calender_icon.png 11 November, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాకవి, ఉద్యమ గేయ రచయిత అందెశ్రీకి ఘన నివాళి

11-11-2025 06:17:00 PM

ఘట్ కేసర్ లో అంత్యక్రియలు పూర్తి

నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు 

ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ప్రముఖ కవి, జయ జయహే తెలంగాణ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ఘట్ కేసర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో  నిర్వహించారు. ముందుగా అందెశ్రీ భౌతికకాయాన్ని  ఎన్ ఎఫ్ సి నగర్ లోని ఇంటి వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కళాకారుల ఆటపాటలతో నాట్యాలతో డప్పు చప్పుళ్ల మధ్య అందెశ్రీ అమర్ హై నినాదాలతో అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ అధ్యక్షులు ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం అందెశ్రీ పార్దివ దేహంపై పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు స్వయంగా అందెశ్రీ పాడే మోసి కడసారి వీడ్కోలు పలికారు.

ఆ తరువాత ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్రలో భారీగా ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.  అంత్యక్రియల కార్యక్రమంలో మాజీ కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ వి. హనుమంతరావు,  మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, రాచకొండ సీపీ సుధీర్ బాబు, కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పద్మజ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆర్డిఓ వెంకట నరసింహారెడ్డి, తహసిల్దార్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ రాజేష్, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, పిట్టల శ్రీశైలం, ప్రజా గాయకులు విమలక్క ఏపూరి సోమన్న, అశోక్, వెన్నెల, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ లు ముల్లి పావని జంగయ్యయాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన ప్రముఖ కవి, గేయ రచయిత స్వర్గీయ డాక్టర్ అందెశ్రీ ని కోల్పోవడం తెలంగాణ ప్రజలకి కాకుండా తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుంచు కొని పాఠ్య పుస్తకాల్లో 'జయ జయ హే తెలంగాణ' గీతం పెడతామని తెలిపారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తా మని, త్వరలోనే స్మృతివనం ఏర్పా టు చేస్తామని ప్రకటించారు. ఆయన రచించిన 'నిప్పుల వాగు' ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్ ఉపయోగ పడుతుందన్నారు.

ఆయన రచనలతో 20 వేల పుస్తకాలను ముద్రించి రాష్ట్రంలోని ప్రతీ గ్రంథాలయంలో అందుబాటులో ఉం చుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందెశ్రీ ప్రతి మాట, పాట ప్రజా జీవితంలో నుంచే పుట్టుకొచ్చిందే అన్నారు. తెలంగాణ ఉన్నంతకాలం అందెశ్రీ పోషించిన పాత్ర అమోఘమని కొనియాడారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇందుకు సహకరించాలని కోరారు. ప్రధానిని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ఆయన కుటుంబంలో నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో అందెశ్రీ పేరు శాశ్వతంగా ఉండే విధంగా ఆయన సమాధి స్థలం వద్ద సృతివనంగా తీర్చిదిద్దుతామన్నారు.