13 May, 2026 | 1:31 AM

సంధి అంటే వ్యూహాత్మక సహనమే

13-05-2026 12:00 AM

భూమిసంధిం యాచేత 

ప్రత్యాదేయాం, నిత్యామిత్రామ్ 

అనపాశ్రయాం, మహాక్షయ 

వ్యయనివేశాం వా అస్మై 

భూమిం దద్యాత్!

(కౌటిలీయం 12) శత్రువు బలవంతుడై, జయించడానికి వీలుకానప్పుడు సంధి చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. సంధిలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. సంధిని పరాజయంగా భావించకూడదు. శత్రువు కోశాన్ని (ధనాన్ని) కోరితే, అత్యంత శ్రేష్ఠమైన కోశాన్ని ఇవ్వాలి. అలాంటి కోశం పరులెవ్వరూ కొనలేనంత విలువైనది అయితే ఉత్తమం. ఎందు కంటే.. అది అతనికి ఉపయోగపడదు. మరొ క యుద్ధానికీ పనికిరాదు.

శత్రువు భూమిసంధిని కోరితే, తిరిగి తాను తీసికొనడానికి అనువైనది, శత్రువులకు దగ్గరగా ఉన్నది, దుర్గ రక్షణ లేనిది, నగరాదులను ఏర్పాటు చేయడానికి అధికమైన వ్యయప్రయాసలను కలిగించేది అయిన భూమిని ఇవ్వాలి. అవసరమైతే రాజధానిని మినహాయించి సర్వ స్వాన్నీ ఇచ్చివేసి అయినా సంధి చేసుకోవాలి, అంటాడు ఆచార్య చాణక్య.

శత్రువు దేనినైతే బలత్కారంగా లాక్కొంటాడో, దానినే ఉపాయం ద్వారా అనగా సం ధి అనే వంకతో ఇచ్చివేయాలి. బలవంతుడు ఎలాగైనా బలహీనుని సంపదను లాక్కుంటాడు.. అయితే ఇచ్చే దానిని వ్యూహాత్మ కంగా, సంధి పేరుతో ఇస్తే ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుంది. వ్యక్తి ఎప్పుడూ తన రక్షణకు ప్రాధాన్యతనీయాలే కాని అనిత్యమైన ధనానికి కాదు. బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు, అంటుంది, భార తం. సంధిచేసుకోవడం, ఓటమిని ఒప్పుకోవడం కాదు.. గెలవడానికి సమయం తీసుకో వడం మాత్రమే. 

మహాభారతంలో ధృతరాష్ర్టుడు.. భీష్ము డు, విదురుని సూచనలకు అనుగుణంగా ధర్మరాజును కౌరవ సామ్రాజ్యం మొత్తానికి యువరాజును చేశాడు. కానీ, దుర్యోధనుని ఈర్ష్యాసూయలకు, తనలోని పుత్రప్రేమకు తలొగ్గి ఖాండవప్రస్థ రాజ్యాన్ని మాత్రమే ఇచ్చి పంపించివేశాడు. ఖాండవప్రస్థం బలవంతులూ, అత్యంత క్రూరులైన నాగజా తివారికి నెలవు. వారు పగలంతా దట్టమైన అడవిలో తలదాచుకుంటూ, రాత్రులలో చుట్టూ ఉండే జనావాసాలను దోచుకునేవారు. దోపిడీలు, మానభంగాలు యథే ఛ్ఛగా సాగిపోయేవి. ఆ నాగజాతి వారి చేతి లో పాండవులు హతులైతే.. తనకు దాయాదుల బాధ తప్పిపోయి, తమకు శ్రేయస్సు కలుగుతుందని భావించాడు ధృతరాష్ర్టుడు.

ఆత్మవిశ్వాసం, సహనం మూర్తీభవించిన వ్యక్తిత్వం ధర్మరాజుది. కాబట్టే, మొత్తం రా జ్యానికి చక్రవర్తి కావలసిన తనకు అర్ధరాజ్యం మాత్రమే ఎందుకిస్తున్నారని, తత్ క్షణ ప్రయోజనాలను ఆశించి, వాదులాడలేదు. అరణ్య ప్రాంతమని తిరస్కరించనూ లేదు.. నాగజాతి వారి నుంచి ప్రమాదం ఎదురవుతుందని భయపడనూలేదు. విన య విధేయతలతో అంగీకరించాడు. కాలక్రమేణా ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించి మహా సామ్రాజ్య స్థాపనకు పునాదిని వేసుకున్నా డు. బలం చాలని సమయంలో ‘సహనం కూడా ఒక శక్తి’యనే సత్యాన్ని చాటిచెప్పాడు.

మన జీవితంలో కూడా చాలా సందర్భాలు ఖాండవప్రస్థంలాగే కఠినంగా కనిపి స్తాయి. వ్యక్తులు ఉద్యోగంలో ఎదురయ్యే సంఘర్షణలను జీర్ణించుకోలేక వెంటనే రాజీనామా చేయాలని భావిస్తారు. దానికి ప్రత్యామ్నాయంగా కొంతకాలం కష్టమైనా భరించి అనుభవం సంపాదించడం వల్ల దీర్ఘకాల ప్రయోజనాలు సమకూరుతాయి. అ లాగే వ్యాపారాలలో కలిగిన చిన్న చిన్న నష్టాలకు భయపడకుండా పెద్ద మార్కెట్‌ను సృ ష్టించుకోవడం.. అలాగే రాజకీయాల్లో సరైన సమయం వచ్చేవరకు వేచిచూడటం, ఇలాంటివన్నీ శాశ్వత విజయానికి వర్తమానంలో వేసుకునే మార్గంగా భావించవచ్చు.

