1 August, 2026 | 1:05 AM

ఆత్మీయతకు నిలువెత్తు నిదర్శనం

01-08-2026 12:00 AM

మంథనిలో మేనత్త వనమాలకు శ్రద్ధాంజలి

హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి 

ధైర్యం చెప్పిన మంత్రి శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు 

మంథని, జూలై 31 (విజయక్రాంతి): దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల దశదినకర్మ కార్యక్రమం శుక్రవారం మంథనిలోని శివకిరణ్ గార్డెన్స్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమంలోనే ఉండి విచ్చేసిన బంధువులు, మిత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

తనకు సొంత అత్త అయిన సువర్ణ వనమాలపై ఉన్న ఆప్యాయత, కుటుంబ బంధానికి విలువనిస్తూ మంత్రి శ్రీధర్ బాబు కార్యక్రమం ముగిసే వరకు అక్కడే ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే శ్రీను బాబు కూడా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంథని ప్రాంతంలో ఎవరి ఇంట్లో విషాదం చోటుచేసుకున్నా, అధికారిక కార్యక్రమాల మధ్య సమయం కేటాయించి స్వయంగా వెళ్లి పరామర్శించడం, బాధిత కుటుంబాలతో మమేకమవడం మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబుల ప్రత్యేకతగా స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు కావడం వారి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని పలువురు కొనియాడారు.