calender_icon.png 11 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐనవోలు పట్నాలకు ప్రత్యేకత!

31-07-2024 12:00:00 AM

తెలంగాణ జీవన విధానానికి, జానపదుల సంస్కృతికి ప్రతీక ఐనవోలు. అతి పురాతన చరిత్ర గల పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లన్న జాతరను పూర్వకాలంలో జానపదుల జాతరగా పిలిచేవారు. దీనికి కారణం మైలారు దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు కావడమే. తెలంగాణలో ఈ దేవాలయాన్ని పోలిన దేవాలయాలు మొత్తం ఐదు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా, మరొకటి కరీంనగర్ జిల్లాలో ఉంది. కాకతీయుల పాలనలో అయ్యన్న దేవుడనే మంత్రి ఈ ఆలయం నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. ఆలయానికి 1,100 ఏళ్ల చరిత్ర ఉంది. శైవక్షేత్రాన్ని అయ్యన్న నిర్మించడంతోనే ఈ గ్రామానికి అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది. ఇది కాలక్రమేణా ఐనవోలు, ఐలోనిగా రూపాంతరం చెందినట్లు తెలుస్తుంది. 

ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లాలోని ఐన వోలు గ్రామంలో కొలువుదీరిన ఈ ఆల యం విశాల ప్రాంగణంఉంటుంది. ఇక్క డ శిల్పకళా వైభవం అద్భుతం. అష్టోత్తర స్తంభాలు, కాకతీయు కళాతోరణాలు, సింహద్వారాల చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నది. కోటి వరాలిచ్చే మల్లికార్జునుడిగా వెలుగొందుతున్నాడు. భక్తుల పాలిట కొంగు బంగారమయ్యాడు. 

రాష్ట్రకూటులు, కళ్యాని చాళుక్యులు, కాకతీయులు, ఏ రాజుల చరిత్రను పరిశీలించినా వారంతా ఐనవోలు మల్లికా ర్జునస్వామి భక్తులేనని చారిత్రక ఆనవాళ్లు, శిలాశాసనాలు స్పష్టం చేస్తున్నాయి. శివభక్తులకు మహా పుణ్యక్షేత్రం ఐనవోలు. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడం ఈ ఆలయ విశిష్టత. ఒగ్గు కథలు, శివసత్తుల పూనకాలు, దేవుడి పట్నాలు, బోనాలతో సందడిగా మారి, ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. మేడారం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో అతిపెద్ద జాతరగా ఐలోని మల్లన్న జాతరకు పేరున్నది. ఈ జాతరకు ఏటా తెలంగాణ నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. 

తెలంగాణలోని వివిధ కులాల ప్రజలు మల్లన్నను కులదైవంగా, ఇంటి దేవుడిగా పూజిస్తారు. ఏటా లేదా రెండుమూడేండ్లకు ఒకసారి మల్లన్న పట్నాలు వేసి, పండుగ చేసుకుంటారు. మల్లికార్జున స్వామి కొలువైన కొమురవెల్లి, ఐనవోలు ఆలయాల్లో ‘పట్నం’ వేసి మొక్కు చెల్లించుకోవడం వందల ఏండ్లుగా కొనసాగుతున్న ఆచారం.

పట్నం అంటే ముగ్గు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమం. ప్రకృతి సిద్ధమైన పంచ (ఐదు) రంగులను ఉపయోగించి పట్నం వేస్తారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, గులాబీ రంగు కుంకుమ, ఆకుపచ్చ పొడి (తంగేడు, చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడిగా చేస్తారు), తెల్ల పిండి (బియ్యపు పిండి)ని వాడుతారు. ప్రత్యేకమైన చెక్క అచ్చుల ద్వారా పట్నం వేస్తారు. పట్నానికి ‘మల్లికార్జున స్వామి కల్యాణం’ అనే అర్థం కూడా ఉంది. పట్నం మొక్కు.. తెలంగాణలో పెండ్లికి ముందు నిర్వహించే ‘పోలు బియ్యం’ సంప్రదాయాన్ని పోలి ఉంటుంది.

మల్లన్న స్వామికి మొక్కులుగా వేసే పట్నాలు మూడు రకాలు. నిడివి, కొలతను బట్టి ఒక్కో పట్నం వేయడానికి దాదాపు గంట నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. కొమురవెల్లి, ఐనవోలు ఆలయాల్లో భక్తులు తాము బస చేసిన ప్రదేశంలో బోనం ఎదుట వేసే పట్నాన్ని ‘చిలక పట్నం’ అంటారు. కొమురవెల్లి ఆలయంలో గంగిరేగు చెట్టు సమీపంలో వేసే పట్నాన్ని నజర్ పట్నమంటారు.