తమిళనాట నవ యువ శకం
పుల్లెంల గణేష్ :
విజయ్ విజయం తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పునకు సంకేతం. కుల, మత రాజకీయాలకు అతీతంగా ‘తమిళులే మన బలం’ అనే నినాదంతో ఆయన ముందుకుసాగారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించాయి. సుదీర్ఘ కాలంగా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య సాగుతున్న ద్విముఖ రాజకీయాలకు తెరదించుతూ, తన తొలి ప్రయత్నంలోనే తమిళగ వెట్రి కళగం (టీవకే) అధినేత జోసెఫ్ విజ య్ సంచలన విజయాన్ని నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సినిమా తారల ప్రభావం కొత్తేమీ కాకపోయినా, ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజల ఆదరణ పొంది, నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న ఘనత విజయ్‌కే దక్కింది. అధికార డీఎంకే కోటను బద్దలుకొట్టి టీవీకే పార్టీ ఘనవిజయం సాధించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.
మ్యానిఫెస్టోతోనే విజయం ఖరారు:
విజయ్ తన మ్యానిఫెస్టోలో హామీలు మాత్రమే ఇవ్వకుండా, క్షేత్రస్థాయి సమస్యలపైనా దృష్టిసారించారు. అవే ఆయనను యువతకు, మహిళలకు చేరువ చేశాయి. మహిళా సంక్షేమం కోసం ప్రతి నెలా మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెళ్లి కాను కగా 8 గ్రాముల బంగారం, పట్టుచీర లాంటి హామీలు మహిళా ఓటర్లను విశేషంగా ఆకర్షించింది. గ్యాస్ సబ్సిడీలో భాగంగా ఏడా దికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని ప్రకటించడం పేద, మధ్యతరగతి కుటుంబాలలో భరోసా నింపింది.
యువతకు ఉపాధి కల్పించడానికి తమిళనాడును ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చి లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తామన్న హామీ యువతలో ఉత్సాహం నింపింది. విద్యార్థుల భవి ష్యత్తు కోసం నీట్ పరీక్ష రద్దు కోసం గట్టిగా నిలబడతామని మాటివ్వడం గ్రామీణ విద్యార్థుల మనసు గెలుచుకుంది. పాత రాజకీయ వ్యవస్థలోని అవినీతిని అంతం చేస్తానని, పారదర్శకమైన ‘న్యూ ఏజ్’ పాలిటిక్స్ తీసుకొస్తానని విజయ్ ఇచ్చిన పిలుపు సామాన్యులను కదిలించింది.
ప్రధానమం త్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాని అనేక కారణాలతో విడుదల కాకుండా అడ్డుపడినా, కేంద్ర సం స్థ ఈడీతో ముప్పుతిప్పలు పెట్టినా విజయ్ ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. తన అభిమానులు నిరుత్సాహపడకుండా ఎన్నికల ప్రచారంలో కొండంత ధైర్యాన్ని నూరిపోశారు. అందుకే సినిమా ప్రపంచంలో జన నాయగన్ సినిమాని కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నా, తమిళ ప్రజల గుండెల్లో కొలువై ఉన్న జోసెఫ్ విజయ్ రాజకీయ పెను భూకంపాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోలేకపోయింది.
దళపతి విజయ్ తన కులం కాలమ్‌లో తల్లిదండ్రులు భారతీయ తమిళ పౌరుడుగా చేర్చడం గమనార్హం. అందుకే విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కులం గురించి ప్రస్తావన లేకుండా మానవత్వమే తన కులంగా చెప్పుకొన్నారు. కుల మతాలకతీతంగా ప్రజాస్వామ్య, రాజ్యాంగ, మానవతా, నైతిక విలువలకి కట్టుబడి తన నాయకత్వాన్ని నిర్మించుకున్నారు అందుకే అన్ని వర్గాల ప్రజలు విజయ్ నాయకత్వాన్ని బలపరిచారు.
అంతేకాకుండా సంఘంలో సామా జిక, రాజకీయ, సాంస్కృతిక పరివర్తన కో సం కృషిచసిన రాణి వేలు నాచియార్, అం జలై అమ్మాళ్, కామరాజ్, ఈవీ రామస్వా మి పెరియార్, అంబేద్కర్ వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయా ల మేరకు పనిచేస్తానని తమిళ ప్రజలను బలంగా నమ్మించగలిగారు.
