13 May, 2026 | 1:31 AM

తీర్పు చెప్పాల్సింది కాలమే!

13-05-2026 12:00 AM

కొందరు రాజకీయ విశ్లేషకులు వామపక్షాల ‘అవసాన దశ’ గురించి రాస్తున్నప్పుడు, నాకు జైలు గోడల మధ్య గడిపిన ఆ చీకటి రోజులు గుర్తొస్తున్నాయి. ‘ఉపా’ వంటి కఠిన చట్టాల కింద 100 రోజులు విచారణ ఖైదీగా ఉండి, ఐదేళ్ల తరువాత కోర్టు ద్వారా ‘నిర్దోషి’గా బయటపడిన నా దృష్టిలో.. వామపక్షం అంటే ఎన్నికల గుర్తో, పార్లమెంటు సీటో కాదు. అది అణచివేతకు వ్యతిరేకంగా వినబడే ఒక రాజ్యాంగబద్ధమైన ధిక్కార స్వరం. ఆ స్వరాన్ని గొంతు నొక్కాలని చూసిన వ్యవస్థలే నాకు మనిషిని బంధించవచ్చు కానీ, మౌలికమైన ప్రశ్నలను కాదని ఒక నిజాన్ని నేర్పాయి. కొందరు విశ్లేషకులు చెప్పినట్లు వామపక్షాల బలం ఎన్నికల్లో తగ్గి ఉండవచ్చు.

కానీ, దేశంలో అసమానతలు పెరిగినప్పుడు, గిరిజనుల భూ ములు కార్పొరేట్లకు ధారాదత్తం అవుతున్నప్పుడు, ప్రశ్నించే గొంతులపై దేశద్రోహం ముద్ర వేస్తున్నప్పుడు, వామపక్ష భావజాలం మరింత అవసరమవు తుంది. అవసరం కూడా. దేశంలో వామపక్షాల సంక్షోభం గురించి విశ్లేషించేవారు ఓట్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కానీ, ఒక బాధితుడిగా జైలు లోపల నేను చూసిన దృశ్యం వేరు. అక్కడ విచారణ కోసం ఎదురుచూస్తున్న మెజారిటీ ప్రజలు దళితులు, ఆదివాసీలు, గరీబోళ్లే.

వారి హక్కుల గురించి, వారికి అందాల్సిన న్యాయం గురించి మాట్లాడే ఏకైక భావజాలం ‘లెఫ్ట్’. ఆ భావజాలం చనిపోయిందని ప్రకటించడమంటే, పీడిత వర్గాల ఆశ చనిపోయిందని చెప్పడమే. అసమానతలు ఉన్నంత కాలం వామపక్ష సిద్ధాంతం తన ప్రాముఖ్యతను కోల్పోదు. అది ఎన్నికల రాజకీయాల్లో వెనుకబడి ఉండవచ్చు కానీ, సామాజిక అవసరంగా మరింత బల పడుతోంది. ఆర్థిక సంస్కరణల తర్వాత వామపక్షం బలహీనపడిందని కొందరి వాదనలు ఉన్నప్పటికీ ఉపాధిహామీ, సమాచార హక్కు, అటవీ హక్కుల చట్టాల వంటివి కాగితాలు కావు.

అవి దశాబ్దాల వామపక్ష పోరాట ఫలితాలు. నేడు ఆ చట్టాలను నీరుగారుస్తున్న తరుణంలో, వాటిని కాపాడుకోవడానికి పార్లమెంటరీ రాజకీయాల కంటే మించిన ‘క్షేత్రస్థాయి చైతన్యం’ ఎంతో అవసరం. ఎన్నికల్లో ఓడిపోవడం అంటే సిద్ధాంతం విఫలమైనట్లు కాదు. పార్టీల నిర్మాణాలు బలహీనపడి ఉండవచ్చు, కానీ అవి లేవనెత్తే అంశాలు అంటే కనీస వేతనం, భూమి హక్కు, కార్పొరేట్ దోపిడీ ఇప్పటికీ అత్యంత వాస్తవికమైనవి. మనది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఏ సిద్ధాంతమైనా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. ‘ఉపా’ వంటి చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలంటే, వామపక్షాలు మరింతగా చట్టపరమైన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి. పాత నినాదాలు ఇక పనిచేయవు.

ఈ తరం జర్నలిస్టుగా నేను చెప్పేది ఒక్కటే డిజిటల్ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, ఆదివాసీల రక్షణ, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడం. విచారణ ఖైదీల హక్కుల గురించి మాట్లాడటమే నేటి అసలైన ‘లెఫ్ట్’ రాజకీయంగా ఉండాలి. చట్టం ప్రకారం ‘నిరూపితమయ్యే వరకు ప్రతిఒక్కరూ నిర్దోషులే’. కానీ ‘ఉపా’ వంటి చట్టాల్లో ఇది ఉల్టా అవుతోంది. ఇక్కడ వామపక్షాల అవసరం ఉంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకోవడాని కి నిరంతరం వాదించాలి. వామపక్షాల పునరుజ్జీవనం పాత నినాదాలతో సాధ్యం కాదు. నేటి కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందాలి.

వామపక్ష ఉద్యమాలు రోడ్ల మీద ధర్నాలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలో చట్టపరమైన సాయం అందించే స్థాయికి ఎదగాలి. వామపక్ష పార్టీలు యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా తమ భాషను, శైలిని, ఆచరణను మార్చుకోవాలి. వ్యవస్థను ప్రశ్నించే చైతన్యం చట్టబద్ధంగా ఉన్నంత కాలం, ఏ శ్రద్ధాంజలి ప్రకటనలూ పని చేయవు. ఇక విశ్లేషకులు రాస్తున్న ‘సంతాప సందేశాలు’ వారి తొందరపాటును సూచిస్తున్నాయే తప్ప, ఆ సిద్ధాంతం అంతాన్ని కాదు.

ఎందుకంటే, ఎక్కడైతే అన్యా యం జరుగుతుందో, అక్కడ ఎర్ర జెండా మళ్లీ రెపరెపలాడుతుంది. అది పార్టీ రూపంలో కాకపోయినా, ఒక సామాజిక ఆవేదనగా, ఒక ధిక్కా ర కేకగా వినిపిస్తూనే ఉంటుంది. చరిత్రను గమనిస్తే, ఏ సిద్ధాంతమైనా అంత సులభంగా మర ణించదు. ముఖ్యంగా అది ప్రజల ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్నప్పుడు. జైలు కడ్డీలు గొంతును ఆపలేనప్పుడు, విశ్లేషకుల కలం పోట్లు ఆశను చంపలేవు. అందుకే తీర్పు చెప్పాల్సింది విశ్లేషకులు కాదు, కాలం..!

 వ్యాసకర్త: జర్నలిస్ట్