ట్రంప్‌పై హత్యాయత్నం
అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌పై మరోసారి హత్నాయత్నం జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అమెరికా రాజధాని వాషింగ్ట న్ డీసీలోని హిల్టన్ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌజ్ కరస్పాండెంట్ల విందులో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ సహా అమెరికా అగ్రనేతలను నిందితుడు కోల్ టోమస్ అలెన్ సమీపించకముందే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రముఖులెవరికీ ఏమీ కానప్పటికీ, ఈ ఘటనతో అమెరికా అగ్రనేతల భద్రతా వ్యవస్థలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటి ట్రంప్‌పై హత్యాయత్నానికి తెగబడటం ఇది మూడోసారి. గతంలో 2024లో పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లగా, ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలో ఆయుధాలతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పదే పదే ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా వ్యవస్థను పర్యవేక్షించే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాగా, అమెరికా అధ్యక్షుడిపై హత్యాయత్నం జరగం ఇదే మొదటిసా రి కాదు. గతంలో అమెరికా అధ్యక్షులు అబ్రహాం లింకన్, జేమ్స్ ఎ గ్యార్‌ఫీల్డ్, విలియం మెక్‌కిన్లీ, జాన్ ఎఫ్ కెన్నడీలు హత్యకు గురయ్యారు. 1981లో ఇదే హిల్టన్ హోటల్‌లో రోనాల్డ్ రీగన్‌పై కాల్పులు జరుగగా, ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్, రాజకీయ విభే దాలు, నాయకత్వంపై తీవ్రమవుతున్న అసహనం, అతివాద ఆలోచనలకు ఈ ఘటనలు నిదర్శనమని చెప్పవచ్చు. తాజా ఘటన మరోసారి ఇలాంటి చర్చలకు దారితీసింది. సాధారణంగానే ట్రంప్ ధోరణి వివాదాస్పదంగా ఉంటుంది. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అనుసరిస్తున్న విధానాలు, ఇతర దేశాలపై దాడులతో ఈ ధోరణి మరింతగా పెచ్చరిల్లిందన్న వాదనలున్నాయి. అయితే, ఆయనపై జరుగుతున్న హత్యాయత్నాలకు ఇవే కారణాలని చెప్పలేం.
ఇప్పటివరకు ఆ దిశగా దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారమూ దొరకలేదు. దాడులకు పాల్పడేవారు గ్రూపులుగా కాకుండా, ఒక్కరే కావడంతో వారిని ముందే గుర్తించడం సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి సవాలుగా మారుతోంది. అయితే, భద్రతా సిబ్బంది వేగంగా స్పందిస్తుండటంతో పెను ప్రమాదం తప్పుతోంది. అమెరికా రాజకీయ వ్యవస్థకు సవాలుగా మారిన ఈ ఘటనలను అగ్రరాజ్యం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.






