1 August, 2026 | 1:55 AM

అనుమతి రెండంతస్తులకు.. నిర్మాణాలు ఐదంతస్థులు

01-08-2026 01:05 AM
  1. సామాన్యులకే నిబంధనలు.. 
  2. పర్యవేక్షణ లేని అధికారులు
  3. ఘనపూర్లో యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు.. 
  4. నిద్రావస్థలో తెల్లపూర్ మున్సిపల్ అధికారులు

పటాన్ చెరు/ రామచంద్రాపురం, జులై 31 : పటాన్చెరు మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఘనపూర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రెసిడెన్షియల్ భవనాలకు జీ ప్లస్2 లేదా జీ ప్లస్3 వరకు మాత్రమే అనుమతులు పొందినప్పటికీ జీ ప్లస్5, జీ ప్లస్6 వరకు నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

ఇంత జరుగుతున్నా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం నిర్మాణాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన సెట్బ్యాక్లు, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, పార్కింగ్ నిబంధనలు, ఇతర భవన నిర్మాణ నియమాలు అనేక చోట్ల పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదని, అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు చూస్తూ ఉండి, తర్వాత నోటీసులతో సరిపెడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

నగర ప్రణాళిక నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తులో ప్రమాదాలు సంభవిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులకు మించి అంతస్తులు నిర్మించడం, సెట్బ్యాక్లు వదలకపోవడం, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

‘పర్మిషన్ ఒకటైతే... నిర్మాణం మరొకటా?‘, ‘నిబంధనలు సామాన్యులకేనా?‘, ‘అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?‘ అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినా సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం లేదని, దీంతో అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపిస్తున్నారు.

ఘనపూర్ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై సమగ్ర సర్వే నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సంబంధిత అధికారుల పనితీరుపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సర్ కార్యక్రమం తర్వాత చర్యలు తీసుకుంటాం

ఘనపూర్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే సిబ్బంది అంతా సర్ కార్యక్రమంలో ఉన్నందున ఆగస్టు 3 తర్వాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

- రమేశ్, టీపీవో  తెల్లాపూర్