కశ్మీర్‌పై మూడోపక్షమా!
భారతదేశంలో జమ్మూకశ్మీర్ అంతర్భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో కశ్మీర్ అంశం మరో సారి అంతర్జాతీయ యవనికపై చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సెర్గియో కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయని, అమెరికా జారీచేసిన ప్రయాణ హెచ్చరికలను పునఃపరిశీలించే అవకాశం ఉందని పేర్కొనడాన్ని అందరూ ఆహ్వానించాలి. అయితే, ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని యూఎస్ దౌత్యాధికారిని పిలిపించి అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ సంగతి ఇలా ఉంటే, తాజా పరిణామాలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పందించిన తీరు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, అమెరికా రాయబారి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ధ్రువీకరించాల్సిన అవసరం లేదని చెప్పిన జమ్మూకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు తారీఖ్ హమీద్ కర్రా, ఈ సందర్భంగా సిమ్లా ఒప్పందాన్ని ప్రస్తావించడం గమనార్హం. భారత్, పాక్ మధ్య కుదిరిన 1972 నాటి సిమ్లా ఒప్పందం ప్రకారం కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యానికి తావు లేదు.
కాగా, అమెరికా రాయబారి వ్యాఖ్యలను భారత్ సాధించిన దౌత్య విజయంగా బీజేపీ చెప్తుండగా, కశ్మీర్ విషయంలో అమెరికా వంటి మూడోపక్షం జోక్యం చేసుకునే పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఈ మొత్తం పరిణామాలను కేవలం కశ్మీర్ విషయంలో భారతదేశానికి అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? అన్న కోణంలోనే చూడటం సరికా దు. అమెరికా రాయబారి మన దేశానికి అనుకూలంగా వ్యాఖ్యానించినప్పటికీ, మూడోపక్షం జోక్యానికి తావుండకూడదన్న విధానాన్ని ఈ పరిణామం తూట్లు పొడుస్తున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కశ్మీర్ విషయంలో భారతదేశానికి అంతర్జాతీయ మద్దతు అవసరమే.
కానీ, అమెరికా వైఖరితో ఈ సమస్య పరిష్కారం కాదనే వాస్తవాన్ని గుర్తెరగాలి. అదే సమయంలో ఇతర దేశాల అతి జోక్యం కూడా భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో మూడోపక్షం జోక్యంపై విపక్ష నేతల విమర్శలను రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయకుండా, కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కశ్మీర్ విషయంలో స్పష్టమైన, స్థిరమైన విధానాన్ని కొనసాగిస్తూనే, దౌత్యపరంగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది.






