సీఎం యూఎస్ పర్యటన రద్దు
- లండన్ నుంచే తిరుగుప్రయాణం
- కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరణ
- రాజకీయ కారణాలేనా?
- కేంద్ర నిర్ణయంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి
- యూఎస్ పర్యటన కొనసాగించనున్న అధికారుల బృందం
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమె రికా పర్యటన రద్దయింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించబ డిందని కేంద్ర ప్రభుత్వం అమెరికా టూర్‌కు అనుమతి ఇవ్వలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఎం రేవంత్‌రెడ్డి యూకే, అమెరికా పర్యటనకు సంబధించి.. ప్రొటోకాల్, విధివిధానాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి కోరింది. తొలుత యూకే పర్య టనకు మాత్రమే కేంద్రం అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకేకు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారమిచ్చింది.
తెలంగాణ అభివృద్ధి, విద్యారంగ పురోగతికి, అలాగే వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడే యూఎస్ పర్యటనకు.. కేంద్రం అనుమతి నిరాక రించడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని, బోస్టన్, అమెరికా పర్యటనకు వెళ్లకూడదని సీఎం నిర్ణయించుకున్నారు. కేం ద్ర నిర్ణయంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు ‘ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే.
కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం లో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం. అత్యుత్త మ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవి. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎ ప్పుడూ విశ్వసిస్తాను’ అని సీఎం వ్యాఖ్యానించారు.
అయితే అధికారుల బృందం మాత్రం యూఎస్ పర్యటన కొనసాగించనుంది. వివిధ విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే సంప్రదింపు లు జరిపిన నేపథ్యంలో అమెరికా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను అధికారుల బృందం కొనసాగించాలని, ఆ యా విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
‘హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దు తాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హెచ్సీయూ, జేఎన్టీయూ తదితర విశ్వవిద్యాలయాల ఏర్పాటు హైదరాబాద్‌ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... ఒక పాఠశాల ప్రపంచానికి నాయకత్వం వహించగలమని నిరూపించింది.
అక్కడి నుంచి ప్రపంచంలోని గొప్ప టెక్ నాయకుల్లో కొందరు రూపుదిద్దుకున్నారు. ఐఐటీ, ఐఎస్బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ అగ్రశ్రేణి కార్పొరేషన్లు, వాటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగింది. ఇప్పుడు ప్రపంచంలోని ప్ర ఖ్యాత విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చాలని సీఎం పేర్కొన్నారు.
లండన్‌లో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల సందర్శన
యూకేలో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థలను సందర్శించారు. ఆయా సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అదే విధంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగ నాయకులతో సమావేశమై, తెలంగాణతో భాగస్వామ్యాలను ఖరారు చేసేందుకు చర్చలు జరపనున్నారు.
‘హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. ఒక సాధారణ భారతీయుడు హైదరాబాద్‌లోని హార్వర్డ్, ఆక్స్‌ఫర్ లేదా ఎంఐటీ, ఎల్బీఎస్, ఎల్‌ఎస్‌ఈ వంటి ప్రపంచ స్థాయి సంస్థల నుంచి విద్య, సర్టిఫికేషన్ పొందగలగాలి. ఎందుకంటే చాలామంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకున్నారు. కానీ నేను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను భారత్‌కు తీసుకురావాలని అభిలషిస్తున్నాను’ అని సీఎం పేర్కొన్నారు.






