5 August, 2026 | 1:53 AM

ఆత్మనిర్భర్ భారత్‌లో ముందడుగు

05-08-2026 12:26 AM
  1. టర్బోజెట్ ఇంజిన్ దశాబ్ద కృషికి ఫలితం
  2. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం పటాపంచలు
  3. రహ్మత్ పాషా ధైర్యసాహసాలు భేష్
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  5. బీఆర్‌ఎస్‌లోకి ఇల్లంతకుంట నాయకుల చేరికలు

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఆత్మనిర్భర్ భారత్‌లో కీలక ముందడుగు పడిందని, తొలి స్వదేశీ 350 కేజీ థ్రస్ట్-క్లాస్ టర్బోజెట్ ఇంజిన్ డెలివరీ పూర్తి కావడం గత దశాబ్ద కాలపు కృషికి ఫలితమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు దక్కిన మరో అరుదైన గౌరవంగా పేర్కొన్నారు. ఆజాద్ ఇంజనీరింగ్, డీఆర్‌డీవో సంయుక్త విజయంపై కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం మరోసారి పటాపంచలైందని స్పష్టం చేశారు. రివర్స్ పంపింగ్ ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందని పేర్కొన్నారు. రైతన్నలకు నిజనిజాలేమిటో తెలుసన్నారు.

ఆస్ట్రేలియాలోని బోండీ ప్రాంతంలో విషాద ఘటన సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి దాదాపు 20 మంది ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్‌కు చెందిన రహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా కల్పించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐకి చెందిన నాయకులు రహ్మత్ పాషాను అభినందించారు.

మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు నందినగర్ నివాసంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. చేరిన వారిలో సిరిసేడు సర్పంచ్ కుమార్ -శ్యామల, వంతడువుల సర్పంచ్ రాజేష్ -మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్‌లు ఉన్నారు.