29 August, 2026 | 11:33 PM

కొలువుదీరిన క్యాబినెట్!

10-06-2024 01:53 AM

మొత్తం 72 మందితో మంత్రిమండలి కూర్పు 

ఆరుగురు మహిళలకు అవకాశం

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ప్రధానమంత్రి మూడోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

వీరిలో 30 మంది క్యాబినెట్ మంత్రులు కాగా ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రిమండలిలో ఓబీసీ 27 మంది, ఎస్సీ 10 మంది, ఎస్టీ ఐదుగురు, మైనారిటీ ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఈ జాబితాలో 34 మంది మంత్రులు గతంలో కేంద్రమంత్రి లేదా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేసినవారు 23 మంది ఉన్నారు. మంత్రులుగా ఆరుగురు మహిళలకు అవకాశం లభించింది.

శివరాజ్‌సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. ౪ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన్ను ఐదోసారి ఎంపిక చేయకుండా మోదీ పక్కనపెట్టారనే విమర్శలు వినిపించాయి. విమర్శలకు తెరదించుతూ మోదీ తాజా కేబినెట్‌లో చోటు కల్పించారు. దాదాపు 18 ఏళ్లు సీఎంగా కొనసాగిన ఆయన తొలిసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయన 1996, 1998, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాదు, 2005, 2008, 2018, 2020 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేశారు. కోట్లాది రూపాయల వ్యాపమ్ కుంభకోణంలో చౌహాన్ పాత్ర ఉందంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ఆయన నిర్దోషిగా బయటపడ్డారు.

భూపతిరాజు శ్రీనివాసవర్మ

వర్మ 1988లో బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992 పశ్చిమ గోదావరి జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇన్‌ఛార్జి చైర్మన్‌గానూ సేవలందించారు. తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా 2.76 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 

జగత్ ప్రకాశ్ నడ్డా..

63 ఏళ్ల జేపీ నడ్డాను మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి పదవి వరించింది. నాలుగేళ్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక మంత్రి. 2014 నవంబర్ 9 నుంచి 2019 మే 30 వరకు కేంద్ర వైద్య శాఖ మంత్రిగా సేవలందించారు. న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన నడ్డా.. ఏబీవీపీ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. 1991లో భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు.

అమిత్ షా..

ఎన్నికల వ్యూహకర్తగా అమిత్ షాకు పేరుంది. బీజేపీ ఎదుగుదలలో అమిత్‌షా కీలక పాత్ర పోషించారు. ఆధునిక చాణక్యుడిగా అమిత్‌షాకు పేరుంది. 1964లో గుజరాతీ కుటుంబంలో ముంబైలో జన్మించారు. 1980లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడం ద్వారా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1987లో బీజేపీ యువ విభాగమైన భారతీయ జనతా యువ మోర్చాలో చేరారు. ఎల్‌కే అద్వాణీ, అటల్ బిహారీ వాజ్‌పేయికి ఎన్నికల్లో ప్రధాని ప్రచారకర్తగా, వ్యూహకర్తగా అమిత్‌షా వ్యవహరించేవారు. 2019, 2024లో గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ఒకేసారి 12 కీలకమైన శాఖలను ఆయన నిర్వహించారంటే ఆయన ప్రాబల్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 నుంచి 2019 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు.

నితిన్ గడ్కరీ 

హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి వరుసగా మూడోసారి మోదీ కేబినెట్‌లో చోటు దక్కింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 67 ఏళ్ల నితిన్ గడ్కరీ గత రెండు పర్యాయాలు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గత పదేళ్లలో దేశంలో 90 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు, 30 వేల కిలోమీటర్ల కొత్త రహదారులను నిర్మించిన ఘనత  గడ్కరీకే దక్కింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో ప్రారంభమైన ఆయన రాజకీయ నేపథ్యం బీజేపీ జాతీయ అధ్యక్షుడి, కేంద్ర మంత్రిగా కొనసాగింది. తాజా ఎన్నికల్లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి కేంద్ర కేబినెట్‌లో చేరారు. 

రాజ్‌నాథ్ సింగ్..

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాకు చెందిన రాజ్‌నాథ్ సింగ్.. అటల్ బిహారీ వాజపేయికి వీరవిధేయుడిగా పేరుంది. 1951 జూలై 10న వారణాసి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మీర్జాపూర్‌లోని కేబీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా తొలిసారి పనిచేశారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్.. 2005లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగారు. 2014 మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి రక్షణ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.

