది శాస్త్రీయ సంగీతంలో చేరాక దేశ విదేశాల్లో గౌరవాదరణలు పొందింది. గోటితో తంత్రుల్ని మీటుతూ వాయించే వాద్యాలు గ్రీసు వంటి దేశాల్లో ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. జానపదులు వాయించే సారంగి వాద్యాలు చాలా రకాలుగా ఉన్నాయి. అవి ప్రాంతీయ భేదాలతో ఉండటం విశేషం. బోగి సారంగి, ధని సారంగి అని ప్రాంతీయ రూపాలు కూడా కనిపిస్తాయి. తెలంగాణలోని సారంగి ఏ రకం సారంగితో పోలిక ఉందో పరిశీలించాలి.
ఎనిమిది మెట్లు కలిగి రెండు కర్రలు ఉన్న చెక్కతో తయారు చేసిన వాద్యం ఇది. దీనిపై తంత్రులను విల్లు ఆకారం గల పరికరంతో వాయిస్తారు. చక్కని సంగీతం పలికిస్తూ అంతకన్నా చక్కని చిక్కని రాగాలతో కళాకారులు గానం చేస్తారు. ఈ వాద్యం ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ అంతరించిపోయే దశకి చేరింది.