కలం యోధుడి విముక్తి సమరం
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిరా చుక్కను నెత్తుటి బొట్టుగా మార్చి, అక్షరాన్ని ఆయుధంగా సంధించి నిరంకుశ పాలకుల వెన్నులో వణు కు పుట్టించిన అసమాన కలం యోధుడు షహీద్ షోయబుల్లా ఖాన్. స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి దేశం ఉవ్విళ్లూరుతున్న వేళ, హైదరాబాద్ సంస్థానంలో కమ్ముకున్న రజాకార్ల కర్కశ చీకట్లను చీల్చడానికి తన కలాన్ని కాగడాగా మలిచిన అరుదైన పాత్రికేయ మూర్తిమత్వం ఆయనది. 1920 అక్టోబరు 17న నాటి వరంగల్ సుబాలోని సుబ్రవేడు గ్రామంలో హబీబు ల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు జన్మించిన షోయబుల్లా ఖాన్, చిన్ననాటి నుంచే గాంధేయవాద సిద్ధాంతాల పట్ల ప్రగాఢమైన ఆకర్షణను పెంచుకున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో విశేష పాండిత్యాన్ని గడించిన షోయబుల్లా, పాత్రికేయ వృత్తిని కేవలం జీవనోపాధిగాకాక, అణగారిన ప్రజల ఆర్తనాదాలకు గొంతుకగా, స్వేచ్ఛాసమరానికి రణక్షేత్రంగా ఎంచుకున్నారు. కాగా, నాటి హైదరాబాద్ సంస్థానంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలన, ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి.
ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛను ఉక్కుపాదంతో తొక్కిపెడుతున్న ఆ కల్లోల సమయంలో షోయబుల్లా నిర్భయంగా ముందడుగు వేశారు. మొదట నరేంద్రజీ ప్రారంభించిన ‘తేజ్’ ఉర్దూ దినపత్రికలో, ఆ తర్వాత మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న ‘రయ్యత్’ పత్రికలో చేరి, నిజాం దమనకాండను ఎండగట్టారు. ఆయన విశ్లేషణల తీవ్రతకు భయపడిన నిజాం ప్రభుత్వం ఈ రెండు పత్రికలపై నిషే ధం విధించింది.
దీంతో తన కుటుంబ ఆభరణాలను విక్రయించి, బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ వంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అగ్రనేతల నైతిక మద్దతుతో 1947 నవంబరులో ‘ఇమ్రోజ్’ (నేడు) దినపత్రికను ప్రారంభించారు. ఇమ్రోజ్, నిజాం సం స్థానంలో కొనసాగుతున్న అరాచకాలపై నిరంతర శంఖారావాన్ని పూరించింది. 1947 ఆగస్టు 15న యావత్ భారతదేశం దాస్య శృంఖలాలను తెంచుకుని స్వతంత్ర భారతావనిగా ఆవిర్భవించినా, నిజాం నవాబు స్వ తంత్ర దేశంగా కొనసాగాలని లేదా పాకిస్థాన్‌లో కలవాలని కుట్రలు పన్నుతున్న వైనాన్ని షోయబుల్లా తీవ్రంగా వ్యతిరేకించారు.
మఖ్దూం మొహియుద్దీన్, బూర్గుల వంటి ప్రగతిశీల నాయకుల గొంతుకకు తన పత్రికలో పెద్దపీట వేశారు.నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆర్యసమాజ్ సత్యాగ్రహా లు, కాంగ్రెస్ జాతీయ ఉద్యమాలు చేస్తున్న పోరాటాలకు ‘ఇమ్రోజ్’ అండగా నిలిచింది. ఒక ముస్లిం పాత్రికేయుడే తమ మతోన్మాదాన్ని బహిరంగంగా తూర్పార బడుతుండటం ఖాసీం రజ్వీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
ఈ ధిక్కార స్వరాన్ని ఎలాగైనా శాశ్వతంగా మూయించాలనే దుష్ట సంకల్పంతో రజాకార్లు కుట్ర పన్నారు. 1948 ఆగస్టు 21 అర్ధరాత్రి దాటిన తర్వా త, ఇమ్రోజ్ మరుసటి రోజు సంచిక సంపాదకీయాన్ని పూర్తి చేసుకుని, కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటికి కాలినడకన బయలుదేరిన షోయబుల్లాపై రజాకార్ల ముఠా విచక్షణారహితంగా దాడి చేసింది. నిజాంను విమర్శిస్తూ వ్యాసాలు రాస్తున్న ఆ పవిత్రమైన కుడిచేతిని మణికట్టు వరకు కత్తులతో నరికివేసి, శరీరంలోకి తూటాలు దించారు.
తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన షోయబుల్లాను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా 1948 ఆగస్టు 22 తెల్లవారుజామున, 27 ఏళ్లకే అమరులయ్యారు. తన నెత్తుటి ధారలతో విముక్తి బాటలు వేసిన షోయబుల్లా త్యాగం వృథా పోలేదు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నిజాం సంస్థానంపై చర్యలు తీసుకోవడానికి ప్రేరణనిచ్చిన అత్యంత కీలక ఘటనల్లో ఈ హత్య ఒకటి. ప్రాణభయం వెంటాడుతున్నా అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించిన ఆయన పాత్రికేయ విలువలు నేటి సమాజానికి, ప్రజాస్వామ్యానికి మార్గదర్శకాలు. మాతృభూమి ఐక్యత కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం సర్వస్వాన్ని అర్పించిన షోయబుల్లా ఖాన్ స్మృతి జాతి గుండెల్లో అక్షరజ్యోతియై నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494






