తెలంగాణ హెల్త్‌కేర్‌లో ఏఐ ఎలా?
డాక్టర్ ఎం.వామన్‌రావు :
* ఏడాదిలోగా కోటి మంది భారతీయ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో, వారికి ఎటువంటి ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తారనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థకు అవసరమైన మానవ వనరులను తెలంగాణ రాష్ట్రం రాజధానిలోనే కాకుండా, జిల్లాల్లోని కళాశాలల ద్వారా కూడా తయారు చేస్తోంది. కానీ, ఆ యువతకు అవసరమైన సరైన ఉద్యోగాన్ని మాత్రం రాష్ట్రం ఇంకా నిర్మించలేదని ఆంత్రప్రెన్యూర్, ఇన్వెస్టర్ డాక్టర్ ఎం.వామన్‌రావు చెబుతున్నారు.
* మానవ వనరులు తమంతట తామే వస్తారని హైదరాబాద్ వేచి చూడలేదు కాబట్టే, అది ‘ఫార్మా క్యాపిటల్’ కాగలిగింది. మూడు దశాబ్దాల పాటు ప్రణాళికాబద్ధంగా వర్క్‌ఫోర్స్‌ను తయారు చేసింది, ప్రపంచం దాని వద్దకు వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి పని చేయాలి. కానీ, కాలపరిమితి తక్కువ. ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది.
ఆగస్టు 15న ఎక్రోట నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రాబోయే ఏడాదిలో కోటి మంది యువతకు కృత్రిమ మేధలో శిక్షణ ఇస్తామని, తద్వారా ఈ రంగంలో భారత్ ప్రపంచానికే నాయకత్వం వహిస్తుందని హామీ ఇచ్చారు. ఇది అత్యంత నిబద్ధతతో కూడిన ప్రకటన. అయితే దీని పరిమాణమే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. అయితే, ఈ శిక్షణ ద్వారా వారిని ఎలాంటి ఉద్యోగాలకు సన్నద్ధం చేస్తారనే ప్రశ్నకు మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో.. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, దీనికి ఒక స్పష్టమైన సమాధానం ఉంది. గత జనవరిలో లైఫ్ సైన్సెస్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లను కేటాయించింది. ఒక ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థకు అవసరమైన మానవ వనరులను రాష్ట్రం ఇప్పటికే తయారు చేస్తోంది. కానీ, వారు చేరడానికి తగిన ఉద్యోగ హోదా (జాబ్ రోల్)ను ఇంకా సృష్టించలేదు.
వర్క్ ఫోర్స్ (కార్మిక శక్తి) అనే ప్రశ్నకు సాధారణంగా.. భారతదేశానికి మరికొందరు వైద్యులు, ఏఐ ఇంజినీర్లు అవసరమని తక్షణం వచ్చే సమాధానం. ఇవి రెండూ సాధారణంగా నిజమే అయినప్పటికీ.. ప్రస్తుత సందర్భానికి ఇవి పూర్తిగా అంగీకారం కావు. ఒక ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థకు ఈ రెండూ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించవు. నిజానికి అలాంటి ఉద్యోగ హోదా భారత్‌లో అసలు ఉనికిలోనే లేదు.
ఎవరూ పేరు పెట్టని ఆ పాత్ర..
ముందస్తు ఆరోగ్య సాంకేతికత (ప్రెడిక్టివ్ హెల్త్ టెక్నాలజీ) సరిగ్గా పనిచేసినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఒక జిల్లాలోని పట్టణానికి చెందిన ఓ మహిళ గత పదకొండేళ్లుగా టైప్--2 మధుమేహంతో బాధపడుతోంది. బస్టాండ్ సమీపంలోని ఒక డయాగ్నోస్టిక్ కియోస్క్ ఆమె రక్తం ఆధారంగా హెచ్‌బీఏ1సీ, రక్తపోటు పెరుగుతున్న ట్లు నమోదు చేసి, ఆ నివేదికను ఆమె డిజిటల్ హెల్త్ అకౌంట్లో పొందుపరిచింది. కొన్ని వారాల తర్వాత, ఒక ఏఐ మోడల్ ఆమె పా త మెడికల్ రికార్డులు, వాడుతున్న మందుల చరిత్రను పరిశీలించి.. ‘ఈమె ముప్ఫు రోజుల్లో ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంది’ అని హెచ్చరిస్తుంది. ఆ అంచనా సరైనదే.
