బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
- ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా
- మద్దతు తెలిపిన పలువురు ఎంపీలు
ముషీరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన ప్రసంగించారు.
కేంద్రంలో జాతీయ బీసీ కమిషన్, బీసీ పార్లమెంటరీ కమిటీ, జాతీయ బీసీ కార్పొరేషన్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ వాటిని సమన్వయం చేసే ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల బీసీల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
కులగణన అనంతరం బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి పలు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఇంచార్జ్ నూకాలమ్మ, ఎంపీలు బీద మస్తాన్‌రావు, పాక సత్యనారాయణ, నాగరాజు, రామారావు మద్దతు తెలిపారు.






