స్వరాజ్య కాంక్షకు ప్రతీక
నేడు తిలక్ జయంతి :
భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయులలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఒకరు. భారతీయులలో జాతీయ చైతన్యాన్ని రగిలించి, స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మలిచిన గొప్ప నాయకుడాయన. ‘స్వరాజ్యం నా జన్మహక్కు; దానిని నేను సాధించుకొని తీరుతాను’ అనే ఆయన నినాదం స్వాతంత్య్ర ఉద్యమానికి దిశానిర్దేశం చేసింది. 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించిన తిలక్ గణితశాస్త్రం, న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు.
డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపనలో కీలకపాత్ర పోషించిన ఆయన, యువతలో జాతీయ భావజాలాన్ని పెంపొందించడానికి ఎంతగానో కృషిచేశారు. పాత్రికేయుడిగా ‘కేసరి’ (మరాఠీ), ‘ది మరాఠా’ (ఆంగ్లం) పత్రికలను స్థాపించి బ్రిటిష్ పాలకుల అన్యాయాలను నిర్భయంగా ఎండగట్టారు. లోకమాన్య తిలక్ చేసిన అత్యంత విశిష్టమైన సేవలలో ఒకటి గణేష్ ఉత్సవాలను ప్రజా ఉద్యమంగా మార్చడం. ఆ కాలంలో బ్రిటిష్ ప్రభు త్వం ప్రజలు రాజకీయ సమావేశాలు నిర్వహించకుండా కఠిన ఆంక్షలు విధించింది.
అయితే మతపరమైన కార్యక్రమాలపై అంతగా ఆంక్షలు లేకపోవడంతో తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రజల ఐక్యతకు, జాతీయ చైతన్యానికి వేదికగా ఉపయోగించా రు. అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను కూడా ప్రజాస్థాయిలో నిర్వహించి యువతలో ధైర్యం, దేశభక్తి, స్వాభిమానాన్ని పెంపొందించారు.
1920 ఆగస్టు 1న లోకమాన్య తిలక్ మరణించినప్పటికీ, ఆయన ఆశయాలు భారత జాతికి చిరస్థాయిగా మార్గదర్శకంగా నిలిచాయి. ప్రతి భారతీయుడు లోక మాన్య బాల గంగాధర్ తిలక్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి తన వంతు బాధ్యతను నిర్వర్తిం చినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినవారమవుతాం.
ఆళవందార్ వేణుమాధవ్
వ్యాసకర్త సెల్: 8686051752






