23-02-2026 12:26:38 AM
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దేశీరామ్
మహబూబాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్య సంస్థల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి నాణ్యమైన, నూతన టెక్నాలజీతో కూడిన విద్యను అందించాలనే ఉన్నత ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దేశీరామ్ అన్నారు.
విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ తరగతులు ద్వారా ప్రతి సంక్షేమ వసతి గృహాలు పాఠశాలలలో స్పెషల్ డైట్ మెనూ ప్రకారం ఉదయం బూస్ట్, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, షెడ్యూలు ప్రకారం పౌష్టిక ఆహారం మటన్, చికెన్, గుడ్లు, స్నాక్స్ అరటి పండ్లు, అందిస్తూ విద్యార్థిని, విద్యార్థులకు ఆరోగ్యం, విద్య పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదన్నారు.
ఆదివారం మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలోనీ గిరిజన ఆశ్రమ (బాలురు) పాఠశాలలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోత్ దేశీ రామ్ నాయక్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకొని వారితో డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు పక్కా ప్రణాళికతో జిల్లాలోని 19 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఆరు వసతి గృహాలు, తొమ్మిది పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 104 గిరిజన ప్రైమరీ స్కూల్స్ లో పదవ తరగతి చదువుతున్న 881 విద్యార్థులు, మొత్తం 7,044 విద్యార్థినీ, విద్యార్థులు ఉండగా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా,మానసికంగా దృఢంగా ఉండే విధంగా తరగతులు నిర్వహిస్తూ నిత్యం గమనించడం జరుగుతుందని, షెడ్యూలు ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయుల ద్వారా అత్యుత్తమ విద్య బోధనలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి నాలుగు హాస్టళ్లకు కలిపి ఒక ప్రత్యేక అధికారి, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, పిఎమ్‌ఆర్సిలు, ఏసీఎంఓలు, జిసిడిఓ, స్పోరట్స్ అధికారి ఎస్సీఆర్పిలను నియమించి 100 శాతం ఫలితాలు వచ్చే విధంగా ప్రత్యేక తరగతులు, ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేస్తూ పిల్లలకు ఎలాంటి మానసిక ఒత్తిడి లు లేకుండా హ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించడం జరుగుతుందన్నారు.