గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్
ఒక కిలో నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం
మహాముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో భూపాలపల్లి సీసీఎస్ పోలీసులు, అడవిముత్తారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కాటారం గ్రామానికి చెందిన దానం శశికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 1 కిలో 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.70,000/-గా అంచనా వేశారు. ఈ మేరకు నిందితుడిపై ఎన్ డి పీ ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. గంజాయి సేవించడం, విక్రయించడం లేదా అక్రమంగా రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై ఎన్ డి పీ ఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు.






