అందరు మెచ్చిన ఆత్మబంధువు
ఆచార్య మసన చెన్నప్ప :
అప్పటికి నాకు హైదరాబాద్, సిక్రిందాబాద్ జంట నగరాల్లో బంధు వులెవ్వరూ లేరు. కానీ, బొల్ల విజయ్‌కుమార్ నాకత్యంత ప్రేమాస్పదులయ్యారు. ఆత్మీయ బంధువు అనటానికి ఆయన ఒక నమూనాగా నిలబడ్డారు. 1980లో ఎంఏ లో నాకు సర్వప్రథమునిగా నిలిచినందుకు ‘గురజాడ అప్పారావు స్వర్ణ పతకం’ లభించింది. స్వర్ణపతక గ్రహీతనైన నాకు విజయ్ కుమార్ అత్యంత సన్నిహితుడయ్యారు.
ఒకరోజు నా దగ్గరకు వచ్చి ‘త్యాగరాయగాన సభలో ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తున్నా ను. సాంస్కృతిక కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అన్నారు. అప్పటికి నేను ఇస్లామి యా హైస్కూల్ నుంచి బదిలీ అయి ‘హనుమాన్ టెక్టీ’లోని ప్రగతి మహా విద్యాల యంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ‘మరి ముఖ్యఅతిథి ఎవరు?’ అని అడిగాను. ‘మీ గురువు గారు సీ నారాయణరెడ్డి’ అని సమాధానం ఇచ్చారు.
అమ్మో గురువుగారు ము ఖ్య అతిథిగా పాల్గొంటున్న సభకు నేను అధ్యక్షత వహించడమేమిటి? ‘నేను చాలా చిన్నవాణ్ని. గురువు గారు ఒప్పుకొన్నారా?’ అని అడిగాను. ‘సంతోషంగా ఒప్పుకొన్నా రు. పైగా మీరు తన శిష్యుడని మెచ్చుకున్నా రు. మీ మొదటి పుస్తకం ‘మల్లి పదాలు (1980 ప్రచురణ) వారి అనుగ్రహం వల్లే అచ్చయినట్లు, దానికి వారు పీఠిక రాసినట్లు చెప్పారు’ అని విజయ్‌కుమార్ చెప్తుంటే నా మనస్సు ఆనంద తరంగితమైంది. సీ నారాయణరెడ్డికి ప్రతిభావంతులైన శిష్యులంటే ఎంతో ప్రేమ. వారి శిష్యుల్లో నేనూ ఉండ టం నాకు గర్వకారణమైంది.
అట్లా సినారె గురువుగారు పాల్గొన్న సభ కు అధ్యక్షత వహించిన సన్నివేశం గుర్తుకువచ్చినప్పుడల్లా విజయ్‌కుమార్ గుర్తుకు వస్తా రు. విజయ్‌కుమార్ సికింద్రాబాద్ నగరం లో ‘వైదిక సంఘం’ సంస్థాపక సభ్యులు గా, మల్లయోధులుగా, స్వాతంత్య్ర సమరయోధులుగా పేరొందిన రామస్వామిగారి పుత్రులు. వారింటికి తరచుగా వందేమాతరం రా మచంద్రరావు వచ్చేవారు. ఆయనతో నాకు మొదటిసారి వారింటనే పరిచయం అ య్యింది. సికింద్రాబాద్‌లో జన్మించిన విజయ్‌కుమార్ ‘సెయింట్ మేరీస్ హై స్కూల్’ లోను, మహబూబ్ కాలేజీలోను వి ద్యనభ్యసించి, ప్రైవేట్‌గా డిగ్రీ, పీజీ పూర్తిచేశారు.
