పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు
విద్యార్థులకు తప్పిన ప్రమాదం...
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మాదారం గ్రామం వద్ద ఒక ప్రైవేట్ స్కూలు బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మేడ్చల్ లోని చాణక్య విజన్ స్కూల్ కి చెందిన బస్సు 30 మంది విద్యార్థులతో బయలుదేరింది. మధ్యలో గిర్మాపూర్, రాయిలాపూర్ గ్రామాలలో విద్యార్థులను దింపి బండ మాదారం గ్రామానికి వెళ్తుండగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రెగ్యులర్ డ్రైవర్ సెలవు మీద వెళ్లడంతో తాత్కాలిక డ్రైవర్ ను పంపారు. పిల్లలకు స్వల్ప గాయాలే కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది దూరంలో విద్యుత్ స్తంభం ఉంది. దానికి ఢీకొడితే పెద్ద ప్రమాదం జరిగేదని తల్లిదండ్రులు తెలిపారు. కాగా, బస్సు కండిషన్ లో లేదని స్టీరింగ్ తిప్పిన తిరుగలేదని డ్రైవర్ సత్యనారాయణ తెలిపారు. ముందే పాఠశాల యాజమాన్యానికి కూడా చెప్పానని ఆయన తెలిపారు.