75 ఏళ్ల క్రితం డీఎంకే పార్టీ సాంస్కృతిక పునాదులకు అభిముఖంగా, 50 సంవత్సరాలు చరిత్ర కలిగిన అన్నాడీఎంకే పార్టీకి, రెండు ప్రధాన జాతీ య పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు అభిముఖంగా రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన తమిళ వెట్రి కజగం పార్టీ ప్రయాణం కూడా మహనీయుల చూపిన మార్గంలోనే ఉంటుందని తమిళ ప్రజలనే కాదు, యావ త్ భారతీయులని నమ్మించగలిగారు. దీన్ని విజయ్‌లోని గుణగణాలకి, నీతినిబద్ధతకి, నిజాయితీ గల నాయకత్వానికి నిదర్శనంగా చూడాలి.
అయితే దళపతి విజయ్ గెలుపు వెనుక బలమైన పునాది ఉన్నది. అది ఏమిటంటే పార్టీ పెట్టడానికి ముందే 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో రాజకీయేతర స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా తమిళనాడులో ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా తన అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు నడిపించి గ్రామీ ణ, పట్టణ ప్రజలకు పరోక్షంగా ధైర్యాన్ని కల్పించారు. తన ఎన్జీవో ద్వారా భారీస్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాగా చదువుకునే విద్యార్థులను కుటుంబ సమేతంగా పిలిపించి వారికి సన్మానం, ఆర్థిక సహకారం చేశారు.
2017లో జల్లికట్టు ఆట వివాదంలో ఉండగా, అది సక్రమంగా జరిగేలా వెనుక ఉండి వ్యూహాలు రచించారు. 2021లో విజయ్ మక్కల్ ఇయక్కం తరఫున మున్సిపాలిటీ ఎన్నికల్లో 169 మంది అభ్యర్థులను నిలిపి, 127 మందిని గెలిపించు కున్నారు. తాను ప్రత్యక్షంగా ప్రచారం చేయకుండా అభిమాన నాయకులే గెలిపించుకు న్నారు. ఇది దళపతి విజయ్‌కి ఉన్న బలమైన పునాదిగా చెప్పుకోవచ్చు.
అయితే దళపతి విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ప్రధానమైన మహిళలకు రూ.2500, సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కష్టసాధ్యమని ఎంకే స్టాలిన్ జో స్యం చెప్పారు. అయితే, విజయ్ తాను ఇచ్చి న హామీలను ఎంతవరకు నెరవేర్చి తన రాజకీయ మనుగడను ఎంతకాలం కాపాడుకుంటారో భవిష్యత్తులో తన నాయకత్వ నిబ ద్ధతపై ఆధారపడి ఉంటుంది.
నవ తమిళనాడు దిశగా అడుగులు
విజయ్ విజయం తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పునకు సంకేతం. కుల, మత రాజకీయాలకు అతీతంగా ‘తమిళులే మన బలం’ అనే నినాదంతో ఆయన ముందుకుసాగారు. సంప్రదాయ రాజకీయ పార్టీల వ్యూహాలను తిప్పికొట్టి, సామాన్యుడి గొంతుకగా మారడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. అంతిమంగా తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.
డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని, ఒక సినీ నటుడికి పట్టం కట్టడం అనేది సామాన్య విషయం కాదు. ఇప్పుడు అందరి దృష్టి విజయ్‌పైన, ఆయన అందించబోయే ‘వెట్రి’ (విజయం) పాలనపైన ఉంది. అయితే తమిళనాడులో 107 సీట్లు సాధించిన అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించగా, డీఎంకే 59 సీట్లతో రెండవ స్థానాన్ని, అన్నాడీఎంకే 47 సీట్లతో మూడవ స్థానంలో ఉన్నాయి.
అయి తే, సీపీఐ ఒకటి, సీపీఎం రెండు, వీసీకే రెం డు, కాంగ్రెస్ ఐదు సీట్లతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ని సాధించారు. అతి త్వరలో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతోకాలంగా సాం ప్రదాయక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిస్తూ అగ్రకుల రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయం లో తమ జాతి ఓట్లు అమ్ముకుంటున్న కొం దరు నాయకులు తమిళనాడుకు చెందిన విజయ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.
నిబద్ధత కలిగిన, రాజీపడని రాజకీయాలను తెలుగు రాష్ట్రాల్లోని దళిత బహుజన నాయకులు చేసినట్లయితే అనతి కాలంలోనే తెలుగు రా ష్ట్రాల్లో కూడా జనాభా దామాషా ప్రకారం 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం స్థాపించడం కష్టతరమైన పని ఏమీ కాదు. అంతిమంగా టీవీకే అధినేత దళపతి విజయ్ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేసి భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలని ఎంతగా ప్రభావితం చేయగలరో కాలమే సమాధానం చెప్పాలి.
వ్యాసకర్త సెల్: 9553041549






