ముంబైని ముంచిన వర్షం
- రెడ్ అలర్ట్ జారీ
- గడిచిన 24 గంటల్లో 100 మి.మీ వర్షపాతం
ముంబై, జూలై ౪: నైరుతి రుతుపవనాల విస్తరణతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. భారత వాతావరణ శాఖ ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో గంటకు 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
పశ్చిమ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంందని, కాబట్టి మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. గడిచిన 24 గంటల్లో నగరంలో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది. బాంద్రాలో అత్యధికంగా 150.6 మి.మీ వర్షపాతం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ముంపుప్రాంతాలైన విఖ్రోలి, ఘాట్కోపర్, దాదర్ జలమయమయ్యాయి. సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అరేబియా సముద్ర తీరంలో 4.26 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. వర్షాల నేపథ్యంలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంఎంసీ) అప్రమత్తమైంది. పాఠశాలలు, కళాశాలకు మధ్యాహ్నం సెషన్ నుంచి సెలవు ప్రకటించింది. వర్షాల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు గల్లంతై మరణించారు. ముంబైలో చెట్టు కూలి బస్సుపై పడటంతోనే విద్యార్థి మరణించాడు.
మరో ఇద్దరు వరదలో గల్లంతై మృతిచెందారు. పుణెలో వర్షపు నీటితో నిండిన గుంతలో పడి రెండేళ్ల చిన్నారి చనిపోయాడు. థానేలో విద్యుత్ వైర్లు తగిలి, విద్యుత్‌షాక్‌తో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. నవీ ముంబైలో వరద నీటిలో నడుస్తూ విద్యుత్ షాక్‌కు గురైన ఇద్దరు విద్యార్థులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మహారాష్ట్రతోపాటు మధ్యప్రదేశ్, గుజరాత్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పొంగిన వాగులు, నదుల కారణంగా ఆయా రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.






