calender_icon.png 11 November, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ నాయంకరం దుప్పల్లిః

31-07-2024 12:00:00 AM

యాదగిరి-భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో దుప్పల్లి అనే ఊరుంది. మూసీనదికి ఉత్తరం ఒడ్డున ఏండే ఈ ఊరు నిజాం కాలంలో దేశముఖుల జాగీరు. నిషానీగా అప్పటి గడి మిగిలిఉంది. దేశముఖ్ కీసర వేంకటరామారెడ్డి అరవైవూర్ల పట్టేదారట. ఇపుడున్న ఊరికి తూర్పున వుండేది దుప్పల్లి గ్రామం ఒకప్పుడు. ఆ పాటిగడ్డ దగ్గర అవశేషాలు కొన్ని మిగిలివున్నాయి. అక్కడ పూర్వం కేశవాలయం ఉండేదనడానికి ఆ శిథిలాక్షల్లో ఒక గరుడ సేవిత చతుర్భుజ భగ్న కేశవమూర్తి శిల్పం ఉంది. గరుడ శిల్పమున్న దేవతాధిష్టాన పీఠం ఉంది. దేవాలయ ప్రాకారం ఆనవాళ్ళున్నాయి.

అక్కడొక నాగశిల్పం, గణపతి ఉన్నచోట మరో రెండు నాగదేవతల శిల్పాలు,  చాళుక్యులకాలం నాటి నాగాభరణుడు, నాగోదరబం ధంతో, మువ్వల జంధ్యంతో, మణికిరీటంతో, చతుర్భుజ సుందర గణపతి (ముందు, వెనక కూడ చెక్కిన) శిల్పం వుంది. మత్స్యకారులు మూసీనది దగ్గర గంగమ్మకు గుడి కట్టి, ఎక్కడెక్కడో పడి ఉన్న విగ్రహాలను అక్కడ చేర్చారు. ఇంకా అక్కడ ఏనుగులను కట్టిన రాతిగడలు, కోటవంటి నిర్మాణపు జాడలు కనిపిస్తున్నాయక్కడ. ఇక్కడ ఎల్లమ్మ దేవత బావిలో వెలసి ఉండడం ప్రత్యేకం. ఒక సతిశిలకూడా అగుపించింది. 

గడిలో కాకతీయుల నాటి నలువైపులా తెలుగులో చెక్కిన శాసనస్తంభం ఉంది. ఒకప్పుడు ఇక్కడ నేను (శ్రీరామోజు హరగోపాల్) టీచరుగా పనిచేసినందువల్ల అప్పటి శిష్యుడు తండా వెంకన్న నన్ను , వేముగంటి మురళీకృష్ణ, చంటిలను ఆ ఊరిలోని చారిత్రకప్రదేశాలకు తిప్పి చూపించాడు.

కాకతీయప్రతాపరుద్రుని ఏలుబడిలో వున్న 72 నాయంకరాల్లో దుప్పల్లి ఒక నాయంకరం కేంద్రం. దీనిని దుప్పల్లి బొల్లమరాజు మూడింట ఒకపాలు, రంగయ రుద్రదేవుడు రెండుపాళ్ళుగా పాలించేవారు. నాగులకుంట (నాగులతూము)కు పడమట వుండే కాశ్మీరదేవాలయంలోని కాశ్మీరదేవునికి నిత్యభోగనిమిత్తం అష్టాదశ(కులాల) ప్రజలసన్నిధిలో రెండుకాలాలు పంటలు పండే నాలుగున్నర మర్తురుల తరిపొలాన్ని సర్వమాన్యముగా దానం చేసారు.

ఈ భూమి సబ్బిసముద్రము వెనక, నేరడ్ల చేనులో ముయ్యడ్డాను, నాగులతూము కుట్రుచేను మర్తురు, కాన్యానిచెరువు వెనక రావిచేను అడ్డాను, నారాయణదేవరచెరువు వెనక తామరపడెచేను ముుయ్యడ్డాను కలిపి నాలుగు మర్తురులు, తామరపడె మునిగితే దానికి బదులుగా సోమయకాలువ మొదట జిలగవారి మర్తురు ఇస్తామని,  ఊరిలో తమకు చెల్లే చాలుబడి(సాలుసరి)కప్పము మాడలో చిన్నంబాతిక దేవరభోగానికే ఇచ్చారు. ప్రజలందరూ దేవర దీపాలకై విడిచిన పన్నులన్నింటిలో మాడ, వీసం తీసి పెట్టాలని శాసించారు. ఈ శాసనానికి విఘ్నం కలిగిస్తే గంగానది ఒడ్డున ఆవును చంపిన దోషాన పోతారని, దేవద్రోహం, సమయద్రోహంలో పడుతార శాసనాంతాన శాపోక్తులున్నాయి. ఈ ధర్మానికి అడ్డుతగిలితే శివాలయం కూల్చిన దోషాన పోతారని మరొక శాపోక్తి. ఇప్పుడు దుప్పల్లిలో ఆ కాశ్మీర దేవాలయం శిథిలావస్థలో ఉంది.