ఆ హెచ్చరిక (అలర్ట్).. ఆమెను మునుపెన్నడూ చూడని ఒక వైద్యుడికి చేరుతుంది. ఆ సమయంలో బయట 90 మంది రోగులు నిరీక్షిస్తుండవచ్చు. అనేక మందికి సంబంధించిన ‘హెచ్చరిక’ల జాబితాలో ఇదీ ఒకటిగా ఉండిపోతుంది. ఆయన దానిపై ఎటువంటి చర్య తీసుకోరు. ఆయన స్థానంలో ఉన్నవారు ఎవరైనా అలాగే చేస్తారు. ఆమె మందుల పరిమాణాన్ని మార్చాలంటే ఒక కన్సల్టేషన్, మళ్లీ పరీక్ష, ఒక ఫోన్ కాల్ అవసరం. ఇదంతా ఎవరికీ నిర్దేశించిన బాధ్యత కాదు. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడటం ఎవరి ఉద్యోగ బాధ్యతల్లోనూ లేదు.
ఐదు వారాల తర్వాత ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరుతుంది. మెషిన్ ముందే ఊహించిన సంఘటనకు, సమన్వయ పరిశీలన (కోఆర్డినేటెడ్ అటెన్షన్)తో నివారించగలిగే ఆ పరిస్థితికి సంబంధిత ప్రతి సంస్థకూ నియమానుసారం కొన్ని వేల రూపాయల బిల్లులు చెల్లిస్తారు.
ఇక్కడ సాంకేతికత అద్భుతంగా పనిచేసింది. కానీ, ఇక్కడ వర్క్‌ఫోర్స్ నిర్మాణం (వర్క్‌ఫోర్స్ ఆర్కిటెక్చర్) విఫలమైంది. అక్కడ వైద్యుడు లేక కాదు. డేటా సైంటిస్ట్ లేక కాదు. ఆ అలర్ట్‌ను చదివే క్లినికల్ పరిజ్ఞానం, ఒక ప్రొటోకాల్‌ను అనుసరించి చర్య తీసుకోగల అధికారం, బాధితురాలికి ఫోన్ చేసి మాట్లాడే సమయం ఉన్న ఒక వ్యక్తి మాత్రమే లేకపోవడం అసలైన సమస్య. అభివృద్ధి చెందిన ఆరోగ్య వ్యవస్థల్లో ఈ బాధ్యతను విభిన్న పేర్లతో పిలుస్తారు. కానీ, భారతదేశంలో ఈ ఉద్యోగ పాత్రే లేదు. అసలైన అడ్డంకి.. వైద్యుల కొరత కాదు.. వారి కింద పనిచేసే ద్వితీయ శ్రేణి మానవవనరులు (లేయర్ బినీత్ దెమ్) లేకపోవడమే.
తెలంగాణలో మానవవనరులు
ఇది కేవలం ఒక నగరానికి సంబంధించిన కథ కాదు, రాష్ట్రమంతటికీ సంబంధించినది అనడానికి ఒక ఉదాహరణ ఉంది. తెలంగాణలో దాదాపు 189 నర్సింగ్ కళాశాలలు, 186 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ ప్రైవేట్ కళాశాలలే. వీటితో పోలిస్తే ఎంబీబీఎస్ సీట్లు సుమారు 9,540 మాత్రమే. రాష్ట్రంలో వైద్యుల కంటే అలైడ్- (సహాయక వైద్య) గ్రాడ్యుయేట్ల ఉత్పత్తి రేటు చాలా ఎక్కువ. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. వీరిలో మెజారిటీ హైదరాబాద్‌లో కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వాటి పరిసర జిల్లాల్లో ఉన్నారు.
ఈ గ్రాడ్యుయేట్లే.. లోపిస్తున్న ఉద్యోగ పాత్రకు సరిగ్గా సరిపోయేది. నర్సింగ్ గ్రాడ్యుయేట్‌కు క్లినికల్ పరిశీలన, తక్షణ హెచ్చరికలపై స్పష్టత ఉంటుంది. ఒక ఫార్మసీ గ్రాడ్యుయేట్‌కు మందుల ప్రభావం, మోతాదులపై అవగాహన ఉంటుంది. చక్కెర నియంత్రణ తప్పుతున్న రోగికి ఫోన్ చేసి ప్రొటోకాల్ నిర్వహించడానికి, అవసరమైతే వైద్యుడి వద్దకు పంపడానికి వీరికి మెడికల్ డిగ్రీ అక్కర్లేదు. వీరికి కావలసింది అల్గారిథమిక్ అక్షరాస్యత, రిస్క్ అసెస్‌మెంట్, కేర్ కోఆర్డినేషన్‌పై తగిన శిక్షణ, ఆ తర్వాత పర్యవేక్షణతో సాధన (సూపర్‌వైజ్డ్ ప్రాక్టీస్) మాత్రమే. అంతే, సరిగ్గా ఒక సంవత్సరం శిక్షణ చాలు. ఒక మెడికల్ విద్యకు పట్టే దశాబ్ద సమయం దీనికి పట్టదు.
వైరుధ్యం ఏమిటంటే..
ఇప్పుడు దీనిని భారతీయ గ్రాడ్యుయేట్ల ప్రస్తుత పరిస్థితితో పోల్చి చూడండి. ఎకనామిక్ సర్వే ప్రకారం మన దేశంలో 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లకు మాత్రమే వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నా యి. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా- 2026 నివేదిక ప్రకారం 15 నుంచి 25 ఏళ్ల వయస్సు గల గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత దాదాపు 40 శాతానికి చేరుకుంది. ప్రతి సంవత్సరం 50 లక్షల మంది ఉద్యోగం కోసం మార్కెట్లోకి వస్తుంటే, వారిలో సగానికి పైగా నిరుద్యోగులుగానో లేదా తక్కువ అర్హత కలిగిన ఉద్యోగాల్లోనో మిగిలిపోతున్నారు.
దీని ప్రభావం అడ్మిషన్ల వ్యవస్థపై కూడా పడింది. ఈ సంవత్సరం తెలంగాణ కౌన్సెలింగ్‌లో 1,297 లాటరల్-ఎంట్రీ బి.ఫార్మసీ సీట్లకు గాను 32 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇది ఒక చిన్న సంఖ్య కావచ్చు. లేదా ఒక ఏడాది డేటా అనేది ట్రెండ్ కాకపోవచ్చు. కానీ, విద్యార్థులు ఒక దిశగా వెళ్లడానికి నిరాకరిస్తున్నారంటే.. మాత్రం అది గమనించదగ్గ విషయమే.
భవిష్యత్తు ఎటు వైపు ఉందో మొదట గ్రహించేది విద్యార్థులే. అటు యజమానులు (ఎంప్లాయర్స్) కూడా సంతృప్తిగా లేరు. 2026 నాటి ఒక సర్వేలో 68 శాతం మంది విద్యార్థులు తాము మొదటి రోజే ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నామని భావించగా, 9 శాతం కంపెనీలు మాత్రమే ఈ అభిప్రాయంతో ఏకీభవించాయి.
అంటే రాష్ట్రం ఒకే సమయంలో రెండు పనులు చేస్తోంది. ఒకటి, ఏఐ ఆధారిత ఆరో గ్య వ్యవస్థకు అవసరమైన ముడి పదార్థాన్ని (మానవ వనరులను) భారీగా తయారు చేస్తోంది. రెండు, వారికి ఉపాధి కల్పించడంలో విఫలమవుతోంది. ఇది మానవ వనరుల కొరత కాదు. రాష్ట్రంలో ప్రజలు ఉన్నా రు, విద్యాసంస్థలు ఉన్నాయి.
అయితే వారిని పనితో అనుసంధానించే శిక్షణ, వారు చేరడానికి తగిన ఉద్యోగ వేదిక (జాబ్ రోల్)లే కనపడటం లేదు. హైదరాబాద్‌లో సాంకేతిక సామర్థ్యం ఉంది. కానీ, వర్క్‌ఫోర్స్ అంతా జిల్లాల్లోని కళాశాలల్లో విస్తరించి ఉంది. అక్కడ చదివే గ్రాడ్యుయేట్లు రాజధానిలోని పెద్ద భవనాలను ఎప్పటికీ చూడకపోవచ్చు. ఈ రెండింటినీ జోడించే వారధి ఏదీ లేదు.
ఈ లోపం ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించుకుంటే.. మూడు విషయాలు లోపించినట్టుగా కనపడుతుంది.
పాఠ్య ప్రణాళిక (కరిక్యులం) లేదు: నర్సిం గ్, ఫార్మసీ సిలబస్‌లు వ్యాధి వచ్చాక చికిత్స చేసే వ్యవస్థ కోసం రాసినవి. వ్యాధి రాకముందే ఊహించే వ్యవస్థ కోసం కావు. రిస్క్ స్కోర్‌ను విశ్లేషించడం లేదా ప్రొటోకాల్‌ను అమలు చేయడంపై వారికి ఎలాంటి శిక్షణ ఉండదు.
గుర్తించని హోదా (నో రికగ్నైజ్డ్ కేటగిరీ) లేదు: ‘కేర్ కోఆర్డినేషన్’ అనేది అధికారికం గా గుర్తింపు పొందిన వృత్తి కాదు. ఇది కేవ లం సాంకేతిక సమస్యలా అనిపించవచ్చు, కానీ కాదు. హోదా లేకపోతే ఆసుపత్రి నోటిఫికేషన్ ఇవ్వలేదు.. ఇన్సూరెన్స్ కంపెనీ రీయింబర్స్ చేయవు.. విద్యార్థికి కెరీర్ కనిపించదు.
నియామక బడ్జెట్ లేదు: ఈ పాత్రను నిర్వహించే ఉద్యోగిని నియమించుకోవాలనుకునే సంస్థలకు కూడా బడ్జెట్ లైన్ లేదు. ఎందుకంటే ‘ఆసుపత్రిలో చేరే పరిస్థితి రాకుండా నివారించడ’మే ఈ పాత్ర అసలైన విలువ.
రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగేవి
ఈ సమస్యకు పరిష్కారం.. మెజారిటీ భాగం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోనే ఉంది. ఇందులో భాగంగా నాలుగు పనులు చేయవచ్చు.. చేపట్టవచ్చు.
12 నెలల సర్టిఫికేషన్ కోర్సు: రాష్ట్రంలోని వైద్య, సాంకేతిక సంస్థలు ఉమ్మడిగా దీనిని రూపొందించాలి. నర్సింగ్ లేదా ఫార్మసీ డిగ్రీ పూర్తి చేసిన వారికి, కేవలం రాజధానిలోనే కాకుండా జిల్లా కళాశాలల ద్వారా దీనిని అందించాలి. ఇందులో 6 నెలల కోర్ పాఠ్యాంశాలు (రిస్క్ స్కోరింగ్, అల్గారిథమిక్ అక్షరాస్యత, కేర్ కోఆర్డినేషన్) ఉంటాయి. తదుపరి 6 నెలలు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ నెట్‌వర్క్‌లు లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ఫిజీషియన్లు, డేటా సైంటిస్టులతో కలిసి పని చేసే ‘సూపర్‌వైజ్డ్ అప్రెంటిస్‌షిప్’ ఉండాలి.
అలైడ్ హెల్త్ కౌన్సిల్ గుర్తింపు: ఈ కొత్త పాత్రకు రాష్ట్ర అలైడ్- హెల్త్ కౌన్సిల్ ద్వారా అధికారిక గుర్తింపు, విధుల పరిధిని ఖరారు చేయాలి. దీనివల్ల ఆసుపత్రులు రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి, ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లింపులు చేయడానికి వీలవుతుంది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో ప్లేస్‌మెంట్లు: హైదరాబాద్‌లోని జీసీసీలలో నగర విద్యార్థులకే కాకుండా.. జిల్లా గ్రాడ్యుయేట్లకు కూడా అవకాశం కల్పించాలి. దేశంలోనే అత్యంత సంక్లిష్టమైన హెల్త్- టీమ్‌లు వీరి వద్ద ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్ ద్వితీయార్థ శిక్షణను ప్రభుత్వంపై ఎటువంటి భారం లేకుండా వీటిల్లో పూర్తి చేయవచ్చు.
మెడికల్, ఇంజినీరింగ్ సంస్థల ఉమ్మడి బోధన: హైదరాబాద్‌లో ఈ రెండూ భారీ స్థాయిలో ఉన్నాయి. కానీ, ఇప్పటికీ ఆ విద్యార్థులు ఒకే క్లాస్‌రూమ్‌ను గాని, ప్రాజెక్ట్‌ను గాని పంచుకోవడం లేదు. దీనికి తగిన ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలి.
మొదటి ప్రతిపాదనలోని రెండో భాగం (6 నెలల అప్రెంటిస్‌షిప్) అత్యంత కీలకమైనది. కానీ, దీనినే తరచూ వదిలేస్తుంటారు. కేవలం క్లాస్‌రూం చదువు అవగాహనను ఇస్తుంది తప్ప.. ఒక రోగి బాధ్యతను అప్పగించేంత నమ్మకాన్ని వైద్యుడికి ఇవ్వదు. రిస్క్ స్కోర్ అంటే ఏమిటో తెలుసుకోవడం సులభం. కానీ, దాన్ని ఎప్పుడు పక్కనపెట్టి సొంతంగా నిర్ణయం తీసుకోవాలో తెలియాలంటే పర్యవేక్షణతో కూడిన సాధన (సూపర్‌వైజ్డ్ రిపిటిషన్) అవసరం.
ప్రస్తుతం భారతదేశంలో శిక్షణకు సంబంధించి రెండు జాతీయ కట్టుబాట్లు ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రచురించిన జాతీయ ఏఐ హెల్త్ స్ట్రాటజీ (ఎస్‌ఏహెచ్‌ఐ) చేసిన 32 సిఫారసుల్లో మానవ వనరుల శిక్షణను కూడా చేర్చింది. ఎర్రకోట ప్రసంగంలో ఏడాదిలో కోటి మందికి శిక్షణ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ రెండూ స్వాగతించదగినవే.
అయితే, ఈ రెండు కూడా శిక్షణ పూర్తయ్యాక ‘ఉద్యోగాన్ని’ మాత్రం సృష్టించలేవు. అది ఢిల్లీ చేతిలో లేదు. రిజిస్ట్రేషన్, సేవల పరిధి, పాఠ్యప్రణాళిక, ఆసుపత్రులు నియామకాలు చేపట్టేలా చేయడం, ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించేలా చేయడం.. ఇవన్నీ రాష్ట్ర పరిధిలోని అంశాలు. జాతీయస్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యం విజయం సాధిస్తుందా.. లేదా? అనేది రాష్ట్ర రాజధానుల్లోనే తేలనుంది.
ఇలాంటి అర్హత కలిగిన కోర్సును ఎక్కడో ఒకచోట మొదట సృష్టించాలి. మొదట సృష్టించిన రాష్ట్రాన్నే మిగిలిన దేశం మోడల్‌గా తీసుకుంటుంది. ఇది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఒక కరిక్యులమ్, ఒక రిజిస్ట్రేషన్ కేటగిరీతోపాటు ఇక్కడ ఇప్పటికే ఉన్న కంపెనీలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు చేసుకోవడం. అయితే ఎవరో ఒకరు ముందడుగు వేయడమే కావాలి.
ఇప్పుడు కావాల్సింది నిబద్ధత
ఒక బడ్జెట్‌లో మూలధనాన్ని (క్యాపిటల్) కేటాయించడం సులభమే. కానీ, కార్మిక శక్తి (వర్క్ ఫోర్స్)ని ఒక్క రోజులో కేటాయించ లేం. దానిని ప్రారంభించి, ఫలితం కోసం వేచి చూడాలి. అందుకే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలంటే.. 2029లో మానవ వనరుల కోసం వెతుక్కోవడం ప్రారంభించకుండా.. ఈ అంశంపై ఇప్పుడే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
చాలా పరిశ్రమల విధానాలు ఒకే సమస్యను పరిష్కరిస్తాయి. కానీ, ఇది రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరిస్తుంది. తెలంగాణ వద్ద తాము చదివిన చదువుకు తగిన ఉపాధి లభించని నర్సింగ్, ఫార్మసీ గ్రాడ్యుయేట్ల తరం ఉంది. మరొకవైపు అతి త్వరలో వారి సేవలు అవసరమయ్యే ఆరోగ్య వ్యవస్థ ఉంది. ఈ రెండింటినీ అనుసంధానించడం ఉచిత సంక్షేమమో లేదా ఉపాధి పథకమో కాదు. తెలంగాణ ఇప్పటివరకు నిర్మించిన అత్యంత చౌకైన, అత్యంత సమర్థవంతమైన మౌలిక సదుపాయాలలో ఇది ఒకటి కానుంది.
మానవ వనరులు తమంతట తామే వస్తారని హైదరాబాద్ వేచి చూడలేదు కాబట్టే, అది ‘ఫార్మా క్యాపిటల్’ కాగలిగింది. మూడు దశాబ్దాల పాటు ప్రణాళికాబద్ధంగా వర్క్‌ఫోర్స్‌ను తయారు చేసింది, ప్రపంచం దాని వద్దకు వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి పని చేయాలి. కానీ, కాలపరిమితి తక్కువ. ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థకు అవసరమైన మానవ వనరులను తయారు చేసే రాష్ట్రం.. తన సొంత అవసరాలనే కాకుండా, రేపు దేశం మొత్తానికి అవసరమైన మానవ వనరులనూ సరఫరా చేయగలుగుతుంది.
(వ్యాసకర్త: బోస్టన్‌కు చెందిన శాస్త్రవేత్త, సీరియల్ ఆంత్రప్రెన్యూర్. యూఎస్, కెనడాలలో హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాంలతో సహా అంతర్జాతీయంగా అనేక హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ సంస్థలు స్థాపించి, నిర్వహించారు. ప్రస్తుతం ఏఐ హెల్త్‌కేర్, లాంగెవిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పనిచేస్తున్నారు.






