28 February, 2026 | 7:15 AM

ఆప్‌కు ఊరట!

28-02-2026 12:00 AM

భారతదేశంలో నిరూపితమైన కుంభకోణాల జాబితా లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో ఢిల్లీ మద్యం కుంభకోణం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మొదలుకొని బడా రాజకీయ నేతలు, అధికారుల పేర్లు కుంభకోణంలో వెలుగుచూడడమే ఇందుకు కారణం. సుదీర్ఘంగా విచారణ జరిగిన ఈ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా కేసులో నిందితులుగా ఉన్న వారికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఊరట కల్పించింది.

సరైన ఆధారాలు లేకుండానే వీరి పేర్లు చేర్చిన కారణంగా సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు నిందితులందరి పైన నమోదు చేసిన కేసులను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గతాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 2021 నవంబర్‌లో ఢిల్లీ ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా ఢిల్లీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల్లో మద్యం విక్రయించడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతించారు.

మద్యం అమ్మకాలపై నిబంధనలను సడలించడం అనేక ప్రైవేట్ మద్యం దుకాణాల అమ్మకాలను పెంచింది. అయితే ఎక్సైజ్ పాలసీని సవరించే క్రమంలో అవకత వకలు జరిగాయన్న ఆరోపణాలు వెల్లువెత్తాయి. లైసెన్స్ హోల్డర్లకు అనుచిత ప్రయోజనాలు, లైసెన్స్ ఫీజును మాఫీ చేయడం, కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా 

ఎల్ లైసెన్స్‌ను పొడిగించారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్లు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసింది.

2023 నుంచి కొనసాగుతున్న ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ కోర్టు నిందితులకు క్లీన్‌చిట్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. నిందితులు తప్పు చేసినట్లు సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొనడాన్ని బట్టి చూస్తే కేసు విచారణ పేరుతో సీబీఐ ఇంతకాలం కాలయాపన చేసిందా అనే అనుమానం రాకమానదు. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ సరైన ఆధారాలు సాధించకపోవడం కొంతమేర ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎందుకంటే గతంలోనే తమ దర్యాప్తును పూర్తి చేసినట్లు పేర్కొన్న సీబీఐ ప్రధాన ఛార్జిషీటుతో పాటు నాలుగు అనుబంధ అభియోగ పత్రాలను దాఖలు చేస్తూ మొత్తం 14 మందిపై అభియోగాలు మోపింది. తాము పక్కా ఆధారాలతోనే నిందితులపై అభియోగాలు మోపినట్లు సీబీఐ పేర్కొంటున్నా, కోర్టు చర్య మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థపై విశ్వాసం కోల్పోయేదిగా ఉంది.

మరోవైపు కేసులో ఎన్నటికీ న్యాయమే గెలుస్తుందని, తమను కావాలనే లిక్కర్ స్కాంలో ఇరికించే ప్రయత్నం జరిగిందని ఆప్ పేర్కొంది.అయితే ఢిల్లీ కోర్టు తీర్పు నిందితులకు ఊరట కలిగించినప్పటికీ.. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించడం, బీజేపీ నేతలు కూడా కేసులో చిక్కుముడులు అలాగే ఉండిపోయాయని, వాటిపై పోరాడుతామని పేర్కొనడం చూస్తుంటే కేసు ఇప్పట్లో ముగిసేలా లేదని చెప్పొచ్చు.