calender_icon.png 4 February, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్లలో ‘త్రిముఖ’ పోరు

04-02-2026 01:42:28 AM

  1. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు!

నామినేషన్ల ముగియడంతో జోరందుకోనున్న ప్రచారం

చేవెళ్ల, ఫిబ్రవరి ౩ (విజయక్రాంతి): కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం ముదిరింది. నామినేషన్ల ఘట్టం ముగిసి,  పార్టీల వారిగా బీ-ఫామ్స్ కేటాయింపు ప్రక్రియ ముగియడం తో  పట్టణంలో రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది.

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చేవెళ్ల వీధులన్నీ ప్రచార హోరుతో, జాతరను తలపిస్తున్నా యి. పాలక పక్షం హోదాలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇంచార్జి భీమ్ భరత్ స్వయంగా రంగంలోకి దిగి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

హామీల అమలు ‘ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాం.. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకే ఓటెయ్యాలి‘ అని నేతలు పిలుపునిస్తున్నారు.

ముదిరిన అసమ్మతి

13వ వార్డు (కేసారం)లో టికెట్ కేటాయింపు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే మాట ఇచ్చిన రాములు గౌడ్కు కాకుండా, రమేశ్ గౌడ్కు బీ-ఫామ్ ఇవ్వడంతో రాములు గౌడ్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రెబల్గా పోటీ చేస్తానని ఆయన ప్రకటించడం పార్టీలో కలకలం రేపుతోంది. సబితమ్మ వ్యూహంతో బీఆర్‌ఎస్ అటాక్ చేస్తూ పార్టీ తన పట్టును నిరూపించుకునేందుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ’ఆరు గ్యారంటీలు’ అమలు కాలేదని, ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్తో మోసం చేస్తున్నారని సబితమ్మ విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని, కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగవద్దని ఆమె కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కమల దళం కదనరంగం లో కి చొచ్చుకొచ్చింది. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో 4 పంచాయతీలను గెలుచుకున్న ఉత్సాహంతో బీజేపీ బరిలో నిలిచింది.

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగా, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న దేశాభివృద్ధిని చూసి ఓటెయ్యాలని, స్థానిక సమస్యల పరిష్కారమే తమ అజెండా అని బీజేపీ నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ప్రజల తీర్పు ఎవరిది?

మూడు పార్టీల అభ్యర్థులు వందలాది మంది అనుచరులతో ర్యాలీలు నిర్వహిస్తుండటంతో చేవెళ్ల పురవీధులు గులాబీ, కాషాయం, హస్తం జెండాలతో నిండిపోయాయి. అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా? లేక హామీల వైఫల్యం ప్రభావం చూపుతుందా? అన్నది మరో 10 రోజుల్లో తేలనుంది.