వెయ్యి రోజుల్లో తెలంగాణ ప్రగతికి కొత్త బాట
సంక్షేమం, అభివృద్ధితో ప్రజల గుండెల్లో కాంగ్రెస్
రైతు, మహిళ, పేద, యువత సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : వరంగల్ ఎంపీ. కడియం కావ్య
హనుమకొండ, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజుల ప్రజాపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలోకార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ 1000 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత 32 నెలల్లో రైతుల కోసం రూ.1.68 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
హామీ మేరకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షల రైతు కుటుంబాలకు రుణవిముక్తి కల్పించామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు విడుదల చేయగా, కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. సన్నబియ్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్తో పాటు ఉచిత విద్యుత్, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
యాసంగి సీజన్లో 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కావ్య అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇప్పటివరకు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా అయిందన్నారు.
గృహజ్యోతి ద్వారా 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 4.50 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.60 వేల కోట్ల రుణాలు అందించామని చెప్పారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి అవకాశాలను కల్పిస్తున్నామని వివరించారు.
15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మొత్తం 3.38 కోట్ల మందికి పీడీఎస్ ద్వారా లబ్ధి అందిస్తున్నామని తెలిపారు. 43 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని, మరో 2.25 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తొలి విడతలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.