ఒక గ్రామంలో ఇద్దరు రైతులు తమకు న్న పొలంలో ఒకరు వరిని నాటగా, మరొకరు వెదురును నాటాడు. వరిని నాటిన రైతుకు త్వరగానే ఫలితం చేతికందింది. వెదురును నాటిన రైతుకు సంవత్సరాలు గడు స్తున్నా ఫలితం రాలేదు. అయినా రైతు శ్ర మించాడే కాని భూమితో పోరాడలేదు. ఇం కా మొలకెత్తలేదని వెదురును నిందించలేదు. సహకరించలేదని ప్రకృతిని తిట్టుకో లేదు.. తోటివారు.. నీ శ్రమంతా వృథా అవుతున్నదని పరిహసించినా.. భరించాడే కాని, బాధపడలేదు. శ్రమించడమూ ఆపలేదు. సమయాన్ని ఆత్మీయ మిత్రునిగా భావించాడు.. శక్తి సరిపోని దశలో... కాలం తో సంధి చేసుకున్నాడు.

తాత్కాలిక ఫలితం కోసం ఆశపడక అంతర్గంగా బలం పెరిగే వరకు ఎదురుచూశాడు. కొన్నాళ్లకు వెదురు మొలకెత్తి ఎత్తుగా, ఏపుగా పెరిగి ఆకాశాన్ని తాకింది. సంవత్సరాల నిరీక్షణకు రెండింతల ఫలితాన్నిచ్చింది. నిజానికది చివరి సంవత్సరంలో పెరగలేదు.. అన్ని సంవత్సరాలూ తానెంత ఎత్తుకు ఎదగాలనుకున్నదో దానికి అవసరమైనంత లోతుగా వేర్లను భూమిలో వ్యాపిం పజేసుకున్నది. మన అపజయాలు కూడా వెదురు వేర్ల లాంటివే.. భవిష్యత్తులో సాధించే భారీ విజయాన్ని మోసేందుకు సన్నద్ధమవుతాయి. 

వ్యక్తులు అపజయాన్ని పొందిన సమయంలో దానిని సహనానికి పరీక్షగా భావిం చి.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, అనుభవాన్ని సాధించడం, వ్యూహాత్మకంగా అంతర్గ త బలాన్ని పెంచుకోవడం వల్ల సాధించిన విజయమనే వేర్లు బలంగా పాతుకుపోతా యి. సంధి అంటే కేవలం శత్రువుతో చేసుకునే ఒప్పందమే కాదు. తన బలాబలాలను, పరిస్థితిని అర్థం చేసుకుని, తత్ క్షణ సంఘర్షణలను నివారించి, భవిష్యత్తు విజయానికి పునాదులు వేసుకోవడంగా భావించాలి. 

ఒక అడవికి సింహం రాజుగా ఉండేది. దానికి ఒక తెలివైన నక్క మంత్రిగా ఉండేది. వృద్ధాప్యం మీదపడగా దాని వేగం తగ్గింది. ఒకరోజు యౌవనంలో ఉన్న మరొక సిం హం ఆ అడవికి వచ్చి, క్రూరంగా ప్రవర్తిస్తూ, జంతువులన్నింటినీ భయపెట్టసాగింది. వృద్ధ సింహం దానితో పోరాడి తన జంతువులను రక్షిస్తానని బయలుదేరింది. అప్పుడు నక్క.. ‘రాజా! మీలో ఉత్సాహం ఉన్నా వయసురీత్యా యౌవనంలో ఉన్న సింహంతో పోరా డితే ప్రమాదం ఎదురుకావచ్చు. కొంత కాలం ఓపిక పట్టండి. ప్రస్తుతం సంధి చేసుకుందాం. తదుపరి అది గర్వం తలకెక్కి, ప్రమత్తతతో నిర్లక్షంగా ఉన్న సమయంలో, దాడిచేసి దానిని సంహరించడం ఉత్తమం’ అన్నది.

వృద్ధ సింహమూ నక్క మాటలను గౌరవించి, అహంకారాన్ని తగ్గించుకొని, సహనాన్ని పాటించి, సంధి చేసుకుంది. కొద్ది కాలం తదుపరి కొత్తగా వచ్చిన సింహం అతి విశ్వాసంతో జాగ్రత్తలు మానేసింది. వేటలో అలసిపోయి ఒంటరిగా, అజాగ్రత్తగా ఉన్న సమయంలో వృద్ధ సింహం దానిపై దాడిచే సి సంహరించింది. వృద్ధ సింహం వెనక్కి త గ్గడం భయంతో కాదు.. గెలిచే సమయాన్ని నిర్ణయించుకోవడానికే. నిజానికి కాలం ప్రతి వ్యక్తికీ పరీక్షగా నిలుస్తుంది.. దానిని అధిగమించగలిగిన వ్యక్తి జీవిత సమరంలో విజ య సాధకుడవుతాడు. తాత్కాలికంగా సహనం చూపేవానిని అసమర్థునిగా లోకం భా వించవచ్చు.. అతనే విజయం సాధిస్తే లోక మే అతనికి నీరాజనాలు పడుతుంది.