పోరుబాటలో విపక్షం
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో అధికారపక్షం కంటే ప్రతిపక్ష పాత్ర ఎంతో కీలకమైనది. పాలన గాడితప్పినప్పుడు, ప్రభుత్వం అప్రజాస్వామికమైన విధానాలను అవలంబించినప్పుడు, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు పాలకులను నిలదీయడం, ప్రజల తరఫున గళం వినిపించడం ప్రతిపక్షాల ప్రాథమిక బాధ్యత. అయితే, మన దేశంలో గత దశాబ్ద కాలంగా ప్రజల సమస్యలపై వీధి పోరాటాలు కనుమరుగైపోయాయనే చెప్పాలి.
ఇలాంటి తరుణంలోనే లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై యువత క్షేత్రస్థాయి పోరాటాలకు దిగడం గమనార్హం. ప్రజా సమస్యలకు ఉద్యమరూపమిస్తే ప్రభుత్వం దిగిరాక తప్పదనే వాస్తవాన్ని ఆలస్యంగానైనా గ్రహించిన ప్రతిపక్షం ఈ పోరాటాన్ని అందిపుచ్చుకోవడం ముదావహం. ప్రధానమంత్రి ఇంటి ఎదుట ప్రతిపక్షం నిరసనకు దిగడంతో ఈ ఉద్యమానికి పాలకులు కూడా స్పందించక తప్పని అనివార్యత ఏర్పడింది.
ప్రధాన ప్రతిపక్షం సహా ఇండియా కూటమిలోని పలు పక్షాల నేతలు ప్రధాని ఇంటిముందు బైఠాయించడంతో ఇద్దరు కేంద్రమంత్రులు హుటాహుటిన చర్చలకు రావాల్సి వచ్చింది. స్వచ్ఛందంగా కాకుండా ఇటు విపక్షం, అటు ప్రజల ఒత్తిడితో కేంద్రం నుంచి వచ్చిన ఈ స్పందన ప్రజాపోరాటాల శక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఈ ఉద్యమాన్ని మొదట యువత ప్రారంభించినప్పటికీ, కార్యక్షేత్రంలోకి దిగి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడంలో విపక్షాల పాత్రను విస్మరించలేం.
కాగా, వీధి పోరాటాల కంటే పార్లమెంట్‌లో ప్రజాప్రతినిధుల చర్చల ద్వారానే ప్రజా సమస్యలకు ఒక పరిష్కార మార్గం లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, గత రెండు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతుండటం ప్రజాస్వామ్య దేశానికి ఒక మాయని మచ్చ. నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా, తాము సిద్ధంగానే ఉన్నామని, ప్రతిపక్ష పార్టీలే వెనుకంజ వేస్తున్నాయని అధికార పక్షం చెబుతున్నది.
ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ కాలయాపన చేయడం సరికాదు. ఈ నేపథ్యంలో చట్టసభల్లో చర్చ జరగకపోతే ప్రజలకు సమాధానం ఎవరు చెబుతారు? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతున్నది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడం, చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయసేలా అర్థవంతమైన చర్చలు జరపడం, సమస్యలకు పరిష్కార మార్గాలను చూపే రాజకీయ సంస్కృతి లేకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని చెప్పక తప్పదు.






