రాబోయే తరాల కోసం ఆలోచించేవాడే ప్రజానాయకుడు
రూ.603 కోట్లతో యూజీడీ పనులకు భూమిపూజ.. మూడేళ్లలో నగరమంతా పూర్తి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): పదవుల కంటే మహబూబ్నగర్ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం. ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించేవాడు నాయకుడు కాదు.. రాబోయే తరాల కోసం ఆలోచించేవాడే ప్రజానాయకుడని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నగర అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు. నగరంలో రూ.603 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులకు భూమిపూజ చేస్తున్నామని, విడతల వారీగా పనులు చేపట్టి రాబోయే మూడేళ్లలో నగరమంతా యూజీడీ పూర్తి చేస్తామని తెలిపారు.
మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేసేలా ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, నగరంలో 14 వాటర్ రిజర్వాయర్లకు అనుమతులు లభించగా ఇప్పటికే 11కు శంకుస్థాపన చేశామని, ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ లీటర్ల సామర్థ్యానికి అదనంగా మరో 18 మిలియన్ లీటర్ల సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. ముడా నిధులతో రూ.1.50 కోట్లతో ట్యాంక్బండ్ సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యంతో పాటు పిల్లల విద్య, ఆరోగ్యం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ఏడాది 35 మంది వాలంటీర్లతో 30 పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు నిర్వహించగా, ఈ ఏడాది 100 మంది విద్యా వాలంటీర్లతో కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సహకారం, సూచనలు, ఆశీస్సులతో నగర అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మూఢ చైర్మన్ లక్ష్మాణ్ యాదవ్, వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.