1974లో రాజకీయాల్లోకి వచ్చిన రాజ్‌నాథ్ సింగ్.. 1977లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో శాసన మండలికి ఎన్నికయ్యారు. 1991లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో వాజపేయి ప్రభుత్వంలో ఉపరితల రవాణా మంత్రి పదవి చేపట్టారు. 2000 అక్టోబర్ 28న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.

కింజరపు రామ్మోహన్‌నాయుడు

ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. యువ ఎంపీ రామ్మోహన్ నాయు డు తండ్రి ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో 26 ఏళ్ల పిన్న వయస్సులోనే ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2019లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రామ్మోహన్ నాయుడు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. చిన్నాన్న అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. 

పీయూష్ గోయెల్

మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన పీయూష్ గోయెల్ (59 ఏళ్లు).. హెచ్‌ఆర్ కాలేజ్, ప్రభుత్వ లా కాలేజీలో విద్యనభ్యసించి, చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. ముంబై నార్త్ నుంచి ఎంపీగా గెలుపొందిన పీయూష్‌కు కేంద్ర మంత్రి వర్గంలో మోదీ మరోసారి చోటు కల్పించారు. మోదీ 2.0లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే, షిప్పింగ్ వంటి అనేక కీలక శాఖలను నిర్వహించారు. 2010 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2021లో రాజ్యసభలో బీజేపీ సభాపక్ష నేతగా నియమితులయ్యారు. ఆయన తండ్రి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వేద్ ప్రకాశ్ గోయెల్. ఆయన తల్లి చంద్రకాంత గోయెల్.. మహారాష్ట్రలోని మాతుంగా ఎమ్మెల్యేగా పనిచేశారు.

పెమ్మసాని చంద్రశేఖర్

దేశంలోనే అత్యంత ధనిక ఎంపీల్లో ఒకరైన చంద్రశేఖర్ వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబ య్యగా నరసరావుపేట ప్రాంత వాసులకు ఆయన సుపరిచితులు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అమెరికా వెళ్లిన ఆయన అక్కడే పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్ట్ పేరు తో ఆన్‌లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు. అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించా రు. తొలి నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 

హెచ్‌డీ కుమారస్వామి

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడైన కుమారస్వామికి మోదీ తాజా కేబినెట్ లో చోటు దక్కింది. రెండుసార్లు కర్ణాటక సీఎంగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తొలిసారి కేంద్ర కేబినెట్‌లో స్థానం సంపాదించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీతో చేతులు కలిపారు. తాజా ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగారు. 2,84,620 ఓట్ల తేడా తో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గౌడపై విజయం సాధించారు. బీజేపీతో పొత్తు కారణంగా మోదీ 3.0 కేబినెట్‌లో చేరారు. 

సురేశ్ గోపి

ప్రముఖ మళయాల నటుడు సురేష్ గోపి 250కి పైగా చిత్రాల్లో నటించాడు. 2016లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ త్రిస్సూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ మూడో స్థానానికే పరిమితమయ్యారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై విజయం సాధించారు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేష్ గోపి తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు.

శోభ కరంద్లాజే

కర్ణాటకకు చెందిన 57 ఏళ్ల శోభ కరండ్లాజే ఆర్‌ఎస్‌ఎస్ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పకు అత్యంత సన్నిహితురాలిగా శోభకు పేరుంది. తాజా ఎన్నికల్లో బెంగళూరు నార్త్ సీటు నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక్కడ గెలుపొందిన తొలి మహిళ శోభ కావడం గమనార్హం. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు సమీపంలోని చర్వక గ్రామంలో ఆమె 1966 అక్టోబర్ 23న జన్మించారు. 

రామ్‌నాథ్ ఠాకూర్

ఇటీవల భారతరత్న వరించిన కర్పూరీ ఠాకూర్ కుమారుడు. బీహార్‌లోని అత్యంత వెనుకబడ్డ వర్గాలకు ఆద్యుడిగా రామ్‌నాథ్ ఠాకూర్, ఆయన తండ్రి కర్పూరీ ఠాకూర్‌కు పేరుంది. నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన రామ్‌నాథ్ ఠాకూర్.. బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. 2014లో జేడీయూ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.  రామ్‌నాథ్ ఠాకూర్ తండ్రి కర్పూరీ ఠాకూర్ 1970 నుంచి 1971 మధ్య ౭ నెలలు, 1977 నుంచి 1979 వరకు బీహార్ సీఎంగా పనిచేశారు.

కేంద్ర మంత్రివర్గం.. 

