5 August, 2026 | 1:55 AM

పన్నుల వసూళ్లు -పర్యవేక్షణ

05-08-2026 12:00 AM

శుల్కాధ్యక్షః శుల్కశాలాం 

ధ్వజంచ ప్రాఙ్ముఖం

ఉదఙ్ముఖం వా మహాద్వారాభ్యాశే

నివేశయేత్!

(కౌటిలీయమ్ 2021)

రాజ్యానికి ఆదాయం పన్నుల రూపంలో సమకూరుతుంది. రాజ్యంలోనికి లేదా నగరంలోకి దిగుమతి అవుతున్న వస్తువుల మీద వేసే పన్నులను శుల్కంగా చెపుతూ దానిని పర్యవేక్షించే అధికారిని శుల్కాధ్యక్షుడు అన్నారు. శుల్కాధ్యక్షు ని కార్యాలయాన్ని, శుల్కశాల చిరునామాను గుర్తుగా తెలిపేందుకు సంబంధిత జెండాను నగర ప్రవేశద్వారం వద్ద తూర్పుముఖంగా గానీ, ఉత్తర ముఖంగాగాని నెలకొల్పాలి అంటాడుఆచార్య చాణక్య. శుల్కశాల అంటే ఇప్పటి చెక్పోస్ట్,కస్టమ్స్ కార్యాలయం,టోల్ కేంద్రం,పన్ను తనిఖీ కేంద్రం‘ అనవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉంటేనే ప్రజాసంక్షేమం సాధ్యపడుతుంది. కోశాగారం పటిష్టంగా ఉంటేనే రాజ్యం సుభిక్షమౌతుంది.

ప్రజలకు భద్రత,రక్షణ,మౌలిక సదుపాయాలు సమకూర్చడం,విద్య వైద్యం, ఉపాధి అవకాశాల ను కల్పించడం పాలకుల బాధ్యత. పన్నులు చెల్లించడం ప్రజల బాధ్యత. శుల్కం కోశాని కి ముఖ్యంగా మూడు మార్గాల్లో వస్తుంది. దేశం మొత్తంలో ఉత్పత్తయ్యే వస్తువులు,సేవలపై వచ్చే ఆదాయం ఒకటి. దానినే ‘బాహ్యం‘ అన్నారు. కోట లోపల వస్తువులపై లభించే ఆదాయం రెండవది. దానినే ‘అభ్యంతరం‘. విదేశాల నుంచి వచ్చిన వస్తువుల మీద వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మూడవది. దానినే ‘ఆతిథ్యం’ అన్నారు.. అలాగే వస్తువులు,సేవలు బయటకు వెళ్లేటప్పుడు చెల్లించే పన్ను ‘ఎగుమతి శుల్కం‘ (నిష్క్రామశుల్కం) కాగా వస్తువులు లోనికి వచ్చేప్పుడు చెల్లించాల్సిన పన్ను ‘ప్రవేశ్యం‘ (దిగుమతి శుల్కం) అన్నారు.

కాలమేదైనా అవకాశం ఉన్నచోట అవినీతికి ఆస్కారం ఉంటుంది. అందుకే పన్నుల వసూళ్లు, అందులో అవినీతిని నియంత్రించడం లక్ష్యంగా సుస్థిరమైన నియంత్రణా విధానాన్ని రూపొందించి,దానిని అతిక్రమించిన వారికి జరిమానాలను,శిక్షలను సూచించాడు చాణక్య. అంగడికి సరుకును తీసుకువచ్చిన వర్తకులు ఎందరు వచ్చారో వారి గుర్తింపును,వారు తెచ్చిన సరుకు పరిమాణాన్ని,ఆ సరుకు వచ్చిన స్థలం,అక్కడి గుర్తింపు ముద్రను పరిశీలించి వాటన్నింటి వివరాలను ఒక రిజిస్టర్‌లో రాసుకునేందుకు నలుగురు లేదా ఐదుగురు అధికారులతో కూడిన బృందాన్ని నియమించాలంటాడు. ఇక్కడ వర్తకులు,అధికారులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిని నియంత్రించేందుకు కొన్ని సూచనలనూ, వాటిని అతిక్రమిస్తే శిక్షలనూ సూచించాడు చాణక్య.

ముద్రలేకుండా ఉన్న వస్తువుల మీద,ఆ వస్తువులపై వేయవలసిన పన్నుకు రెట్టింపు ‘అత్యయం‘ (అపరాధ రుసుము) విధించాలి. మోసం చేయాలనే దురుద్దేశ్యంతో నకిలీ ముద్రను వేసుకొని వస్తే ఎనిమిది రెట్లు వసూలు చేయాలి. ముద్రను బ్రద్దలు కొట్టినవారి సరుకును మొత్తంగా కోశానికి తరలించడమే కాక వారికి మూడు ఘడియలపాటు అక్కడే నిలుచునే శిక్షను విధించాలి. ముద్రపైనున్న వస్తువులను మార్చినా లేక రాజముద్రను మార్చినా ఆ వస్తువులను తీసుకొని వచ్చిన వారికి ‘ఒకటింపావు‘ పన్నును విధించాలంటాడు.

ఒక సరుకు ముద్రతో మరొక సరుకును తరలించినా, కొంతమొత్తానికి మాత్రమే పన్ను చెల్లించి మరింత సరుకును దానితో కలిపి తరలించినా, తక్కువ పన్ను చెల్లించాల్సిన వస్తువులలో... ఎక్కువ పన్నును చెల్లించే వస్తువుల ను దాచి తరలించినా అధిక మొత్తంలో పన్ను ను విధించాలని చాణక్య చెపుతారు. నిషేధి త వస్తువులను తీసుకువస్తే వాటిని పట్టుకొ ని శుల్కం లేకుండా అమ్మివేసి ఆ సొమ్మును కోశాగారానికి జమచేయడంతో పాటుగా తీవ్రమైన దండన కూడా ఉంటుంది.

