29 April, 2026 | 2:20 AM

నీళ్ల పోరుపై నిలువెత్తు సంతకం

29-04-2026 12:00 AM

తెలంగాణ సాగునీటి ఉద్యమ చరిత్రను తవ్వితే వినిపించే మొదటి గొం తు, కనిపించే మొదటి అక్షరం ఆర్ విద్యాసాగర్ రావు. దశాబ్దాల పాటు సాగి న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు కేవలం భావోద్వేగాలే ఇంధనం కాలేదు, ఆ పోరాటానికి ఒక శాస్త్రీయ భూమికను, గణాంకాల బలాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వలస పాలకుల కుట్రలను బట్టబయలుచేసిన మేధోశిఖరం ఆయన.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎండగడుతూ, అంకెలే ఆయుధాలుగా ఆయన చేసిన యుద్ధం ప్రాంతీయ ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధాంతపరమైన పునాది వేసింది. విద్యాసాగర్ రావు అంటే ఇంజినీరు మాత్రమే కాదు; ఆయన ఒక నీటి విజ్ఞాన సర్వస్వం, తెలంగాణ రైతాంగం తరఫున అంతర్జాతీయ వేదికల మీద సైతం గళమెత్తిన అక్షర యోధుడు. నల్గొండ జిల్లాలోని జాజిరెడ్డిగూడెంలో జన్మించిన విద్యాసాగర్ రావు ప్రస్థానం ఒక సాధారణ ఇంజినీర్‌గా మొదలైంది.

కేంద్ర జలసంఘంలో ఉన్నత హోదాలో పనిచేసిన ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న నదీజలాల లభ్యత, వినియోగం, అంతర్రాష్ట్ర జలవివాదాలపై అపారమైన అవగాహన ఉండేది. సుమారు మూడు దశాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా జలవనరుల శాఖలో పనిచేసినా, ఆయన మనసంతా తెలంగాణ బీడు భూములపైనే ఉండేది. పదవీ విరమణ అనంతరం తన జ్ఞానాన్ని మాతృభూమి విముక్తి కోసం ఆయన ధారపోశారు.

ఉమ్మడి రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనలో జరుగుతున్న వివక్షను ఆయన రాజకీయ కోణంలో కాకుండా, ఇంజినీరింగ్ సూత్రాల ఆధారంగా విశ్లేషించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల విషయంలో తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని గణాంకాలతో నిరూపించారు. “నీరు ఉన్నచోటే హక్కు” అనే అంతర్జాతీయ నదీ సూత్రాలను ఉటంకిస్తూ, బేసిన్ బయట ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించడం చట్టవిరుద్ధమని ఆయన గర్జించారు.

రాష్ట్ర విభజన జరగకముందే తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను తేల్చాలని బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్లకు ఆయన సమర్పించిన నివేదికలు అత్యంత కీలకంగా నిలిచాయి. విద్యాసాగర్ రావు మరో గొప్ప లక్షణం క్లిష్టమైన సాంకేతిక అంశాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించడం. టీఎంసీలు, క్యూసెక్కులు, ఫ్లో లెవెల్స్ వంటి పదాలను పల్లెటూరి రైతులకు సైతం అర్థం చేయించారు. ఆయన రాసిన వ్యాసాలు, ప్రచురించిన కరపత్రాలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు సాగునీటిరంగంపై దిశానిర్దేశం చేసిన మేధోమిత్రుడు విద్యాసాగర్ రావు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాగునీటిరంగ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ప్రాజెక్టుల పునరాకృతిలో కీలక పాత్ర పోషించారు. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల కాలం నాటి జల నిర్వహణ వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని ఆయన తపించారు. గోదావరి జలాలను ఒడిసిపట్టి కోటి ఎకరాలకు మాగాణి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన సూచనలు వెలకట్టలేనివి.

విద్యాసాగర్ రావు జీవితం ఒక నిరంతర అధ్యయ నం. ఆయన వ్యక్తిత్వంలో ఎక్కడా రాజీ ధోరణి కనిపించదు. పదవుల కోసం లేదా ప్రలోభాల కోసం ఆయన ఎప్పుడూ తన సిద్ధాంతాలను వదులుకోలేదు. “తెలంగాణ వస్తేనే మన నీళ్లు మనకు వస్తాయి” అనే ఏకైక నినాదంతో ఆయన తన జీవితాన్ని గడిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ప్రసంగాలు వింటే సాగునీటి రంగంలో ఉన్న డొల్లతనం, పాలకుల వంచన కళ్లకు కట్టినట్లు కనిపించేది. “మా నీళ్లు మాకు కావాలి” అనే నినాదానికి ఒక తార్కికమైన, శాస్త్రీయమైన రూపం ఇచ్చింది విద్యాసాగర్ రావు.

ఆయన చూపిన బాటలోనే నేడు తెలంగాణ సాగునీటిరంగం అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ఎండిపోయిన చెరువులు నేడు అలుగులు పోస్తున్నాయంటే, ఒకప్పుడు ఎడారిని తలపించిన భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయంటే, విద్యాసాగర్ రావు మేధస్సు, శ్రమ అందుకు కారణం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలంగాణలో పారే ప్రతి చుక్క నీరు ఆయన పేరును స్మరిస్తూనే ఉంటుంది.

వ్యాసకర్త సెల్: 9440595494

రామకిష్టయ్య సంగనభట్ల