హమాలీలుగా మారిన మహిళలు
గోవిందరావుపేట తండాలో మహిళా శక్తికి నిదర్శనం
కోనరావుపేట, మే 28 (విజయక్రాంతి): సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే విషయాన్ని కోనరావుపేట మండలంలోని గోవిందరావుపేట తండా మహిళలు మరోసారి నిరూపించారు. సాధారణంగా పురుషులు చేసే హమాలీ పనిని మహిళలే స్వయంగా చేపట్టి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూకం వేసి లారీలకు తరలించేందుకు హమాలీలు అందుబాటులో లేకపోవడంతో మహిళలు ముందుకు వచ్చి బాధ్యతలు చేపట్టారు.
తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుండా మహిళలు ధాన్యపు బస్తాలను మోసి ట్రాక్టర్లలో ఎక్కిస్తూ కోనరావుపేట మండల కేంద్రంలోని గోదాములో దించుతూ కష్టపడి పనిచేస్తున్నారు.రోజువారీ కూలి కోసం మాత్రమే కాకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో కూడా వారు ఈ పనిలో పాల్గొంటున్నారు. మహిళల శ్రమ, పట్టుదల చూసి స్థానిక రైతులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటిపనులతో పాటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు కూలి పనులు కూడా సమర్థంగా చేయడం మహిళల ఆత్మస్థైర్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
పురుషులకే సాధ్యమయ్యే పనులు అనే భావనను చెరిపేస్తూ మహిళలు సమానత్వాన్ని చాటుతున్నారు. ధాన్యపు బస్తాలను మోసే సమయంలో మహిళలు పరస్పరం సహకరించుకుంటూ పనిచేయడం అక్కడి వారిని ఆకట్టుకుంటోంది. గ్రామస్థులు మాట్లాడుతూ మహిళల కష్టానికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం మహిళల కోసం మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారు ఇంకా ముందుకు సాగుతారని అభిప్రాయపడుతున్నారు. గోవిందరావుపేట తండా మహిళలు తమ కష్టంతో గ్రామానికి ఆదర్శంగా నిలుస్తూ మహిళా శక్తి ఏమిటో చూపిస్తున్నారు.






