నగర సమస్యల పరిష్కారానికి సమన్వయం అవసరం
ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... నగరంలోని వివిధ డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకువచ్చిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని మేయర్ కొలగాని శ్రీనివాస్, నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌లను కోరారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు, నగర పరిధిలోని సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు పాలకవర్గం మరియు అధికారులు పరస్పర సమన్వయం తో కృషి చేయాలని సూచించారు.
ముఖ్యంగా నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రతి డివిజన్‌లో అదనంగా ఇద్దరు పారిశుధ్య కార్మికులను తాత్కాలిక పద్ధతిలో నియమించాలని తాను మేయర్ మరియు కమిషనర్ లను కోరగా, ఈ ప్రతిపాదనను టేబుల్ ఎజెండాగా ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులు దానిని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం జరిగిందని తెలిపారు.ఈ సర్వసభ్య సమావేశంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






