30 August, 2026 | 12:40 AM

సర్కారుకే చుక్కలు!

10-06-2024 01:46 AM

రైస్ మిల్లర్ల మజాకా!!

సిఎంఆర్ ఎగవేతకు ఎత్తుగడలు

36 మిల్లర్ల యజమానులు కుయుక్తులు

లీజు పేరిట మిల్లర్ల మాయాజాలం

అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న వైనం

కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో గోల్‌మాల్

కామారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): రైస్ మిల్లర్ల మాయాజాలం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది. అధికారులను తప్పుదోవ పట్టించి, తప్పు చేసిన వారే దర్జాగా పేరు మార్చుకొని ధాన్యాన్ని తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2022 రబీ సీజన్‌లో 163 రైస్‌మిల్లు యజమానులు 4,73,871 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్నారు. ప్రభుత్వానికి 126 మంది రైస్‌మిల్లర్లు 2,94,218 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్‌ను అప్పగించారు. మరో 36 మంది రైస్‌మిల్ యజమానులు 23,154 మెట్రిక్ టన్నుల బియ్యంను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది.

సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విదానానికి ప్రభుత్వం ఇక స్వస్తి పలకాలని భావిస్తోంది. ధాన్యం ఇచ్చేటప్పుడే మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్ అప్పగించక పోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లరను బ్లాక్ లిస్టులో పెట్టాలని భావిస్తుంది. తాజాగా చర్చనీయాంశమైన 2022 రబీ సీజన్‌లోని జిల్లాలో 37 మంది మిల్లర్లు సిఏంఆర్ బియ్యాన్ని 23, 276 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉండగా, ఉదాసీనంగానే మిల్లర్లు వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వం సీఎంఆర్ రైస్ అందించని మిల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందకు చెందిన ఓ రైస్‌మిల్ యజమాని 121.883 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఇంకా 36 మంది మిల్లర్లు 23,154 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడి ఉన్నారు. వారు ప్రభుత్వానికి చెల్లించకపోవడం చూస్తుంటే ఆ ధాన్యాన్ని ఎప్పుడో అమ్మివేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోకపోవడానికి అప్పటి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల హస్తం ఉండడం వల్లే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.

ప్రస్తుతం ప్రభుత్వ మారడంతో సీఎంఆర్ రైస్ బకాయిపడి ఉన్న మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించాలని ఉద్దేశ్యంతో అధికారులు ఎల్‌ఎంటీల ధాన్యాన్ని సీఎంఆర్ చేయని, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించని మిల్లులపై కోరడా ఝుళిపించాలని భావిస్తోంది. దీంతో జిల్లాలో కొందరు గోల్‌మాళ్ చేసిన మిల్లర్లు మిల్లులను లీజుకు తీసుకొని ధాన్యాన్ని అమ్ముకొని చేతులెత్తెసినట్లు తెలుస్తోంది. మిల్లర్ల యజమానులు లీజుకు తీసుకున్న వారిని తమ ఆస్థులు ప్రభుత్వం అటాచ్ చేసుకుంటుందని మీరే బాధ్యులని చెప్పడంతో ఈ సీజన్‌లో యజమానుల పేరున ధాన్యం సేకరించి బకాయి పడిన సీఎంఆర్ రైస్‌ను ప్రభుత్వానికి అప్పగించేందుకు కొందరు మిల్లర్లు ఎత్తుగడ వేసి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో కొత్తగా వచ్చిన పౌరసరఫరాల శాఖ అధికారుల తీరును అలసత్వంగా తీసుకొని, కొందరు మిల్లర్లు మళ్లీ కొత్త పేర్లతో ధాన్యాన్ని సేకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మిల్లర్లు మరో కొత్త నాటకంతో యాసంగి సీజన్‌లో ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఎంతమంది రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తీసుకున్నారని ఆ శాఖ అధికారులను అడుగగా 83 మంది మిల్లర్లు ధాన్యాన్ని తీసుకున్నట్లు, 40 మంది మిల్లర్లు లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారులు లోతుగా విచారణ చేపడితే మిల్లర్ల మాయాజాలం బయటపడే అవకాశముం ది. నిజాయితీగా పనిచేస్తున్న మిల్లర్లకు చెడ్డ పేరును ఆపాదిస్తున్నారు.

గతంలో సీఎంఆర్ రైస్ అప్పగించని మిల్లర్లు జూన్ చివరి వరకు ప్రభుత్వానికి అప్పగించకుంటే కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వారికి సమాచారం అందించారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మల్లికార్జున్ బాబును వివరణ కోరగా ప్రస్తుతం ధాన్యం మిల్లర్లకు అప్పగించే బిజీలో ఉన్నట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిన మిల్లర్ల వివరాలను అందిస్తామని తెలిపారు. గతంలో ధాన్యం తీసుకొని సీఎంఆర్ రైస్ అందించని మిల్లర్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని విజయక్రాంతితో తెలిపారు. 

మిల్లర్లు గడువులోగా రైస్‌ను అందించకుంటే చర్యలు తప్పవు

కామారెడ్డి జిల్లాలో 36 మంది మిల్లర్లు సిఎంఆర్ రైస్‌ను అప్పగించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ నెల 30 వరకు గడువు ఇచ్చింది. గడువులోగా మిల్లర్లు రైస్‌ను అందించకుంటే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బాధ్యులైన మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. గతంలో జరిగిన పొరపాట్లు ఈ సీజన్‌లో జరగకుండా చర్యలు చేపట్టాం.

మల్లికార్జున్ బాబు, 

జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి