9ఏళ్లకే ప్రవచనకర్త
ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో బాలికకు చోటు
లక్నో, జూలై 4 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడం, అందులో ప్రావీణ్యం పొందడం అంత సులువు కాదు. అలాంటి అసాధారణ మార్గంలో పయనించి అద్భుత ప్రతిభతో 9 ఏళ్ల చిన్నారి శ్వేతిమ మాధవ్ ప్రియ ప్రపంచ రికార్డు సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన శ్వేతిమ అంతర్జాతీయ భాగవత ప్రవచనకర్తగా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
2017 ఫిబ్రవరి 16న జన్మించిన శ్వేతిమ.. చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక అంశాలను ఆసక్తిగా తిలకించడం మొదలుపెట్టింది. ఆరేళ్ల వయసులోనే శ్రీమద్భాగవత కథ చెప్పడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 36 వారాల పాటు భాగవత కథా ప్రవచనాలు చెప్పడంతో పాటు, 100కు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, నైతిక విలువల సందేశాన్ని ప్రజలకు చేరవేసింది. శ్వేతిమ చెప్పే భాగవత కథలు, ఆధ్యాత్మిక ప్రవచనాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని మరీ అక్కడికి వెళ్తుంటారు. శ్వేతిమ రికార్డ్స్‌పై ఆమె తండ్రి డాక్టర్ సౌరభ్ పాండే ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె ప్రయాణానికి తాము పూర్తిగా మద్దతిస్తామని తెలిపారు. శ్వేతిమ సాధించిన విజయాన్ని సాధువులు, విద్యావేత్తలు, సామాజిక సంస్థలు విస్తృతంగా ప్రశంసించాయి. ఇది గోరక్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశానికే గర్వకారణమని అభివర్ణించారు. ఆమె సంస్కృతం, హిందీ రెండు భాషలపైనా మంచి పట్టు సాధించిందని ఆమె తండ్రి చెప్పారు.






