యువత వికాసమే దేశ భవిష్యత్తు
టి.చిరంజీవులు :
‘ఒక సంవత్సరం ఫలితం కావాలంటే ధాన్యంలో పెట్టుబడి పెట్టండి. పది సంవత్సరాల ఫలితం కావాలంటే చెట్లలో పెట్టుబడి పెట్టండి. వంద సంవత్సరాల ఫలితం కావాలంటే ప్రజల్లో---, ముఖ్యంగా యువత విద్య, నైపుణ్యాలు, మానవ వనరుల అభివృద్ధిలో ---పెట్టుబడి పెట్టండి’- చైనీస్ సామెత ఇది. భారత్ ఒక యువదేశం. ప్రపంచం నేడు వృద్ధుల కాలనీగా మారుతుంటే భారతదేశం యువ రక్తంతో ఉరకలు వేస్తున్నది.
యువతే దేశ భవిష్యత్తు అని పాలకులు తరచూ చెబుతారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని గర్వంగా ప్రకటిస్తారు. కానీ, ఈ అభివృద్ధి మధ్యలో ఒక తీవ్రమైన ప్రశ్న మన ముందుంది---. అదేమిటంటే, దేశ యువత భవిష్యత్తు ఎంత భద్రంగా ఉంది? వారికి ఉద్యోగం ఎక్కడ? స్థిరమైన ఆదాయం ఎక్కడ? గౌరవప్రదమైన ఉపాధి ఎక్కడ?
భారతదేశంలో 21---45 సంవత్సరాల ఉద్యోగం చేయగల వయ స్సు వారు 2026 జనాభా అంచనాల ప్రకా రం సుమారు 58.75 కోట్ల మంది, తెలంగాణలో సుమారు 1.62 కోట్ల మంది ఉన్నా రు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాల్సిన అత్యంత కీలకమైన వయస్సు వర్గం మన ముందుంది.
ఇంత పెద్ద మానవ వనరును సరైన విద్య, నైపుణ్యం, ఉద్యోగం, ఆదాయంతో వినియోగించగలిగితే, అది భారతదేశానికి అపారమైన జనాభా లాభం (డెమోగ్రాఫిక్ డివిడెండ్) అవుతుంది. కానీ, అదే యువతకు ఉపాధి లేకుండా, భవిష్యత్తుపై నమ్మకం లేకుండా చేస్తే, ఈ జనాభా విపత్తు (డెమోగ్రాఫిక్ డిజాస్టర్) ఒక పెద్ద సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు పాలకులు ఒక విషయాన్ని గుర్తించాలి: యువత ఆటవస్తువు కాదు---, ఒక ఆటంబాంబ్.
యువతలో పెరుగుతున్న ఆందోళన
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు కూడా నింపలేదు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు. ఇది ఒక్క ప్రభుత్వానికే పరిమితమైన సమస్య కాదు. గత ప్రభుత్వాలు కూడా నిరుద్యోగుల ఆశలను హామీలతో పెంచి, వాటి అమలులో విఫలమయ్యాయి. ఫలితంగా ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న యువతలో ప్రభుత్వాలపై నమ్మకం క్రమంగా తగ్గుతోంది.
దేశంలోని యువతలో నిరాశ, అసంతృప్తి, ఆందోళన పెరుగుతున్నాయి. చదువుకున్నారు. డిగ్రీలు పొందారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినా పరీక్ష ఆలస్యం, పరీక్ష జరిగితే ఫలితాల ఆలస్యం, ఫలితాలు వచ్చినా నియామకాల ఆలస్యం--- ఇలా యువత జీవితంలోని విలువైన సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షలలో అవకతవకలు, నియామక ప్రక్రియలో జాప్యం వంటి ఘటనలు యువతలో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది కేవలం ఉద్యోగం కోసం జరుగుతున్న పోరాటం కాదు. ఇది భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం.
జెన్ జీ సహా నేటి యువత సమాచారా న్ని క్షణాల్లో పొందుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమిటో, వాస్తవంగా ఏం జరిగిందో వెంటనే పోల్చి చూస్తోంది. కాబట్టి కేవలం ఎన్నికల హామీలు, ప్రసంగాలు, ప్రకటనలతో యువతను ఎక్కువకాలం మభ్యపెట్టడం సాధ్యం కాదు.
