28 May, 2026 | 1:55 AM

మెడికవర్ వైద్యుల అరుదైన ఘనత

28-05-2026 12:24 AM

శస్త్రచికిత్స లేకుండానే చిన్నారి గుండెలో రంధ్రం మూసివేత

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్స ద్వారా నాలుగేళ్ల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే విజయవంతంగా మూసివేసి అరుదైన ఘనత సాధించారు.

వియాన్ పూజారి అనే నాలుగేళ్ల చిన్నారి, కేవలం 11 కిలోల బరువుతో తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు సమగ్రంగా పరీక్షించగా, చిన్నారికి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అనే జన్యుపరమైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధిలో గుండె పైభాగంలోని రెండు గదుల మధ్య రంధ్రం ఏర్పడుతుంది.

చిన్నారి వయస్సు, తక్కువ బరువు దృష్ట్యా సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీకి బదులుగా వైద్యులు ట్రాన్స్క్యాథెటర్ ఏఎస్‌డీ డివైస్ క్లోజర్ అనే అత్యాధునిక విధానాన్ని ఎంపిక చేశారు.  ఈ ప్రక్రియలో ఛాతీ కోత, శస్త్రచికిత్స, రక్తస్రావం వంటి సమస్యలు లేకుండానే చికిత్స పూర్తి చేశారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అమోల్ గుప్తా మాట్లాడుతూ, చిన్నారి గుండెలోని రంధ్రాన్ని విజయవంతంగా మూసివేయగలిగాం. శస్త్రచికిత్స అవసరం లేకపోవడంతో చిన్నారి చాలా వేగంగా కోలుకున్నాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్వరూప్, మెడికల్ సూపరింటెండెంట్ డా. కిశోర్ పాల్గొన్నారు.