మియాపూర్ టౌన్ ప్లానింగ్‌లో వసూళ్ల పర్వం
కంప్యూటర్ వదిలి.. కలెక్షన్ వేటలో ఆపరేటర్!
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తనకు కేటాయించిన విధులను నిర్వర్తించడం బాధ్యతగా భావిస్తారు. కానీ మియాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శైలి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. కంప్యూటర్ కీబోర్డుపై వేళ్లు ఆడించాల్సిన వ్యక్తి, ఇప్పుడు నిర్మాణ రంగంలో ’సెటిల్మెంట్ల’ వేటలో నిమగ్నమయ్యాడు. ఆఫీస్ కుర్చీ కంటే ఫీల్ వర్క్ లోనే తనకు ’గిట్టుబాటు’ ఎక్కువని భావిస్తూ, ఉన్నతాధికారుల అండతో వసూళ్ల దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాడు. మియాపూర్ సర్కిల్ కార్యాల యంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
నిబంధనల ప్రకారం ఇతను కార్యాలయంలో ఉండి ఫైల్స్ అప్లోడింగ్, డాక్యుమెంటేషన్ వంటి పనులు చూడాలి. కానీ ఇతను కంప్యూటర్ ముందు కూర్చున్న సందర్భాలు చాలా తక్కువ. ’గడ్డం శ్రీను’గా పిలవబడే ఈ ప్రవీణ్ కుమార్, మియాపూర్ ఏసీపీ రాణి, టీపీఎస్ రమేష్ల వెంటే నిత్యం ఫీల్డ్‌లో దర్శనమిస్తున్నాడు. అధికారులకు కొత్త వారు కావడంతో దారులు తెలియవనే వంకతో, తన నెట్ వర్క్ ఉపయోగించి అక్రమ నిర్మాణాల వద్ద కు వెళ్లి చక్రం తిప్పుతున్నాడు. అధికారుల ‘కలెక్షన్ మాస్టర్’గా అవతారం ఎత్తరనే వారు పనులు సైతం వెల్లువెత్తుతున్నాయి.
మియాపూర్ పరిధిలోని హఫీజ్ పేట్, మియాపూర్ డివిజన్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలు, అధికారులు వెంటనే ఈ ‘కంప్యూటర్ ఆపరేటర్’ను రంగంలోకి దించుతారు. ఫిర్యాదు అందిందనే నెపంతో నిర్మాణదారుల వద్దకు వెళ్లి భయపెట్టడం.నోటీసులు ఇస్తామని, సామాగ్రి జప్తు చేస్తామని బెదిరించి భారీగా సొమ్ము గుంజడం. వసూలైన సొమ్ములో ఏసీపీ, టీపీఎస్‌లకు వారి వాటాలు అందిస్తూ, మిగిలిన మొత్తంతో తన జేబులు నింపుకుంటున్నాడు.
జీతం వేలల్లో.. ఆదాయం లక్షల్లో..
కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తే వచ్చే జీతం కేవలం రూ. 20 వేల లోపే. కానీ అధికారుల అండతో ఫీల్డ్‌వర్క్ చేస్తే దానికి పదింతల ఆదాయం వస్తుండటంతో ప్రవీణ్ కుమార్ తన అసలు విధులకు తిలోదకాలిచ్చాడు. జోనల్ అధికారులకు, ఉన్నతాధికా రులకు ఇతని అరాచకాలపై సమాచారం ఉన్నా, కింది స్థాయి అధికారుల మద్దతు ఉండటంతో ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని తోటి ఉద్యోగులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
నిర్మాణదారుల ఆవేదన..
ఫిర్యాదులను పరిష్కరించాల్సింది పోయి, వాటినే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్న ఈ ’కలెక్షన్ ఏజెంట్’ ఆగడాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విధుల ను విస్మరించి వసూళ్లకు పాల్పడుతున్న సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై, అతనికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
ప్రజావాణి, స్థానిక సమస్యల సమావేశాల్లో ఈ విషయంపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి, సంబంధిత శాఖ (టౌన్ ప్లానింగ్) సమన్వయం చేసుకుని కఠినమైన చర్యలు చేపడతాం.
మియాపూర్ సర్కిల్.
డిప్యూటీ కమిషనర్






