30 May, 2026 | 2:47 AM

సేవే ధర్మమనే విజనరీ లీడర్!

30-05-2026 12:00 AM

సౌమ్యత ఆయన వ్యక్తిత్వం. సేవ ఆయన జీవన విధానం. అభివృద్ధి ఆయన ధ్యేయం. ప్రజల సంక్షేమం ఆయన శ్వాస. సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యే నాయకుడు.. కష్టాల్లో ఉన్నవారికి కొండంత భరోసా ఇచ్చే మనిషి.. మాటల కంటే చేతల్లో చూపించే ప్రజానాయకుడు.. మన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రాజకీయాల్లో విలువలకు, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన శ్రీధర్ బాబు తన తం డ్రి రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కాదు.. ప్రజల పట్ల ప్రేమ, సేవాతత్వం, నిబద్ధతను కూడా వారసత్వంగా అందిపుచ్చుకున్న ప్రజానాయకుడని చెప్పవచ్చు.

పదవులు చాలామందికి వరిస్తాయి. కానీ, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించేది కొద్దిమందే. అలాంటి అరుదైన నాయకుడు శ్రీధర్ బాబు. సామాన్య కార్యకర్త నుంచి మేధావుల వరకు అందరితో సమానంగా మెలిగే నాయకత్వం ఆయనది. 

కాటారం మండలం ధన్వాడ గ్రామ మట్టిలో పుట్టి.. ప్రజల కష్టాలను చిన్ననాటి నుంచే కళ్లా రా చూసి పెరిగిన నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. గ్రా మీణ జీవితం ఇచ్చిన విలువలు.. తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు చూపిన ప్రజాసేవ మార్గం.. ప్రజల పట్ల ఉన్న అపా రమైన ప్రేమ ఆయనను నేడు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక శక్తిగా నిలబెట్టాయి. పేదల కన్నీటి విలువ తెలిసిన మనిషిగా.. ప్రజల బాధను తన బాధగా భావించే నాయకుడిగా.. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.

తెలంగాణ రాజకీయ చరిత్రలో నిష్పక్షపాత స్పీకర్‌గా, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు శ్రీపాదరావు. ఆయన ఆశయాలను, సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్న వారసుడిగా శ్రీధర్ బాబు ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన ఆయన.. అనంతరం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు. కాగా, 1998లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన శ్రీధర్ బాబు.. తండ్రి అకాల మరణంతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. 

29 ఏళ్లకే రాజకీయ అరంగేట్రం..

1999 అసెంబ్లీ ఎన్నికల్లో 29 ఏళ్ల వయసులోనే మం థని నుంచి పోటీచేసిన శ్రీధర్ బాబు ఘన విజయం సాధించారు. 1999, 2004, 2009, 2018, 2023 అ సెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో మంథని నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రికార్డును శ్రీధర్ బాబు అధిగమించారు. మంథని ప్రజలకు శ్రీధర్ బాబు కేవలం ఎమ్మెల్యే కాదు.. కుటుంబ సభ్యుడు, సమస్యల సమయంలో ముందుండే ఆత్మబంధువు కూడా.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతానికి శ్రీధర్ బాబు కీలకంగా పనిచేశారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లారు. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర, ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచారు. వైఎస్సార్ తన రాజకీయ గురువు అని శ్రీధర్ బాబు తరచూ చెబుతుంటారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్ బాబు, నేడు రేవంత్ మంత్రివర్గంలో కీలక మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అంతేకాదు, శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన సమయంలో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును అ సెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ ఆవిర్భావ చరిత్రలో శ్రీధర్‌బాబు పేరు ప్రత్యేకంగా నిలిచిపోయింది.

కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర..

2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న కీలక వ్యూహకర్తల్లో శ్రీధర్ బాబు ఒకరు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతులు, మహిళలు, యువత, మేధావుల అభిప్రాయాలను సేకరించారు. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి కీలక హామీల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా రూపొందిన ఆ మ్యానిఫెస్టో కాంగ్రెస్ విజయానికి బలమైన ఆయుధమైంది. జూలై 2022 నుంచి ఆగస్టు 2024 వరకు కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా, ఏఐసీసీ కార్యదర్శిగా కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి దోహదం చేశారు.

రేవంత్ టీమ్‌లోనూ..

ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు అత్యంత చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దావోస్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో నిర్వహించిన పెట్టుబడి సదస్సుల్లో పాల్గొని, వివిధ కంపెనీలు రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు.

తద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఏఐ, సెమీకండక్టర్, డేటా సెంటర్, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన ముందుకుసాగుతున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్‌లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ప్రపంచ స్థాయి శిక్షణ అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఫార్మా, ఏవియేషన్, లాజిస్టిక్స్, రిటైల్, ఐటీ రంగాల్లో ప్రత్యేక శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు.

మంథనికి రాచబాట..

శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథని నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా మారింది. జేఎన్టీయూ, డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, ఆరోగ్య సేవల అభివృద్ధికి వందల కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టితో సాగునీటి వసతులు, రైతు సంక్షేమం, పేదలకు భూపంపిణీ వంటి అంశాల్లో చురుకుగా వ్యవహరించారు. మంథనిలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారు.

సరస్వతి పుష్కరాల నిర్వహణ

2025 సరస్వతి పుష్కరాలు, ప్రస్తుతం సాగుతున్న అంత్యపుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంలో శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రూ.200 కోట్లతో కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి, రూ.4 కోట్లతో మోడల్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, రహదారుల విస్తరణ, యాత్రికులకు సౌకర్యాల కల్పనలో ఆయన కృషి ప్రశంసనీయం.

ప్రజలే దేవుళ్లు.. సేవే ధర్మం..

పదవులు చాలామందికి వరిస్తాయి. కానీ, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించేది కొద్దిమందే. అలాంటి అరుదైన నాయకుడు శ్రీధర్ బాబు. సామాన్య కార్యకర్త నుంచి మేధావుల వరకు అందరితో సమానంగా మెలిగే నాయకత్వం ఆయనది. పేదల పక్షాన నిలుస్తూ.. యువత భవిష్యత్తు కోసం కృషి చేస్తూ.. తెలంగాణ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయన నిజమైన ప్రజానాయకుడు. అందుకే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు తెలంగాణలో ఒక నమ్మకం.. బ్రాండ్.. ప్రజా శక్తిగా మారింది. 58వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఆయన ఆయురారోగ్యాలతో, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకుసాగాలని.. తెలంగాణ అభివృద్ధిలో మరింత ఉన్నతంగా సేవ చేయాలని కోరుకుందాం.

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9441884389