అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక!
నేడు సర్వాయి పాపన్న జయంతి :
ప్రొ.సంగని మల్లేశ్వర్ :
తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు ఒక సాధారణ వీరగాథ కాదు. అధికార కేంద్రీకరణ, సామాజిక అసమానతలు, స్థానిక దోపిడీ శక్తుల ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో అణగారిన వర్గాల నుంచి ఎదిగిన నాయకత్వానికి ఆయన ఒక ప్రతీక. అందుకే పాపన్నను కేవలం ఒక యోధుడిగా కాకుండా సామాజిక ఆత్మగౌరవం, సమానత్వ ఆకాంక్షలకు ప్రతినిధిగా చూడాలి. 17వ శతాబ్దం చివరి దశలో తెలంగాణ రాజకీయ పరిస్థితులు తీవ్ర మార్పులకు లోనయ్యాయి.
గోల్కొండ పతనం తర్వాత మొఘలుల పాలన దక్కన్‌లో విస్తరించింది. ఈ నేపథ్యంలో స్థానిక అధికార వ్యవస్థలు, జమీందారీ-భూస్వామ్య సంబంధాలు, పన్నుల భారం సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయి. ఈ సామాజిక నేపథ్యమే పాపన్న ఎదుగుదలకు పునాది వేసింది. తెలంగాణ చరిత్ర పాఠ్యాంశాల్లో కూడా పాపన్నను మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా, పేదలు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తిగా గుర్తించారు.
సర్వాయి పాపన్న గౌడ్ జన్మస్థలంగా జనగామ ప్రాంతంలోని చ్‌పాంతంలోని చారిత్రక సంప్రదాయం గుర్తిస్తుంది. కల్లుగీత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రాజవంశీయ నేపథ్యం లేదు. ఇదే ఆయన చరిత్రలోని ప్రత్యేకత. సామాజికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తి తన చుట్టూ వివిధ వర్గాల ప్రజలను సమీకరించి రాజకీయ -సైనిక శక్తిగా ఎదగడం ఆనాటి సామాజిక వ్యవస్థకు ఒక సవాలుగా నిలిచింది.
ఆసియా ఖండంలోనే మొదటి బహుజన చక్రవర్తి, గోల్కొండతో పాటు 33 కోటలను ఏలిన రాజు సర్వాయి పాపన్నగౌడ్ కేవలం మొఘల్ వ్యతిరేక యుద్ధంగా పరిమితం చేయడం సరైంది కాదు. ఆయన పోరాటానికి సామాజిక కోణం కూడా ఉంది. అణగారిన వర్గాలకు నాయకత్వం కల్పించడం, స్థానిక దోపిడీ వ్యవస్థలను ఎదుర్కోవడం, స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నించడం ఆయన ఉద్యమానికి ప్రత్యేక స్వరూపాన్ని ఇచ్చాయి.
ఆయన అనుచరుల్లో వివిధ సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పాపన్న తన ప్రభావాన్ని కేవలం యుద్ధరంగానికే పరిమితం చేయలేదు. ఖియలేదు కేంద్రంగా చేసుకుని కోటలను నిర్మించారు. సర్వాయిపేట, తాటికొండ, వేములకొండ, షాపూర్ వంటి ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని విస్తరించారు. భువనగిరి, కొలనుపాక, చేర్యాల, హుజురాబాద్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఆయన ప్రభావం ఉన్నట్లు తెలంగాణ చరిత్ర పాఠాలు చెబుతున్నాయి.
తాటికొండ ప్రాంతంలోని చెక్‌డ్యామ్ ఆయన పాలనలో ప్రజా అవసరాలపై దృష్టి ఉన్నదనే చారిత్రక గుర్తుగా నిలిచి ఉన్నది. మొఘల్ అధికారానికి పాపన్న ఎదుగుదల సవాలుగా మారింది. ఆయనను అణచివేయడానికి మొఘలులు సైనిక చర్యలు చేపట్టారు. రుస్తుం దిల్ ఖాన్‌తో జరిగిన పోరాటం సుదీర్ఘంగా సాగిందని తెలంగాణ చరిత్ర పాఠ్యాంశం సజీవ సాక్ష్యంగా నిలిచింది.
