మనసును గెలవడమే ప్రేమ!
ప్రేమ అనేది రెండు అక్షరాల పదం కాదు, అది రెండు మనసుల మధ్య జరిగే ఒక మహా యజ్ఞం. నేటి కాలంలో ప్రేమలు పుట్టగొడుగుల్లా పుడుతున్నాయి, అంతే వేగంగా విడిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఎదుటి మనిషిని ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ, మన సొంత మనస్సును మనం గెలవలేకపోతున్నాం. అసలు మనస్సును గెలవడమంటే ఏమిటి? అది ప్రేమ బంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనేదే ఇక్కడ ప్రశ్న.
మనస్సును గెలవడమంటే దానిని చంపేయడం కాదు, దానిని మన అదుపులోకి తెచ్చుకోవడం. మన మనస్సు ఒక అల్లరి కోతి లాంటిది. అది క్షణక్షణానికి తన అభిప్రాయాలను మార్చుకుంటుంది. ఉదాహరణకు ఒకరోజు మీ భాగస్వామి చేసిన వంట బాగుంటే ఆకాశానికి ఎత్తేస్తుంది మనస్సు, మరుసటి రోజు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అంతా అయిపోయిందన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మనసులో కలిగే కోపం, అసూయ, స్వార్థం వంటి భావాలను ఎవరైతే గుర్తించి, వాటిని నియంత్రించగలరో వారే మనస్సును గెలిచినట్లు.
మన మనస్సు మన మాట విన్నప్పుడే, మనం అవతలి వ్యక్తికి ఇచ్చే ప్రేమ స్థిరంగా ఉంటుంది. సొంత మనస్సుపై పట్టులేని వ్యక్తి ప్రేమ ఒక ఉప్పెనలా వస్తుంది, అంతే వేగంగా కరిగిపోతుంది. మన మనస్సులో ‘అభద్రతా భావం’ ఉంటే, మనం భాగస్వామిని ప్రేమించడం కంటే వారిని అనుమానించడం, అదుపు చేయడంపైనే ఎక్కువ దృష్టిపెడతాం. ఇది ప్రేమ కాదు, ఒక రకమైన మానసిక బానిసత్వం. ప్రేమలో మొదట కలిగే ‘డోపమైన్’ కిక్కు ఎల్లప్పుడూ ఉండదు.
ఆ రసాయన ప్రభావం తగ్గగానే, మనస్సు కొత్తదనం కోసం వెతుకుతుంది. మనస్సును గెలిచిన వారు మాత్రమే ఆ రసాయనాలకు అతీతంగా ‘ఆక్సిటోసిన్’ (నమ్మకం) అనే స్థిరమైన బంధాన్ని నిర్మించుకోగలరు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమలో పెద్ద శత్రువు ‘అహం’ (ఈగో). మనస్సు గెలవని వ్యక్తిలో ఈ అహం చాలా ఎక్కువగా ఉంటుంది. ‘నేను చెప్పిందే జరగాలి’, ‘నాకే గౌరవం దక్కాలి’ అనే ఆలోచనలు ఉన్నచోట ప్రేమ ఊపిరి తీసుకోలేదు.
ఒక పెన్సిల్, రబ్బరు స్నేహం లాంటిది ప్రేమ. పెన్సిల్ తప్పు చేసినప్పుడల్లా రబ్బరు తనను తాను కరిగించుకుంటూ ఆ తప్పును తుడిచేస్తుంది. రబ్బరు తన అహాన్ని (రూపాన్ని) వదులుకొని పెన్సిల్ (భాగస్వామి) కోసం త్యాగం చేస్తుంది. మనస్సును గెలిచిన వారే త్యాగానికి సిద్ధపడతారు. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ అందంగానే కనిపిస్తాయి. కానీ, పెళ్లి అనే బాధ్యతలోకి రాగానే మనస్సు అసలు స్వరూపం బయటపడుతుంది. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు భాగస్వామి అలవాట్లు, అభిప్రాయాలు మనకు నచ్చకపోవచ్చు.
మనస్సును గెలవని వారు వెంటనే గొడవకు దిగుతారు. అదే మనస్సు గెలిచినవారు ‘తను వేరు, తన ఆలోచనలు వేరు’ అని అర్థం చేసుకొని సర్దుకుపోతారు. పెళ్లి బంధం నిలబడాలంటే ఇద్దరి మధ్య ‘అవగాహన’ కంటే ‘అంగీకారం’ ముఖ్యం. ఎదుటి వ్యక్తిని అంగీకరించాలంటే ముందు మన మనస్సులోని మొండితనాన్ని గెలవాలి. ‘మనస్సును గెలవకుండా మనిషిని ప్రేమించడం సాధ్యమేనా..?’ అంటే.. సాధ్యం కాదనే చెప్పాలి.
ఎందుకంటే, మన మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు మనం అవతలి వ్యక్తికి ప్రశాంతతను ఇవ్వలేం. మన మనస్సు నిండా స్వార్థం ఉన్నప్పుడు నిస్వార్థమైన ప్రేమను పంచలేం. కాబట్టి, ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించాలనుకునే వారు మొదట తమ మనస్సులోని వికారాలను గెలవాలి. అప్పుడే ఆ ప్రేమ కాలపరీక్షకు నిలబడుతుంది. పెళ్లి అనే బంధం ఒక సామాజిక ఒప్పందంలా కాకుండా, రెండు మనసుల అద్భుత ప్రయాణంలా మారుతుంది.
కస్తూరి దారా