అభివృద్ధికి అతిపెద్ద సవాలు
భారతదేశ జీడీపీ పెరుగుతోంది. పెట్టుబడులు పెరుగుతున్నాయి. సాంకేతిక రంగం విస్తరిస్తోంది. కానీ జీడీపీ పెరగడం, ఉద్యోగాలు పెరగడం ఒకటే కాదు. ఆవర్తన శ్రామిక శక్తి సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్- పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే)- ---దేశంలోని ఉపాధి, నిరుద్యో గం, శ్రామిక శక్తి భాగస్వామ్య రేట్, శ్రామిక జనాభా నిష్పత్తి వంటి కీలక సూచికలను కొలిచే అధికారిక వ్యవస్థ. దీన్నిజాతీయ గణాంకాల శాఖ నిర్వహిస్తుంది.
2025 పీఎల్‌ఎఫ్‌ఎస్ ప్రకారం 15-29 సంవత్సరాల యువత నిరుద్యోగిత దేశవ్యాప్తంగా 9.9 శాతంగా ఉంది. తెలంగాణలో అదే వయస్సు వర్గంలో నిరుద్యోగిత 18.1 శాతంగా నమోదైంది. భారతదేశంలో అత్యంత నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలలో 3వ స్థానం. నిరుద్యోగాన్ని కేవలం సంక్షేమ సమస్యగా చూడటం తప్పు. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి.
--ఉపాధి కోసం గల్ఫ్ బాట
తెలంగాణలో స్థానికంగా తగిన ఉపాధి అవకాశాలు లభించకపోవడం, తక్కువ వేతనాలు, నైపుణ్యాల కొరత వంటి కారణాలతో అనేక మంది యువత విదేశీ ఉపాధి వైపు చూస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తెలంగాణలోని అనేక కుటుంబాలకు ఉపాధి గమ్యస్థానాలుగా మారాయి. సుమారు 16 లక్షల మంది గల్ఫ్‌లో పని చేస్తున్నారు. తెలంగాణ నుంచి జీసీసీ దేశాలకు వెళ్లిన రిటర్నీ మైగ్రేంట్స్‌పై ఐవోఎం-సీఈఎస్‌ఎస్ అధ్యయనంలో కూడా గల్ఫ్‌కు వెళ్లే సమయంలో చాలామంది నైపుణ్యం లేని లేదా సెమీ స్కిల్డ్ పనుల్లోకి వెళ్లినట్లు, 76% మంది వలసకు ముందు ఎలాంటి నైపుణ్యాలు పొందలేదని నివేదించింది.
విదేశాలకు వెళ్లడం తప్పు కాదు. కానీ, స్వదేశంలో తగిన ఉద్యోగం దొరకక గల్ఫ్‌కు వెళ్లడం ఒక వేరే సామాజిక వాస్తవం. ముఖ్యంగా నైపుణ్యం లేని లేదా పాక్షిక నైపుణ్యం కారణంగా యువత విదేశాల్లో తక్కువ వేతనం, కఠినమైన పని పరిస్థితులు ఉన్న ఉద్యోగాల్లోకి వెళ్లే పరిస్థితి ఉంది.
అంటే మన దేశం, మన రాష్ట్రం తన మానవ వనరులకు తగిన నైపుణ్యం ఇవ్వలేకపోతే, అదే మానవ వనరు విదేశీ శ్రామిక మార్కెట్‌లో తక్కువ విలువకు అమ్ముడవుతుంది. ఇక్కడ ‘మన యువత గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారు?’ అన్నది మాత్రమే ప్రశ్న కాదు. ‘మన యువతకు తెలంగాణలోనే మంచి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం?’ అనేదే అసలు ప్రశ్న.
