7 May, 2026 | 12:25 AM

ప్రహరీ గోడకు పరిష్కారం

25-05-2024 12:05 AM

అప్పుడు నేను వారాశిగూడలో ఉండేవాణ్ణి. 160 గజాల ప్లాట్ లో నేను, మా అన్నగారూ ఇద్దరం పక్కపక్కనే మూడేసి గదుల చొప్పున ఇళ్లు కట్టుకున్నాం. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు నేనూ, నా భార్యతోపాటు నా రెండేళ్ల క్రాంతికుమార్ ఉన్నాడు. ఆ ఇంట్లో ఉండగానే మరో ఇద్దరు పిల్లలు కలిగారు. కాని, ఆ ఇంటిని విడిచి ఎక్కడికీ వెళ్లలేదు.

ఆ ఇంట్లో ఉండగానే ఇస్లామియా హై స్కూల్ నుంచి ప్రగతి మహావిద్యాలయానికి, ప్రగతి మహావిద్యాలయం నుంచి ఉస్మానియా  విశ్వవిద్యాలయానికి ఉద్యోగరీత్యా పదోన్నతి పొందాను. ఇల్లు సరిపో వడం లేదని నా శ్రీమతి ప్రమీల ఏనాడూ చెప్పలేదు. అద్దె ఇంటికంటే చిన్నదైనా సొంతిల్లు శ్రేష్ఠమని ఆమె భావన. హైదరాబాద్. జంట నగరాలకు మధ్య మా ఇల్లు వుండడం వల్ల ఉద్యోగం మారినా ఇల్లు మారవలసిన అవసరం రాలేదు. కానీ, నాకే అనిపించింది, మూడు గదుల ఇంట్లో ఎందుకీ కష్టమని. కానీ, కొత్తగా ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా డబ్బు కావాలి. అప్పు చేయడం అప్పటిదాకా అలవాటు లేదు. 

ఇరవై వేలకే ప్లాటు

పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇంట్లో చదువుకోవడానికి వీలు కావడం లేదు. అది 1990 మాట. రెండు వందల గజాల ప్లాట్ కొనడానికి సిటీకి దూరంగా కనీసం ఇరవై వేలన్నా వెచ్చించాలి. అదృష్టవశాత్తు నా ఉద్యోగం ఆ ఇంట్లో ఉండగానే ఉస్మానియా యూనివర్సిటీకి మారింది. అంతకు ముందు ప్రగతి మహావిద్యాలయంలో ఎనిమిదన్నర ఏళ్లు పని చేశాను. అందుకుగాను కళాశాలలో నా పిఎఫ్ డబ్బు కొంత ఉంటుందని తెలుసుకున్నాను. విశ్వవిద్యాలయానికి మారాను కనుక, నా పిఎఫ్ డబ్బు ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేశాను. ఆశ్చర్యంగా నాకు ఇరవై వేల రూపాయలు సాంక్షన్ అయ్యాయి. ఆ డబ్బుతో బోడుప్పల్‌లో ప్లాటు ఖరీదు చేశాను. నేను కొనుక్కోవడమేకాక ప్రగతి కళాశాలలో నాతోపాటు పనిచేసిన మోహన్‌రావుతోను ఒక ప్లాటు కొనిపించాను. 

సిటీలో అంతర్భాగమైన బోడుప్పల్

ప్లాటు కొననైతే కొన్నాను కాని దాన్ని ఒక పదిహేనేళ్లపాటు చూసిన పాపాన పోలేదు. ‘పక్కనున్న వాళ్లు ఇళ్లు కడితే మన ప్లాటు గుర్తించవచ్చునని’ అనుకున్నాను. ప్లాటు కొన్న పదిహేనేళ్లకు బోడుప్పల్ సిటీలో అంతర్భాగమైంది. ఆశ్చర్యం ఏమిటంటే, నా ప్రోత్సాహంతో ప్లాటు కొన్న మోహన్‌రావు అప్పుడే ఇల్లు కట్టేశాడు. అతడు కుడి పక్కన ఇల్లు కడితే, ఎడమ పక్కన మరొక మిత్రుడు ఇల్లు కట్టాడు. నా ప్లాటును చక్కగా గుర్తించడానికి అవకాశం లభించింది. అంతేకాదు, ‘కొంత లోను తీసుకొని నేనుకూడా ఇల్లు కడితే బాగుంటుందనే’ ఆలోచన వచ్చింది.

