5 August, 2026 | 1:54 AM

ఆధునిక ఆరోగ్య చట్టం అవశ్యం

05-08-2026 12:00 AM

ప్రజారోగ్యమనేది కేవలం వ్యాధులకు చికిత్స అందించే వైద్య వ్యవస్థ మాత్రమే కాదు. ఒక సమాజం సమష్టి కృషి ద్వారా వ్యాధులను నివారించడం, ప్రజల ఆయుష్షును పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. ఆధునిక సమాజంలో ఈ లక్ష్యాలను సాధించేందుకు ఒక బలమైన ప్రజారోగ్య చట్టం అవసరం ఎంతైనా ఉంది. అలాంటి చట్టం అమలులోకి వస్తే రాష్ట్రప్రభుత్వంతోపాటు స్థానిక సంస్థలు, ప్రజలు కలిసి ఉమ్మడి లక్ష్యాలను సాధించవచ్చు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, ఆస్తి హక్కుల వంటి మౌలిక హక్కులను కాపాడుతూనే, ప్రభుత్వ అధికారాలకు తగిన పరిమితులను చట్టం విధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రక్షణలో ప్రజారోగ్య వ్యవస్థల పాత్ర ఎంతో కీలకమైనది.

అమెరికన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వంటి సంస్థలు ఇప్పటికే ప్రజారోగ్యచట్టం ఆవశ్యకతను ఎన్నోసార్లు వ్యక్తపరుస్తాయి. చట్టం ద్వారా ప్రజలకు వ్యాధుల నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ, ఆహార భద్రత, సురక్షిత తాగునీటి సరఫరా, ఆరోగ్యంపై అవగాహన వంటి సేవలు మరింత చేరువ అవుతాయి. ప్రజలకు చట్టం ప్రయోజనాలు ప్రత్యక్షంగా కనిపించకపోయినా, మొత్తంగా వైద్యారోగ్య వ్యవస్థకు కనిపించని వెన్నెముకలా పనిచేస్తుంది. చట్టం రాకపోతే పైన చెప్పిన వ్యవస్థలన్నీ బలహీనపడి, వ్యాధులు, మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది.

ప్రజావసరాలు ముఖ్యం

ప్రజారోగ్య చట్టం ప్రయోజనాలు కేవలం వైద్య రంగానికే పరిమితం కావు. పరిశుభ్రత, శుద్ధజలం, పర్యావరణ పరిరక్షణ, విద్య, పౌష్టికాహారం వంటి ఎన్నో రంగాలు మెరుగుపడతాయి. అందుకే సమర్థమైన ప్రజారోగ్య పరిపాలనకు ఒక బలమైన చట్టపరమైన ఆధారం అవసరమవుతుంది. ప్రజారోగ్య చట్టాలు సాధారణంగా రెండు రకాలు. మొదటివి మౌలిక సదుపాయాల చట్టాలు. ఇవి ప్రజారోగ్య సంస్థల ఏర్పాటు, డేటా సేకరణ, నిబంధనల తనిఖీలు, లైసెన్సులు, నియంత్రణ చర్యలకు అధికారాలిస్తాయి.

రెండోవి వ్యవస్థలు జోక్యం చేసుకునే చట్టాలు. ఇవి మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాల నిషేధం, ఆహార భద్రత ప్రమాణాల అమలు, అంటువ్యాధులు వ్యాపించినప్పుడు క్వారంటైన్ వంటి తక్షణ చర్యలకు చట్టబద్ధత కల్పిస్తాయి. దేశంలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల నిర్వహణ ఇప్పటికీ దశాబ్దాల నాటి పాత చట్టాలపైనే ఆధారపడి ఉంది. శిక్షణ పొందిన సిబ్బంది కొరత, అమలులో ఉన్న లోపాల వల్ల వ్యవస్థ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతోంది. మన రాజ్యాంగం ప్రజారోగ్యానికి స్పష్టమైన పునాదులు వేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ప్రజారోగ్యానికి సంబంధించిన చట్ట నిర్మాణ అధికారాలు కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజించబడ్డాయి.

ఆసుపత్రుల నిర్వహణ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలు ప్రధానంగా రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. జనాభా నియంత్రణ, మానసిక ఆరోగ్యం, ఆహార భద్రత, అంటువ్యాధుల నియంత్రణ, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయవచ్చు. రెండు చట్టాల మధ్య విభేదాలు వస్తే కేంద్ర చట్టానికే ప్రాధాన్యం ఉంటుంది. రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణల ఆధారంగా జీవించే హక్కులో ఆరోగ్య హక్కు కూడా ఒక భాగమని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఆదేశిక సూత్రాలు కూడా పౌరులకు పోషకాహారం, మెరుగైన జీవన ప్రమాణాలు, ప్రజారోగ్య అభివద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని చెబుతున్నాయి.