చిన్నప్పటి నుంచి వారికిష్టమైన ఆటలు రెండున్నాయి. ఒకటి: ఫుట్‌బాల్ ఆటంటే ఆయనకు పిచ్చి ప్రేమ. ఇంటర్‌స్కూల్ టోర్నమెంట్‌లో కెప్టెన్ బాధ్యతలు స్వీకరించి ఎన్నో మార్లు విజయం సాధించారు. రెండవది: ఫోక్ డ్యాన్స్. తన 22వ ఏట నుంచి 29వ ఏటి వరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని త్యాగరాయ గాన సభ, కృష్ణయ్య హాల్, కలకత్తా ఆడిటోరియంలలో డ్యాన్స్ ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
తన తండ్రిలోని పట్టుదల విజయ్‌కుమార్‌లో కనిపిస్తుంది. నిరాబండరత, సహనశీలత, పరోపకారబుద్ధి మొద లైన సద్గుణాలతోపాటు కార్యనిర్వహణ దక్షత, అన్నాయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే పటిమ విజయ్‌కుమార్‌లో కనిపిస్తాయి. విజయ్‌కుమార్ మొదట్లో పటాన్‌చెరు పంచా యతీ సమితిలో పనిచేశారు. ఆ తర్వాత కొన్ని నెలలు సైన్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు.
ఆ తర్వాత చాలా కాలం ‘జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’లో పనిచేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హోదాలో ఉండి పదవీ విరమణ చేశారు. అకౌంట్స్ ఆడిట్స్ అంటే ఇష్టం కనుక, ఎంతో మందికి తన సూచనలందించారు ఆర్థిక విషయాల్లో. విశ్రాంత జీవితాన్ని గడుపుతూ ప్రస్తుతం ప్రజాసేవలో ఉండటం విశేషం. ఉప్పల్ ఆర్యసమాజానికి కార్యదర్శిగా, సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌కు ఆడిటర్‌గా, స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంటర్‌గా పని చేస్తూ అందరి మన్ననలు పొందారు.
విజయ్‌కుమార్ అనగానే పద్మశాలి మేళా కమిటీ గుర్తుకువస్తుంది. వారు సుమా రు 50 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఇందిరాపార్కులో జనవరి 26 నాడు జరిగే పద్మశా లి మేళా కమిటీలో పాల్గొంటారు. మేళా కమిటీ సభ్యులుగా, ముఖ్య సలహాదారుగా ఆయన చేస్తున్న సేవ గణనీయమైంది. విజయ్‌కుమార్ అనగానే ‘ఆడిటర్ విజయ్ కుమార్’ అని అందరికి గుర్తుకురావడం విశేషం.
‘భూగర్భ పరిశోధనా సంస్థ’ రిక్రియేషన్ క్లబ్ ముఖ్య కార్యదర్శిగా ఉంటూ,‘ఆల్ ఇండియా స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్ కౌన్సి ల్’ చేయడం ద్వారా విజయ్‌కుమార్ బాధ్య త మరింత పెరిగింది. విజయ్‌కుమార్ ప్రత్యేకత ఏమంటే సనాతన ధర్మం పట్ల అమిత మైన ప్రేమ ఉండటం. తానున్న కళ్యాణపురి ప్రాంతంలో జరిగే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తూ, ఆర్య సమాజం అధ్యక్షులైన వేద సింధుకి అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు.
విజయకుమార్ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ప్రతిరోజు ఏదో ఒక సేవాకార్యక్రమంలో గాని, యజ్ఞ కార్యక్రమంలో గాని ఆయన తప్పకుండా పాల్గొంటారు. పదవీ విరమణ చేసిన అందరిలాగా కాకుండా, సీనియర్ సిటిజన్లకు చేదోడువాదోడుగా ఉండి, అందరితో కలిసిపోతారు. ఇతరుల అభివృద్ధిలోనే తన అభివృద్ధిని చూసుకునేవారు ఆర్యుడని దయానంద మహర్షి చెప్పిన సూక్తిని అక్షరాల సార్థకం చేస్తున్న విజయ్‌కుమార్ అభినందనీయుడు.
వినయవిధేయతలు, ముక్కుసూటితనం, మర్యాద మొదలైన సుగుణాలను తన తల్లిదండ్రుల నుంచి పొందినట్లు విజయ్‌కుమార్ చెప్పుకోవడం అతని సౌశీల్యాన్ని తెలియజేస్తుంది. మహర్షి దయానంద సరస్వతి వైదిక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి ఎంతో మందికి, ముఖ్యంగా నాకు ఒక హితైషిగా, ముఖ్య బంధువుగా తోడ్పడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
వ్యాసకర్త సెల్: 9885654381