వెంటనే హెచ్‌డిఎఫ్‌సి లోనుకోసం అప్లయి చేశాను. పది లక్షల రూపాయల లోను సులభంగానే లభించింది. అది 2005 ప్రాంతం. నూరు రూపాయలకే ఒక సిమెంటు బస్తా దొరుకుతుంది. ఇసుక, సీకుల రేటు కూడా అంత ఎక్కువగా లేదు. 267 గజాల ప్లాటులో చక్కని ఇల్లు నిర్మించాలని అనుకున్నాను. అదృష్టవశాత్తు నా ఆధ్యాత్మిక గురువు గోపదేవిశాస్త్రి శిష్యుడు సోమసుందరాచారి ఇంజినీరని తెలిసింది. ఎట్లాగైతేనేమి సోమసుందరం గారు కాంపౌం డు వాల్ తప్ప ఇంటిని సుందరంగా నిర్మించాడు. పెద్ద హాలు, కిచెన్, మూడు విశాలమైన గదులు, కారు పార్కింగ్ అన్ని వసతులను కల్పించాడు.

తప్పును మన్నించే మనసుండాలి

ఇల్లు అయింది. గోడలకు సున్నాలయ్యాయి. ఇక, కాంపౌండు వాల్ మాత్రమే మిగిలింది. సోమసుందరం గారు అప్పటిదాకా నా ఇంటిజాగ ఎన్ని గజాలని అడగలేదు. కానీ, అతనికి తెలియకుండా ఇల్లెలా అవుతుంది. “చెన్నప్ప గారూ! మీకో విషయం చెప్పాలి. మీ కుడిపక్కన ఉన్న వ్యక్తి మీ జాగలో తన కాంపౌండు వాల్ కట్టుకున్నాడు. నేను ఇంతవరకే చెప్పాలి. కానీ, మీరతనితో తగవు పెట్టుకోవడం నాకిష్టం లేదు కనుక చెప్పలేదు” అన్నాడు. నేను టేపు తీసుకొని నాలుగుసార్లు కొలిచాను. ‘నా మిత్రుడు, నాతోపాటు కళాశాలలో పని చేసిన మోహన్‌రావు ఇంత పని చేస్తాడా?’ అని ఆవేశానికి లోనయ్యాను. బాధ పడ్డాను.

‘నాకు తెలియకుండా నా జాగలో అతడు కాంపౌండు వాల్ ఎందుకు కట్టినట్టు?’ ఈ ప్రశ్న ఒక వారం దాకా నా మనస్సులో చెలరేగింది. ‘మోహన్‌రావును పిలిపించి అడిగితే సరిపోతుంది కదా’ అనుకున్నాను. ఒకరోజు ఫోను చేసి అనుకున్నట్లే పిలిపించాను. అతడు వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పాను. ‘ఏమవుతుందిలే’ అని తన భార్య అనడం వల్ల తానా పనిచేసినట్లు ఒప్పుకున్నాడు. మొదట ఇల్లు కట్టు కున్నవాడు, పక్కవాని ప్లాటును కొంత కాజేస్తాడనే ఊహకు మోహన్‌రావు మాట లు బలాన్నిచ్చాయి. మోహన్‌రావు నా మిత్రుడు కనుక నాతో పోట్లాడదలచు కోలేదు. “నాది పొరపాటైంది. ఈ 60 ఫీట్ల కాంపౌండు వాల్‌ను కూలగొట్టమని మీరంటే ఆ పని ఇవ్వాళే చేస్తాను. ఈ నష్టపరిహారం ఇవ్వమన్నా ఇస్తాను” అని వినయంగానే చెప్పాడు. ఎప్పుడైనా నాకు ఇబ్బంది ఏర్పడితే నా శ్రీమతి ప్రమీలను సంప్రదించడం అలవాటు. మోహన్‌రావు మా ప్లాట్‌లోకి జరిగిన విషయం చెప్పాను. 

ఆమె చాలా తెలివిగలది. అప్పుడప్పుడు ఎదుటివారి తప్పులను తప్పులు గా తీసుకోదు. అది ఆమె వ్యక్తిత్వంలోని సుగుణం. దేనికైనా పరిష్కారం వెదుకుతుంది కాని, తప్పులు చూడదు. “మోహన్‌రావు మన జాగలో ఇల్లేం కట్టలేదు కదా. కట్టింది కాంపౌండు వాలే. దాన్ని కూల్చి వేయవలసిన పనిలేదు. కూలిస్తే అతనికి నష్టం కలుగుతుంది. మన జాగలో కట్టినందుకు అతడు నష్టపరిహారం ఇవ్వగలడు. కాని, దానికి కూడా నేను సమ్మతించను. కనుక, నాకొక ఉపాయం తట్టింది. మన జాగలో అతడు కాంపౌండు వాల్ కట్టినట్లే దాని పొడవునా మనం అతని జాగలో కాంపౌడు వాల్ కట్టుకుందాం. మనం కట్టిన కాంపౌండు వాల్ అతనికి వస్తుంది. అతడు కట్టిన కాంపౌండు వాల్ మనకొస్తుంది. ఎవరికీ ఇబ్బంది ఉండదు” అన్నది ప్రమీల. నేను ప్రమీల చెప్పినట్లే చేశాను. పక్కవాళ్లతో గొడవలు లేకుండా పరిష్కారం దొరికినందుకు సంతోషించాను. నా శ్రీమతిని అభినందించాను.

వ్యాసకర్త సెల్: 9885654381