నైపుణ్యాభివృద్ధి ఇక తప్పనిసరి
నేటి ఉద్యోగ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పు డు డిగ్రీలతో పాటు మార్కెటింగ్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, రోబోటిక్స్, డిజిటల్ టెక్నాలజీ, డాటా అనలిటిక్స్ వంటి మార్పులు ఉద్యోగాల స్వభావాన్ని వేగంగా మార్చుతున్నాయి. ప్రపంచం కుగ్రామమైన నేపథ్యంలో విదేశీ శ్రమ మార్కెట్ డిమాండ్‌కు అనుకూలంగా శిక్షణలు రూపొందించి, ఇప్పించి, పంపించాలి.
విద్యా, నైపుణ్యాలు, శిక్షణ, ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్, జీతం- ఈ పూర్తి గొలుసు ఏర్పడాలి. గ్రామీణ యువతకు ఎలక్ట్రికల్, ప్లంబింగ్, భవన నిర్మాణ సాంకేతికత, ఆరోగ్య రక్షణ, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ టెక్నాలజీ, సౌర శక్తి వంటి నైపుణ్యాలు అవసరం. పట్టణ యువతకు ఏఐ, కోడింగ్, డేటా ఎనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, అకౌంటింగ్, డిజైన్ వంటి నైపుణ్యాలు అవసరం.
ప్రతి యువకుడికి కనీసం ఒక ఉద్యోగ నైపుణ్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉం డాలి. శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకోవద్దు. ప్రభుత్వం ‘లక్షల మందికి నైపుణ్యాల శిక్షణ ఇచ్చాం’ అని చెప్పడం సులభం. కానీ, అసలు ప్రశ్న: ‘వారిలో ఎంతమందికి ఉద్యోగం వచ్చింది? ఎంత జీతం వస్తోంది?’ అనేది ముఖ్యం. అందుకే ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శిక్షణ, ఉద్యోగ కల్పన, తగిన వేతనం వంటి ప్రాతిపదికలపై పనితీరును అంచనా వేసే విధానం ఉండాలి.
హామీలు కాదు, ---అమలు కావాలి
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘నీళ్లు---నిధులు-- -నియామకాలు’ అనే నినాదం యువతలో గొప్ప నమ్మకాన్ని కలిగించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొంత రాష్ట్రంలో తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని యువత ఆశించింది. కానీ, నియామకాలలో జాప్యాలు, నోటిఫికేషన్ల ఆలస్యం, పరీక్షల సమస్యలు, ఫలితాల్లో అవకతవకలు యువతలో నిరాశను పెంచాయి.
ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఖాళీల భర్తీ వంటి అనేక హామీలు ఇస్తున్నారు. కానీ, యువత ఇప్పుడు అడుగుతోంది: ‘హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’ అని. ప్రభుత్వ ఉద్యోగం ఎన్నికల హామీగా మిగిలిపోవద్దు. అది ప్రజా విధానంలో శాశ్వత భాగం కావాలి.
ఏటా ఉద్యోగాల భర్తీ చేపట్టాలి
ప్రభుత్వ శాఖలో ఖాళీ ఏర్పడిన తర్వాత సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంచడం అన్యాయం. ప్రతి శాఖలో 1.మంజూరైన ఉద్యోగాలు 2.నింపిన ఉద్యోగాలు పోస్టులు 3.ఖాళీ పోస్టులు 4.రిజర్వేషన్ రోస్టర్/ ప్రాతినిధ్య పట్టిక 5.నియామక తేదీ/ భర్తీ ప్రక్రియ తేదీ- తదితర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తి క్యాలెండర్‌ను ప్రకటించాలి. ఉద్యోగ ఖాళీని గుర్తించిన నాటి నుంచి నోటిఫికేషన్, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ఉద్యోగ నియామకం పూర్తి కావడానికి 6 నుంచి 12 నెలల కాలపరిమితిని నిర్దేశించాలి. యువత ఉపాధి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
యూత్ కోసం ఓ ప్రత్యేక శాఖ
ఇంత పెద్ద సమస్యకు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉపాధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ప్రత్యేక సమన్వయ వ్యవస్థ అవసరం. కార్మిక, ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) బాధ్యతలు ప్రస్తుతం వేర్వేరు శాఖలలో విస్తరించి ఉన్నాయి. అయితే, యువత లేవనెత్తే ఏకైక ప్రశ్న ‘నాకు ఉపాధి ఎక్కడ?’.
ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ‘మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎంప్లాయ్‌మెంట్’ లేదా శక్తివంతమైన ‘నేషనల్ యూత్ ఎంప్లాయ్‌మెంట్ మిషన్’ను, రాష్ట్ర స్థాయిలో ‘స్టేట్ యూత్ ఎంప్లాయ్‌మెంట్ మిషన్’ను నెలకొల్పాలి. వీటి కార్యసాధకతను కేవలం శిక్షణా సంఖ్య ఆధారంగా కాకుండా, కొత్త ఉద్యోగాల సృష్టి, శాశ్వత ఉపాధి కల్పన, వేతన స్థాయిలు, మహిళా భాగస్వామ్యం, నూతన పారిశ్రామికవేత్తల ఆవిర్భావం వంటి ప్రామాణిక సూచీల (మెట్రిక్స్) ఆధారంగా మదింపు చేయాలి.
నిరుద్యోగ సమస్యకు పరిష్కారం
మొదటిగా, మారుతున్న వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా నూతన ఉద్యోగ నియామకాల ప్రాధాన్యతను పునర్నిర్వచించాల్సి ఉంది. ఉదాహరణకు, తెలంగాణలో ఆహార కల్తీ నిరోధక వ్యవస్థలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. మంజూరైన ఉద్యోగాల సంఖ్య ప్రస్తుత అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు.
కాబట్టి, మారుతున్న సామాజిక- -ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ రంగాలలో అవసరమైన కొత్త పోస్టుల సంఖ్యపై ప్రభుత్వాలు సమగ్ర అధ్యయనం, మానవవనరుల అంచనా చేపట్టాలి. రెండవది, ప్రభుత్వ ఖాళీలను కాలపరిమితితో భర్తీ చేయాలి. మూడవది ఎక్కువ మంది కార్మికులు అవసరమయ్యే తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలి. ఎంఎస్‌ఎంఈలకు సులభమైన రుణాలు, టెక్నాలజీ, మార్కెట్ యాక్సెస్ కల్పించాలి.
చైనాలాగా ప్రపంచ తయారీదారుల కేంద్రంగా మారాలి. నాలుగవది, ప్రతి జిల్లాకు ఉద్యోగ నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి. ఐదవది, పరిశ్రమలకు ఇచ్చే ప్రభుత్వ రాయితీలను ఎన్ని స్థానిక ఉద్యోగాలు సృష్టించారనే ప్రమాణంతో అనుసంధానం చేయాలి. ఆరవది, నైపుణ్యాల అభివృద్ధి, ప్లేసెమెంట్‌తో అనుసంధానం చేయాలి. ఏడవది, యువతలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి.
ఎనిమిదవది, గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ప్రాసెసింగ్, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయ సాంకేతికత వంటి రంగాల్లో ఉపాధి కల్పించాలి. తొమ్మిదవది, పాఠశాల, కళాశాల స్థాయి నుంచే వృత్తి మార్గదర్శనం అందించాలి. పదవది, కృత్రిమ మేదస్సు ఆటోమేషన్‌తో మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు యువతను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి.
బీసీ యువతపై ప్రత్యేక దృష్టి
బీసీలంటే ఒకవైపు కుల వివక్షత, మరోవైపు పేదరికం ఎదుర్కొనే కులాలు. నిరుద్యోగ సమస్యను సామాజిక న్యాయం నుంచి వేరు చేయలేం. బీసీ యువతకు నాణ్యమైన విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మూలధనం, సాంకేతికత మార్కెట్ అవసరం.
కుల జనగణన జరిగితే జనాభా లెక్కలతో పాటు విద్య, ఉద్యోగం, ఆదాయం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి అంశాలపై కూడా సమగ్ర డేటా సేకరించాలి. జనాభా లో వాటా ఎంత? అవకాశాల్లో వాటా ఎంత? అనే ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడే సామాజిక న్యాయ విధానం మరింత శాస్త్రీయంగా రూపొందించవచ్చు.
