అమ్మ అనంత యాత్ర
18-08-2026 12:00 AM
అమ్మ ఏమి చేస్తోందో తెలుపు గరుడ పురాణమా!
అమ్మ ఎట్లు సాగుతోందో తెలుపు గరుడ పురాణమా!
నే నెరుగని నదులన్నీ అమ్మదాట వలెనంటివి
నావ ఏది వస్తోందో, తెలుపు గరుడ పురాణమా
మైళ్లల్లో లెక్కపెట్టు దారి కాదు అమ్మదిపుడు
గొడుగు ఏది కాస్తోందో తెలుపు గరుడ పురాణమా
దాహానికి తట్టుకోని శిథిల శరీరం అమ్మది
ఏ నీరును తాగుతోందో, తెలుపు గరుడ పురాణమా
అలసిపోతే కునుకు తీయు అమ్మ ఎంత శాంతమో
ఎటుల నిదుర పోతోందో, తెలుపు గరుడ పురాణమా
నడవలేదు అమ్మ ఊత మేమీ లేకుంటే
సాయ మేది ఇస్తోందో, తెలుపు గరుడ పురాణమా
పలు రుచులను పంపుతున్న, ఇహం నుండి పరానికి
అమ్మ ఏమి తింటోందో, తెలుపు గరుడ పురాణమా
శ్రీనివాస్ గానమే- అమ్మకు వైకుంఠ వాహనం
అమ్మ ఏమి వింటోందో, తెలుపు గరుడ పురాణమా
-డా.గజల్ శ్రీనివాస్






