రైతుకు భరోసా లభించేనా..!
రైతు, కౌలు రైతు కష్టాలు తీరేనా
ఎకరాంకు రూ.7500ల కోసం రైతు ఎదురుచూపు
అసెంబ్లీ సమావేశాలపై రైతుల ఆశలు
యాసంగికి పంట సాయం అందేనా
సిరిసిల్ల (విజయక్రాంతి): యాసంగి సీజన్‌లో పంటల సాగు కోసం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా లభించేనా అని రైతులు ఆశగా ప్రభుత్వం పైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కొ సీజన్‌కు పంటకు పెట్టుబడిగా రూ.7500లు ఎడాదికి రూ.15 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ పాలన ఎడాది కావడంతో ఈ యాసంగి సీజన్‌లో పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందుతాయ, లేవా అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. జిల్లాలోని 13 మండలాల్లో ఎక్కువగా వరి పంట సాగుపై రైతాంగం ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఈ యాసంగిలో 1.77 లక్షల ఎకరాలలో సాగు చేస్తారనే అధికారులు అంచనా వేశారు. గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరంకు రూ.5 వేల చొప్పున, ఎడాదికి రూ.10 వేలను 1.30 లక్ష మంది రైతులకు రూ.250 కోట్లకు పైగా సాయం అందించింది.
కానీ కొత్త ప్రభుత్వం మాత్రం ఎడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సోమవారం నుంచి అసెంబ్లీలో నిర్వహించనున్న సమావేశాల్లో రైతు భరోసాపై స్పష్టత వచ్చే ఆవకాశం మొండుగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కౌలు రైతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకృతి వైపరీత్యానికి నష్టపోయిన కౌలు రైతులకు ఎలాంటి సాయం అందించకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కౌలు రైతుల కష్టాలు తీర్చుతామని ఎన్నికల్లో వాగ్ధానాలు చేశారు. ఈ సారైనా తమ కష్టాలు గట్టెనా అనే ఆశతో ఉన్నారు. జిల్లాలో దాదాపు 80 వేల వరకు కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాల పెరుగుదల ఎక్కువగా ఉండడం, కౌలు ధరలు సైతం ఎక్కువగా కావడంతో కౌలు ఇచ్చేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాంకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండడంతో ఈసారి రైతు భరోసా లభిస్తుందా అనే ఆశల పల్లకిలో ఉన్నారు. ప్రభుత్వం రైతుల కష్టాలను గట్టెక్కించేందుకు ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవాలని రైతులు, కౌలు రైతులు కోరుతున్నారు.