‘సర్వాయి పాపన్న’ ఛత్రపతి శివాజీకి సమకాలీకులు. శివాజీ ముస్లిం పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాటం చేశాడో, పాపన్న తెలంగాణలో ముస్లిం పాలన అంతానికి పోరాడారు. 1707లో ఔరంగజేబు మరణం తరువాత దక్కన్‌లో మొఘల్ పరిపాలన బలహీనపడిన పరిస్థితిని పాపన్న వినియోగించుకున్నారు. 1708 ఏప్రిల్ 1న వరంగల్‌పై దాడి చేశారు. అనంతరం జరిగిన పోరాటాల్లో ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడి, చివరకు 1712లో పట్టుబడి మరణించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.
పాపన్న చరిత్రలో అత్యంత ముఖ్యమైన అంశం ఆయన సామాజిక సందేశం. అధికారాన్ని కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించిన వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సామాన్యుల నుంచి నాయకత్వం రావచ్చని ఆయన జీవితం సూచిస్తుంది. అందుకే ఆయనను బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా సమకాలీన తెలంగాణలో పునఃస్మరించుకుంటారు. అయితే చరిత్రను జానపద గాథలతో, ఆధారపూర్వక చరిత్రతో కలపకుండా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.
పాపన్న గురించి అనేక వీరగాథలు ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటి సాంస్కృతిక విలువను గౌరవిస్తూనే, తేదీలు, యుద్ధాలు, పాలనా పరిధి వంటి అంశాలను అందుబాటులో ఉన్న శాసన, పురావస్తు, పాఠ్య, ఇతర చారిత్రక ఆధారాలతో పరిశీలించాలి.
నేడు పాపన్న స్మరణకు లభిస్తున్న ప్రభుత్వ గుర్తింపు కూడా ఆయన చరిత్రకు కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నది. లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో 1750 మధ్య గీసినదిగా భావించే సర్వాయి పాపన్న రూపాన్ని భద్రపరిచారంటే సామాజిక విప్లవకారుడి చరిత్ర ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
2025లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన 375వ జయంతిని అధికారికంగా నిర్వహించింది. అంతేకాదు, నగరం నడిబొడ్డున రాష్ట్ర సచివాలయం ఎదురుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి స్థలం కేటాయించి భూమి పూజ చేసింది. పాపన్నను స్మరించుకోవడం అంటే గతాన్ని మాత్రమే గౌరవించడం కాదు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, అవకాశాల సమానత్వం, అణగారిన వర్గాలకు విద్య, రాజకీయ ప్రాతినిధ్యం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లడం కూడా.
పుట్టుక మనిషి స్థాయిని నిర్ణయించదు; పోరాటం, నాయకత్వం, ప్రజల పట్ల బాధ్యత చరిత్రలో అతని స్థానాన్ని నిర్ణయిస్తాయన్నది ఆయన జీవితం చెప్పే ప్రధాన సందేశం. అందుకే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ఒక వీరుడిగానే కాదు, అణగారిన ప్రజల ఆత్మగౌరవ స్వరంగా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ నెల 18న 376 జయంతి సందర్భంగా సరిగ్గా ఏడాది తిరగకముందే సామాజిక ఉద్యమకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సిద్ధం కావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి బహుజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
స్నేహితులనే సైన్యంగా చేసుకొని ఢిల్లీ సింహాసనాన్ని వణికించిన బెబ్బులి పాపన్న స్ఫూర్తితో 42 శాతం రిజర్వేషన్లు అమలుకు 60 శాతం ఉన్న బహుజనులు పోరాటానికి సిద్ధం కావల్సిన ఆవశ్యకత ఉంది. నాడు ఆరిజోనా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్‌లో చరిత్ర విభాగం ప్రొఫెసర్ రిచర్డ్ ఎం యాటన్ రాసిన ‘ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్’, ‘ఐయిట్ ఇండియన్ లైవ్స్’ పుస్తకాన్ని సర్వాయి పాపన్న కవర్ పేజీ ఫొటోతో కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రచురించిందంటే, తెలంగాణ కీర్తి నలుచెరుగుల చాటిన బహుజన చక్రవర్తి పాపన్నకే దక్కుతుందనేది నిర్వివాదాంశం.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ
విభాగాధిపతి, 9866255355