నిర్మాణాత్మక శక్తిగా మార్చాలి
యువతను తప్పుపట్టడం సులభం. ‘నైపుణ్యాలు లేవు’, ‘ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం లేదు’, ‘ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్నారు’ అని చెప్పడం కూడా సులభం. కానీ, ప్రభుత్వం తన బాధ్యతను కూడా గుర్తించాలి. యువతకు విద్య ఇవ్వాలి, నైపుణ్యాలు ఇవ్వాలి. మూలధనం ఇవ్వాలి. మార్కెట్ ఇవ్వాలి. ఉద్యోగాలు సృష్టించాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయం చేయాలి. భారతదేశంలో 21---45 సంవత్సరాల వయస్సులో సుమారు 58.75 కోట్ల మంది, తెలంగాణలో సుమారు 1.62 కోట్ల మంది ఉన్నారు.
ఇది ఒక అపారమైన మాన వ వనరు. సరైన విద్య, నైపుణ్యం, ఉపాధి, ఆదాయం కల్పిస్తే ఇదే శక్తి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా నిలబెట్టగలదు. కానీ, యువతకు పదేపదే హామీలు ఇచ్చి, ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసేలా చేసి, నైపుణ్యం లేకుం డా గల్ఫ్ దేశాలకు వెళ్లే పరిస్థితి కల్పించి, వారి భవిష్యత్తుతో రాజకీయ ఆటలు ఆడితే ఆ ఆశ ఆవేదనగా మారుతుంది.
పాలకులకు చిత్తశుద్ధి ఉందా?
దేశంలో కోట్లాది మంది యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, పాలకుల ప్రాధాన్యతల్లో యువత ఉపాధి సమస్యకు తగిన స్థానం కనిపించడం లేదు. పెద్ద ప్రాజెక్టులు, పెట్టుబడులు, కమిషన్లు, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించే ప్రభుత్వాలు--- యువతకు స్థిరమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా ఎందుకు ఆలోచించకూడదు? యువత ఉపాధి సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రత్యేక యువజన ఉపాధి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి, ఉద్యోగ సృష్టి, నైపుణ్యాభివృద్ధి, ప్రైవేట్ రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి, స్టార్టప్‌లు వంటి అంశాలకు ఒక సమగ్ర విధానం రూపొందించాలి.
ప్రభుత్వాలు స్పందించకపోతే యువత నిరాశకు లోనుకాకుండా శాంతియుత, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య మార్గాల్లో తమ నిరసనను వ్యక్తం చేయాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలపై ప్రజాస్వామ్య ఒత్తిడి తీసుకురావాలి. యువత సమస్య పరిష్కారం కోసం యువతే గొంతెత్తాలి. ఉద్యోగం దానం కాదు, ---యువత హక్కు. యువత భవిష్యత్తే దేశ భవిష్యత్తు. తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం స్వాగతించదగిన నిర్ణయం.
అయితే అది కేవలం కాగితాలపై ఉన్న సంస్థగా మిగిలిపోకుండా, తగినన్ని నిధులు కేటాయించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణ అందించి, శిక్షణ పొందిన ప్రతి యువకుడికి ఉపాధి లేదా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. యువతకు నైపుణ్యం, ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, గౌరవప్రదమైన జీవితం లభించినప్పుడే ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు నిజమైన సార్థకతను పొందుతుంది.
యువతను మభ్యపెట్టవద్దు. యువతతో రాజకీయ ఆటలు ఆడవద్దు. హామీలు మాత్రమే ఇవ్వవద్దు---. ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకంటే, యువత ఆటవస్తువు కాదు; ఆటంబాంబ్. దాన్ని అణచివేయాల్సిన శక్తిగా చూడకండి. అవకాశం ఇచ్చి దేశాన్ని నిర్మించే శక్తిగా చూడండి. యువతకు ఉపాధి లేకుండా భారతదేశం అభివృద్ధి చెందదు. తెలంగాణ యువతకు ఉద్యోగం లేకుండా తెలంగాణ అభివృద్ధి సంపూర్ణం కాదు. బీసీ యువతకు సమాన అవకాశాలు లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు. యువత భవిష్యత్తును కాపాడటమే--- భారతదేశ భవిష్యత్తును కాపాడటం.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్