నరేంద్రమోదీ వారణాసి (యూపీ) బీజేపీ

రాజ్‌నాథ్‌సింగ్ లఖ్‌నవూ (యూపీ) బీజేపీ

అమిత్ షా గాంధీనగర్ (గుజరాత్) బీజేపీ

నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ (మహారాష్ట్ర) బీజేపీ

జగత్‌ప్రకాశ్ నడ్డా (రాజ్యసభ ఎంపీ) గుజరాత్ బీజేపీ

శివరాజ్‌సింగ్ చౌహాన్ (విదిశ) మధ్యప్రదేశ్ బీజేపీ

నిర్మలా సీతారామన్ (రాజ్యసభ ఎంపీ) కర్ణాటక జేపీ

సుబ్రమణ్యం జైశంకర్ (రాజ్యసభ ఎంపీ) గుజరాత్ బీజేపీ

మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్ (హిమాచల్‌ప్రదేశ్) బీజేపీ

హెచ్‌డీ కుమారస్వామి మాండ్య (కర్ణాటక) జేడీఎస్

పీయూష్ గోయల్ ఉత్తర ముంబై (మహారాష్ట్ర) బీజేపీ

ధర్మేంద్ర ప్రధాన్ సంబాల్‌పూర్ (ఒడిశా) బీజేపీ

జితన్ రామ్ మాంఝీ గయ (బీహార్) హెచ్‌ఏఎం (సెక్యులర్)

రాజీవ్‌రంజన్ (లలన్) సింగ్ ముంగేర్ (బీహార్) జేడీయూ

సర్బానంద సోనోవాల్ దిబ్రూగఢ్(అసోం) బీజేపీ

డాక్టర్ వీరేంద్ర కుమార్ టీకమ్‌గఢ్(మధ్యప్రదేశ్) బీజేపీ

కింజారపు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం (ఏపీ) టీడీపీ

ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ (కర్ణాటక) బీజేపీ

జుయల్ ఓరం సుందర్‌గఢ్ (ఒడిశా) బీజేపీ

గిరిరాజ్ సింగ్ బెగుసరాయ్ (బీహార్) బీజేపీ

అశ్విని వైష్ణవ్ రాజ్యసభ ఎంపీ (ఒడిశా) బీజేపీ

జ్యోతిరాదిత్య సింధియా గుణ (మధ్యప్రదేశ్) బీజేపీ

భూపేందర్ యాదవ్ అల్వార్ (రాజస్థాన్) బీజేపీ

గజేంద్రసింగ్ షెకావత్ జోధ్‌పూర్ (రాజస్థాన్) బీజేపీ

అన్నపూర్ణదేవి కోడర్మా (జార్ఖండ్) బీజేపీ

కిరణ్ రిజిజు పశ్చిమ అరుణాచల్ బీజేపీ

హర్‌దీప్‌సింగ్ పూరీ రాజ్యసభ ఎంపీ (యూపీ) బీజేపీ

మన్సుఖ్ మాండవీయ పోరుబందర్ (గుజరాత్) బీజేపీ

జీ కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ (తెలంగాణ) బీజేపీ

చిరాగ్ పాసవాన్ హాజీపూర్ (బీహార్) ఎల్‌జేపీ(ఆర్‌వీపీ)

