మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి మూలం
కొమురం భీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ.
ఉట్నూర్, మే 1,(విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే వారికి సరైన అవకాశాలు, ప్రోత్సాహం అవసరమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురంభీమ్ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు.మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ "శక్తి అభియాన్"కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఉట్నూర్ మండలకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శక్తి అభియాన్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ శివ లాల్, స్టేట్ కోఆర్డినేటర్ కృష్ణవేణి అల్లూరితో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు "శక్తి అభియాన్" ద్వారా గ్రామ స్థాయి నుంచి మహిళలను చైతన్యవంతం చేసి, ఆర్థికంగా బలపరచడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం అభివృద్ధి సాధ్యమని అన్నారు.రాజకీయాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. మహిళలు కేవలం ఓటర్లుగానే కాకుండా, నిర్ణయాధికారంతో కూడిన నాయకులుగా ఎదగాలి. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం సంపూర్ణంగా ఉండదు. అందుకే ‘తెలంగాణ శక్తి అభియాన్’ ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సుగుణక్క పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శక్తి అభియాన్ అసెంబ్లీ కోఆర్డినేటర్ వాసవి,సభ్యులు ఆత్రం ప్రకృతి,కనక పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