శుల్కాధ్యక్షుని వద్దకు వచ్చిన సరుకు ప్రమాణాన్ని, దానికి నిర్ధారించుకున్న వెలను సరుకును తెచ్చిన వర్తకులు గట్టిగా అందరి కీ వినిపించే విధంగా మూడుసార్లు ప్రకటించాలి (వేలంవేయడం). ఆ ధరను అంగీకరించిన కొనుగోలుదారుకు సరుకును ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువమంది కొనుగోలుదారులు ముందుకు వస్తే దాని ధరను పెంచి,పెంచిన మూల్యాన్ని,దానిపై కట్టబడిన పన్నును కోశాగారానికి చేర్చాలి. అమ్మకందారులు ఎవరైనా పన్ను చెల్లింపును తప్పించుకునేందుకు వస్తువు పరిమాణాన్ని మరి యు ఖరీదును తక్కువగా చూపినట్లయితే,లిఖితపూర్వకంగా చూపిన దానికన్నా అధికంగా ఉన్న సరుకును రాజుగారు తీసుకోవాలి లేదా కట్టవలసిన పన్నుకు ఎనిమిది రెట్లు ఎక్కువగా పన్ను వసూలుచేయాలి. అలాగే మారుబేరాలు చేసేవా రు వస్తువుకు నిర్ణయించిన ధరకన్నా అధికంగా మూల్యాన్ని పెంచితే ఆ పెంచిన దానిని కోశానికి తరలించాలి లేదా రెట్టింపు పన్ను విధించాలి.

శుల్కాధ్యక్షుడు పక్షపాతంతో కాని లంచం తీసుకొని గాని విధించవలసిన పన్నుకన్నా తక్కువగా నిర్ణయిస్తే.. తగ్గించిన దానికి ఎనిమిది రెట్లు అతనికి దండనగా విధించాలి. అలాగే ఎవరైనా పన్ను చెల్లించకుండా పోతున్నారా లేదా అధికారులు పంపిస్తున్నారా తెలుసుకునేందుకు మారు వేషాలలో కొంద రు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ రహస్యం గా పరిశీలించాలి. వస్తువులను కొనడం,అమ్మడంలో మోసాలకు అవకాశం ఉండడం కారణంగా వస్తువులను తూచిగాని,కొలిచిగాని, లెక్కపెట్టిగాని అమ్మాలి, కొనాలి.

చెక్‌పోస్ట్ దాటినవారికి, చెల్లించవలసిన దానిపై ఎనిమిది రెట్లు అధికంగా పన్ను విధించాలి అం టాడుచాణక్య. వివాహాలకు వెళ్లడం, పెళ్లయ్యాక అత్తవారింటికి వెళ్లే స్త్రీలకు, అన్నసత్రాలకు తీసుకువెళ్లే ఆహారాలపైనా,యజ్ఞయాగాదుల సంభారాలపైనా,ప్రసవించిన వారికి అవసరమైనవైద్య పరికరాలు, మం దులు మొదలైన ముఖ్యమైనవస్తువులపైపన్నును వేయకూడదని మినహాయింపు ఇవ్వబడింది. అయితే తప్పుడు పత్రాలతో పన్ను మినహాయింపు పొందాలనుకునే వారికి, దొంగతనం చేసే వారికి విధించే దండన (స్తేయ దండం) విధించాలంటాడు.

చాణక్యుడు ప్రతిపాదించిన శుల్క వ్యవస్థలోని అనేకానేక అంశాలు ఈనాటి ప్రభుత్వ పరిపాలనలోనూ కనిపిస్తాయి. శుల్కశాలలు నేటి కస్టమ్స్ కార్యాలయాలు, చెక్‌పోస్టులు, టోల్ ప్లాజాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాల రూపంలో దర్శనమిస్తున్నాయి. వస్తువుల దిగుమతి,ఎగుమతులపై విధించే సుంకాలు, దేశీయ వస్తువులు,సేవలపై విధించే పన్నులు, పన్ను చెల్లింపులను నమోదుచేయడం, లెక్కలను తనిఖీ చేయడం,అధికారులపై నిఘా, వేలం పాట విధానాలు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలుచాణక్యునిపరిపాలనా సమర్థతకు,దూరదృష్టికి ఉదాహరణలుగా నిలుస్తాయి. కాలానుగుణంగా పన్నుల పేర్లు, విధానాలు మారినా, పారదర్శకత, జవాబుదారీతనం,

అవినీతిని నిరోధించే ప్రయత్నం, ప్రజాహితం అనే మూలసూత్రాలు మాత్రం నేటికీ యథాతథంగా కొనసాగుతున్న విధా నం కనిపిస్తుంది. శుల్కం పాలకుల ఆదాయ వనరుగానే కాదు.. రాజ్యపాలనలో క్రమశిక్షణ, పారదర్శకత, న్యాయబద్ధతలను కాపాడే వ్యవస్థ అని చాణ క్య అభిప్రాయం. పన్నుల వసూళ్లలో అవినీతిని నిరోధించడం, వర్తకులకు న్యాయం చేయడం,ప్రజాహిత కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవడం..ఈ మూడు లక్ష్యాల సమన్వయ సమాహారమే శుల్కాధ్యక్షుని బాధ్యత అనేది చాణక్య భావనగా భావించవచ్చు.