7 May, 2026 | 1:28 AM

బాధ్యులు ఎవరు?

25-05-2024 12:05 AM

పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరు యువ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో  కారు గంటకు దాదాపుగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాదు ప్రమాదానికి ముందు పబ్‌లలో సంబరాలు చేసుకున్నట్లు, ఏకంగా 48 వేల రూపాయలు ఖర్చు చేసి మద్యం సేవించినట్లు కూడా తేలింది. నిజానికి మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది.

మరి 17 ఏళ్ల మైనర్‌కు పబ్‌లో మద్యం ఎలా సర్వ్ చేశారు?  ప్రమాదం జరిగిన తర్వాత కొద్ది గంటలకు అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి సహా కారులో ఉన్న వాళ్లను అదుపులోకి తీసుకున్నప్పటికీ వెంటనే వారికి రక్త పరీక్షలు చేయించలేదని కూడా తెలుస్తోంది. అన్నిటికన్నా మించి  నిందితుడికి  కొద్ది గంటల్లోనే  జువనైల్ జస్టిస్ బోర్డు వింత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంపై జనం తీవ్రంగా మండిపడుతున్నారు.

నిందితుడు డబ్బున్న వాళ్ల బిడ్డ కావడమే  బెయిలు రావడానికి కారణమా అని వారు ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాలనుంచి తీవ్ర విమర్శలు రావడంలో  నిందితుడికి బెయిలు రద్దు చేసిన కోర్టు అతడ్ని అబ్జర్వేషన్‌కు పంపాల్సిందిగా ఆదేశించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నిందితుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా గత చరిత్ర. తాజాగా ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తన కుమారు డు కాదని, డ్రైవర్ అని నిందితుడి తండ్రి  చెప్పడం  ఈ కేసును కొత్త మలు పు తిప్పింది. డ్రైవర్ కూడా తానే నడిపినట్లు చెప్పడం, కారులోని నిందితుడి స్నేహితులు కూడా దీన్ని సమర్థించడం విశేషం.

అయితే  పోలీసులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. నేరాన్ని అంగీకరించేలా నిందితుడి తల్లిదండ్రులు డ్రైవర్‌పై ఒత్తిడి తెచ్చి ఉంటారని వారు అంటున్నారు. సాధారణంగా బడా బాబుల పిల్లలు చేసే ఇలాంటి ప్రమాదాల్లో  అసలు నిందితుడిని తప్పించడానికి వేరే వారిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారని ఎన్నో ఘటనల్లో రుజువయింది. హైదరాబాద్‌లో గతంలోకూడా ఇలాగే మైనర్  యువకులు తాగిన మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రమాదాలు చేసిన ఘటనలు చాలానే జరిగాయి. అప్పుడు కూడా తమ వారిని కాపాడుకోవడానికి వేరే వాళ్లను నేరం ఒప్పుకునేలా చేయడానికి ప్రయత్నించి నట్లు వార్తలు వచ్చాయి. 

పుణె కారు ప్రమాదం ఘటన మన వ్యవస్థలోని  రెండు తీవ్రమైన లోపాలను మరోసారి ఎత్తి చూపించింది. అందులో ఒకటి డబ్బు, పలుకుబడి ఉన్న వారి విషయంలో పోలీసు వ్యవస్థ వ్యవహరించే తీరు. మరో టి ధనవంతులు  పిల్లల పెంపకం విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్యం. మొద టి విషయంలో ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాల్సిన పోలీసులు  కొన్ని గంటలపాటు ఉదాసీనంగా వ్యవహరించడం. ప్రమాదం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో జరిగితే సంబంధిత ఉన్నతాధికారికి కొన్ని గంటలదాకా తెలియలేదు. మరోవైపు నిందితుడికి పోలీసు స్టేషన్‌లో  పిజ్జాలతో రాచమర్యా దలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను పోలీసు ఉన్నతాధికారులు ఖండించినా, ఏదో జరిగి ఉండవచ్చన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఘటన వైరల్ కాకపోయి ఉంటే  కేసు ఎప్పుడో మాఫీ అయి ఉండేదన్న అభిప్రాయం ప్రజ ల్లో వ్యక్తమవుతోంది. ఇక రెండో విషయం. ధనవంతులు తమ పిల్లలు జల్సాలు చేయడానికి ఇస్తున్నంత ప్రాధాన్యత వారి భవిష్యత్తు, బాగోగులకు ఇవ్వడం లేదనేది. కోట్ల విలువైన కారు ఇచ్చి పబ్బుల్లో తాగి తందనా లు ఆడడానికి, మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు తీయడానికి అవకాశమిస్తున్న వాళ్లు ఇలాంటి వాటి వల్ల వారి భవిష్యత్తు ఎలా తయారవుతుందనే విషయం గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది.