22 August, 2026 | 2:32 AM

ప్రతి రూపాయి రైతుల ఖాతాలోకే

22-08-2026 01:35 AM
  1. రూ.5వేల కోట్ల సీఎం లక్ష్యం నెరవేరాలి 
  2. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పరిహారం చెల్లింపులో మిషన్ మోడ్ 
  3. ఒకటిరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ 
  4. పరిపాలనా జాప్యానికి తావుండరాదు
  5. కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశం 
  6. రూ.1,200 కోట్ల పంపిణీకి ఆదేశాలు జారీ    

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం ప్రతి పైసా భూమి కోల్పోయిన రైతు, నిర్వాసిత కుటుంబం ఖాతాలోకే చేరాలని.. సకాలంలో అందకపోతే నిధులు మంజూరు చేసిన లక్ష్యమే నెరవేరదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధులు ఉండటం వల్ల ప్రయోజనం లేదన్నారు.

రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి అడ్డం కిగా మారిన భూసేకరణ, పునరావాసం-పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్), అటవీ అనుమతులు తదితర సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు శుక్రవారం జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజ నీర్లు, ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసర వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన ప త్రాలు, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఉన్న చోట ఒకటిరెండు రోజుల్లోనే రైతులు, నిర్వాసితుల ఖా తాల్లో పరిహారం జమ చేయాలని ఆదేశించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ భూములకు సంబం ధించిన చెల్లింపులు తదితర సమస్యలు అడ్డంకిగా ఉండకూడదన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్ప మని, ఈ సమస్యల పరిష్కారానికే రూ.5 వేల కోట్లు కేటాయించారని మంత్రి తె లిపారు. ఇంత పెద్ద మొత్తా న్ని ప్రభుత్వం సమకూర్చినప్పుడు ఆ నిధులు క్షేత్రస్థా యిలో బాధితులకు చేరేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

నిధులను కలెక్టర్ల పీడీ ఖాతా ల్లో జమ చేయడంతో ప్రభు త్వ బాధ్యత పూర్తయినట్లు కాదని, ఆ డబ్బు భూమి ఇచ్చిన రైతుకు, నిర్వాసిత కుటుంబానికి చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. మంజూరు నుంచి లబ్ధిదారుడి ఖాతాలో జమయ్యే వరకు మధ్యలో ఉన్న ప్రతి అనవసర పరిపాలనా అడ్డంకినీ తొలగించాలని స్పష్టం చేశారు.

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ తదితర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,782 కోట్లు విడుదల చేయగా, అందులో సుమారు రూ.566 కో ట్లు లబ్ధిదారులకు చేరినట్లు సమీక్షలో వెల్లడైంది. మరో రూ.989 కోట్లు చెల్లింపు దశలో ఉన్నాయని, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న రూ.199 కోట్లు  పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఈ లెక్కల ప్రకారం దాదా పు రూ.1,200 కోట్లను తక్షణమే లేదా స్వల్ప పరిపాలనా ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఈ మొత్తాన్ని రైతులు, నిర్వాసితుల ఖాతాల్లోకి చేర్చడాన్ని అత్యవసర కార్యక్రమంగా చేపట్టాలని కలెక్టర్లు, నీటిపారుదల అధికారులను ఆదేశించారు. అదనంగా సుమారు రూ.455 కోట్లకు సం బంధించిన టోకెన్లు క్లియర్ అయి తదుపరి ప్రక్రియలో ఉన్నాయని సమీక్షలో వెల్లడైంది.

నిధులు విడుదల కావడం ఒక దశ మాత్రమేనని, అవి వాస్తవంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడమే అసలు ఫలితమని మంత్రి అన్నారు. విడుదలైన నిధులకు, రైతులకు జరిగిన వాస్తవ చెల్లింపులకు మధ్య ఉన్న అంతరాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయండి

నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చిన తరువాతే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టాలనే పద్ధతికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియ, కన్సెంట్ అవార్డులు, అవార్డు నంబర్లు, టోకెన్ల జనరేషన్ వంటి ప్రక్రియలన్నింటినీ ముం దుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.

అవార్డు నంబర్లు, టోకెన్ వివరాలు సిద్ధమైన వెంటనే అవసరమైన నిధుల విడుదల కోసం నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖతో సమన్వయం చేస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లాలో భూసేకరణ కోసం ఇప్ప టికే జమ చేసిన నిధులను ఒకటి రెండు రోజుల్లోనే పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు వారం రోజుల సమయం కావాలన్న అధికారుల అభ్యర్థనను ఆయన అంగీకరించలేదు.

నిధులు అందుబాటులో ఉండి, లబ్ధిదా రుల వివరాలు సిద్ధంగా ఉన్నప్పుడు పరిహారం చెల్లింపును వారం రోజులపాటు నిలిపివేయడానికి కారణం ఉండదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ఫీడర్ కెనాల్‌తో పాటు ఇతర పనులకు అవసరమైన సుమారు 180 ఎకరాల భూసేకరణకు సంబంధించిన కన్సెంట్ అవార్డులను మొత్తం ఆర్థిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరుపాలేరు లింక్ కెనాల్ భూసేకరణ అంశాన్ని కూడా మంత్రి సమీక్షించారు. రైతులతో జరిగిన చర్చలకు అనుగుణంగా కన్సెంట్ అవార్డులు, సవరించిన పరిహార అంచనాలను వేగంగా పూర్తి చేయాలని, భూసేకరణ సమస్యల కారణంగా ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. 

శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి

అటవీ అనుమతులకు సంబంధించిన అడ్డంకులపైనా మంత్రి ఉత్తమ్ ప్రత్యేక దృష్టి సారించారు. శాఖల మధ్య సమన్వయ లోపం లేదా అవసరమైన సమాచారం అందించడంలో జాప్యం కారణంగా నీటిపారుదల పనులు నిలిచిపోవడానికి వీల్లేదన్నారు. కలెక్టర్లు రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి పెండింగ్ అంశాలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు ఇతర నీటిపారుదల పథకాలకు సంబంధించిన అటవీ సమస్యలను సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకూడదని, ప్రభుత్వం వద్ద నిధులున్నప్పుడు పరిపాలనా జాప్యం కారణంగా బాధితుడు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.

ప్రాజెక్టు ముందుకు సాగాలి, రైతుకు న్యాయం జరగాలి.. రెండూ ఒకేసారి సాధించాలి అని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్, ఈఎన్సీలు ఓ.వీ. రమేష్ బాబు, టీ.శ్రీనివాస్, ఆర్.మధుసూదన్‌రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.