రాష్ట్రాలపైనే నిర్వహణ బాధ్యత

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజారోగ్య చట్టాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలపైనే ఎక్కువ భాగం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ప్రత్యేక ప్రజారోగ్య చట్టాలు అమల్లో ఉన్నాయి. అవి కూడా ఎప్పుడో దశాబ్దాల క్రితం రూపొందించినవి. ఉదాహరణకు 1939 నాటి తమిళనాడు ప్రజారోగ్య చట్టం ఎన్నో సవరణలకు గురైంది. దేశమంతటా ఒకే రకమైన చట్టం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో 1987 మోడల్ పబ్లిక్ హెల్త్ బిల్, 2002 నేషనల్ పబ్లిక్ హెల్త్ బిల్, 2009 నేషనల్ హెల్త్ బిల్ వంటి నవనా బిల్లులను తీసుకొచ్చింది.

ఈ బిల్లులు పారిశుధ్యం, నీటి సరఫరా, మార్కెట్ల నిర్వహణ, అంటువ్యాధుల నియంత్రణను ప్రస్తావించాయి. అయితే.. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (మెడిసిన్ లొంగని బ్యాక్టీరియా), కొత్త రకం అంటువ్యాధులు, పర్యావరణ కాలుష్యం, వేగవంతమైన పట్టణీకరణ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేంత సమగ్రత వాటిలో లేదు. పాతకాలపు ప్రజారోగ్య చట్టాలు ఎక్కువగా బలవంతపు నియంత్రణ విధానంపైనే ఆధారపడ్డాయి.

సమాజ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ వ్యక్తిగత స్వేచ్ఛపై కొన్ని పరిమితులు విధించవచ్చనేది ఈ విధానం వెనుక ఉన్న ఉద్దేశం. కాలుష్యం, కలుషిత ఆహారం, ప్రాణాంతక అంటువ్యాధులు వ్యాపించినప్పుడు సమాజాన్ని కాపాడటానికి అటువంటి నియంత్రణలు అవసరం కావొచ్చు. అయితే నేటి ఆధునిక ప్రపంచంలో హక్కుల ఆధారిత ప్రజారోగ్య విధానం ముందుకు వచ్చింది. ఏ ప్రజారోగ్య చర్య అయినా చట్టబద్ధంగా, శాస్త్రీయ ఆధారాలతో, ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, మానవ గౌరవాన్ని కాపాడుతూనే ప్రభుత్వాలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఈ కొత్త విధానం చెప్తోంది.

సమగ్రమైన విధానాలు కావాలి

భారతదేశం ప్రస్తుతం వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, పర్యావరణ మార్పులు, కొత్త రోగాల ముప్పు వంటి క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో పాత చట్టాలకు చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోదు. ఆధునిక ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించే వ్యవస్థ, డిజిటల్ డేటా పర్యవేక్షణ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, పౌరుల హక్కుల రక్షణ కలగలిపిన ఒక సమగ్ర చట్టం అత్యవసరం.

పౌరుల ఆరోగ్య సమాచారానికి తగిన గోప్యత కల్పిస్తూనే, సకాలంలో నాణ్యమైన వైద్యాన్ని అందించేలా నిబంధనలు రూపొందించాలి. సమగ్ర ప్రజారోగ్య చట్టం తేవడం వల్ల ప్రజలకు ఎన్నో ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరతాయి. ఆసుపత్రులలో ఉచితంగా లేదా సరసమైన ధరలకే నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు పొందే హక్కు ప్రజలకు లభిస్తుంది. మహమ్మారులు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఉచితంగా పరీక్షలు, చికిత్స, టీకాలు పొందే వెసులుబాటు కలుగుతుంది.

మార్కెట్లలో లభించే ఆహార పదార్థాలు, తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండటం వల్ల అంటువ్యాధులు, కలుషిత ఆహార బారిన పడకుండా పౌరులు కాపాడబడతారు. మెడిసిన్ లభ్యత పెరగడంతోపాటు నకిలీ మందుల విక్రయాలకు అడ్డుకట్ట పడుతుంది. వైద్యారోగ్య రంగంలో నగరాలు, గ్రామాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తగ్గించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి, అత్యవసర వైద్య సేవలు తక్షణమే అందుబాటులోకి రావడానికి ఇది తోడ్పడుతుంది. పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తల భద్రత, సంక్షేమానికి చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. 

ప్రైవేట్ వైద్య రంగంలో అధిక రుసుముల వసూలు, నాణ్యతా లోపాలపై ఫిర్యాదులు చేసేందుకు పౌరులకు ఒక స్పష్టమైన వేదిక అందుబాటులోకి వస్తుంది. సామాజిక సంక్షేమం, వ్యక్తిగత హక్కుల మధ్య సరైన సమతుల్యతను కాపాడటం సవాల్‌తో కూడుకున్న విషయమే. రాజ్యాంగ విలువలు, శాస్త్రీయ దక్పథం, మానవ హక్కులను పునాదిగా చేసుకుని కొత్త ప్రజారోగ్య చట్టాన్ని రూపొందించాలి. అప్పుడే దేశంలోని చివరి పౌరుడికి కూడా నాణ్యమైన ఉచిత ఆరోగ్య రక్షణ సాధ్యమవుతుంది. ఆరోగ్య భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు, సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించేందుకు ఒక ఆధునిక ప్రజారోగ్య చట్టాన్ని వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.