సీఆర్ పాటిల్ నవ్‌సారీ (గుజరాత్) బీజేపీ

ఇందర్‌జిత్ సింగ్ రావ్ గుర్‌గ్రామ్ (హర్యానా) బీజేపీ

జితేంద్ర సింగ్ ఉదమ్‌పూర్ (జమ్ముకశ్మీర్) బీజేపీ

అర్జున్‌రామ్ మేఘవాల్ బికానేర్ (రాజస్థాన్) బీజేపీ

ప్రతాప్‌రావ్ జాదవ్ బుల్‌డాణా(మహారాష్ట్ర) శివసేన

జయంత్ చౌదరి రాజ్యసభ ఎంపీ(ఉత్తర్‌ప్రదేశ్) ఆర్‌ఎల్‌డీ

జితిన్ ప్రసాద పిలిభీత్ (యూపీ) బీజేపీ

శ్రీపాద్ నాయక్ నార్త్ గోవా (గోవా) బీజేపీ

పంకజ్ చౌదరి మహారాజ్‌గంజ్ (యూపీ) బీజేపీ

కిషన్‌పాల్ గుర్జర్ ఫరీదాబాద్ (హర్యానా) బీజేపీ

రామ్‌దాస్ అథవాలే రాజ్యసభ ఎంపీ (మహారాష్ట్ర) ఆర్‌పీఐ

రామ్‌నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీ (బీహార్) జేడీయూ

నిత్యానంద్ రాయ్ ఉజియార్‌పూర్ (బీహార్) బీజేపీ

అనుప్రియ పటేల్ మీర్జాపూర్ (యూపీ) అప్నాదళ్

వీ సోమన్న తూముకూరు (కర్ణాటక) బీజేపీ

చంద్రశేఖర్ పెమ్మసాని గుంటూరు (ఏపీ) టీడీపీ

సత్యపాల్ సింగ్ బఘేల్ ఆగ్రా (యూపీ) బీజేపీ

శోభ కరంద్లాజే ఉత్తర బెంగళూరు (కర్ణాటక) బీజేపీ

కీర్తివర్ధన్ సింగ్ గోండా (యూపీ) బీజేపీ

బన్వారీలాల్ వర్మ రాజ్యసభ ఎంపీ (యూపీ) బీజేపీ

శాంతను ఠాకూర్ బన్‌గావ్ (పశ్చిమబెంగాల్) బీజేపీ

సురేశ్ గోపీ త్రిస్సూర్ (కేరళ) బీజేపీ

ఎల్ మురుగన్ రాజ్యసభ ఎంపీ బీజేపీ

అజయ్ తాంటా ఆల్మోరా (ఉత్తరాఖండ్) బీజేపీ

బండి సంజయ్ కరీంనగర్ (తెలంగాణ) బీజేపీ

కమలేశ్ పాసవాన్ బన్స్‌గావ్ (యూపీ) బీజేపీ

భగీరథ్ చౌదరి ఆజ్మేర్ (రాజస్థాన్) బీజేపీ

సతీశ్ చంద్ర దూబే రాజ్యసభ ఎంపీ (బీహార్) బీజేపీ

సంజయ్ సేఠ్ రాంచీ (జార్ఖండ్) బీజేపీ

రవనీత్ సింగ్ బిట్టు         బీజేపీ

దుర్గాదాస్ ఉయికే బీతుల్ (మధ్యప్రదేశ్) బీజేపీ

రక్షా నిఖిల్ ఖడ్సే రావెర్ (మహారాష్ట్ర) బీజేపీ

సుకంతా మజుందార్ బలూర్‌ఘాట్ (బెంగాల్) బీజేపీ

సావిత్రి ఠాకూర్ ధార్ (మధ్యప్రదేశ్) బీజేపీ

తోఖాన్ సాహూ బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) బీజేపీ

రాజ్‌భూషణ్ చౌదరి ముజఫర్‌పూర్ (బీహార్) బీజేపీ

భూపతిరాజు శ్రీనివాస వర్మ నర్సాపూర్ (ఏపీ) బీజేపీ

హర్ష్ మల్హోత్రా తూర్పు ఢిల్లీ (ఢిల్లీ) బీజేపీ

నిముబెన్ బాంభానియా భావ్‌నగర్ (గుజరాత్) బీజేపీ

మురళీధర్ మొహోల్ పుణే (మహారాష్ట్ర) బీజేపీ

జార్జ్ కురియన్           బీజేపీ

పబిత్రా మార్గరిటా రాజ్యసభ ఎంపీ (అసోం) బీజేపీ

విశిష్ట అతిథులు వీరే..

* భారత్ చుట్టుపక్కల ఉన్న ఆరు దేశాల ప్రభుత్వాధినేతలు హాజరు

*  ప్రత్యేక అతిథులుగా ట్రాన్స్‌జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకొన్న కార్మికుల్లో 90 మంది, 30 మంది సఫాయి కర్మచారీలు హాజరయ్యారు.

*  మన్‌కీ బాత్, వికసిత్ భారత్ అభియాన్, నమో యాప్‌లో పాలుపంచుకొన్న వారికి ఆహ్వానం అందింది.

*  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పాల్గొన్నారు.

* మాజీ రాష్ట్రపతులు రామ్‌నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్ పాల్గొన్నారు.

* కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు. ముఖేశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఆనంద్ పిరమల్, గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతి అదానీ, సోదరుడు రాజేశ్ అదానీ తదితరులు హాజరయ్యారు. 

* నటులు అనుపమ్ ఖేర్, షారూఖ్ ఖాన్, అనిల్‌కపూర్, రవీనా టాండన్, అక్షయ్ కుమార్, విక్రాంత్ మాస్సీ, రజనీకాంత్, చిరంజీవి హాజరయ్యారు.

* జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకురాలు షెల్హా రషీద్ హాజరు.

* రాష్ట్రపతి భవన్ వద్ద 2,500 మందితో 

* భారత దేశంలోని అన్ని దేశాల రాయబారులు హాజరయ్యారు.

n  ప్రమాణ స్వీకారానికి ౮ వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు.

*  ట్రాఫిక్ నియంత్రణకు 1,100 మంది ట్రాఫిక్ పోలీసులను మోహరించారు.

* ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీ గగనతలం మూసివేశారు.